అజ్ఞాతవాసి డిజాస్టర్ అయింది. దీంతో నిర్మాత రాధాకృష్ణ రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు షురూ చేశారు. కొందరికి నష్టంలో 30శాతం, మరికొందరికి నష్టాల్లో 50శాతం భర్తీ చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా దిల్ రాజుకు 7కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేందుకు రాధాకృష్ణ ఒప్పుకున్నారని, మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా మెల్లమెల్లగా సెటిల్ మెంట్లు స్టార్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ మొత్తం ఎపిసోడ్ తో స్పైడర్ సినిమా మరోసారి తెరపైకొచ్చింది.
మహేష్ నటించిన ఈసినిమా కూడా భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది. అజ్ఞాతవాసికి ఏమాత్రం తీసిపోని నష్టాలే ఇవి కూడా. కానీ స్పైడర్ నిర్మాతలు మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. కనీసం ఆదుకుంటానని హామీ కూడా ఇవ్వలేదు. దాదాపు 90కోట్ల రూపాయలతో తెరకెక్కిన స్పైడర్ సినిమా 124కోట్ల రూపాయల థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఒక్క నైజాంలోనే ఈ సినిమాను 24కోట్ల రూపాయలకు అమ్మారు.
రిలీజైన తర్వాత ఈసినిమా డబుల్ డిజాస్టర్ అయింది. ఇది ఏ రేంజ్ లో దెబ్బ కొట్టిందంటే.. ఒక దశలో ఇక తను సినిమాలు పంపిణీ చేయనని దిల్ రాజు స్వయంగా మీడియా ముందు మొత్తుకున్నారు. అలా డబుల్ డిజాస్టర్ అయిన స్పైడర్ సినిమాకు సంబంధించి నష్టాలు భర్తీ చేయమని దిల్ రాజుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్లు చాలామంది డిమాండ్ చేశారు.
భరత్ అనే నేను సినిమాతో నష్టపోయిన బయ్యర్లను కొంతమందిని ఆదుకునేందుకు మహేష్ ముందుకొచ్చాడంటూ ఆ మధ్య వార్తలొచ్చాయి. తన కొత్త సినిమాను డిస్కౌంట్ రేట్లకు వాళ్లకు ఇవ్వడానికి మహేష్ రెడీ అయినట్టు వచ్చిన వార్తల్ని నిర్మాత డీవీవీ దానయ్య ఖండించాడు. అలాంటిదేం లేదని క్లియర్ గా చెప్పేశాడు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
తాజాగా అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి నిర్మాత ఇలా నష్టాల భర్తీకి ముందుకు రావడంతో.. ఇప్పుడు మరోసారి స్పైడర్ పంపిణీదారులు తమ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. రాధాకృష్ణ టైపులో కనీసం 30నుంచి 50శాతమైనా రికవరీ చేయాలని కోరుతున్నారు. స్పైడర్ సినిమాను ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించారు.