మంచి సినిమా చేసాం, చూడండి అనేవాళ్లను చూసి వుంటారు. ఓ ప్రయత్నం చేసాం, ఆదరించండి అనే వాళ్లను చూసి వుంటారు. అంతే కానీ, మా సినిమా నచ్చని వాళ్లు వేస్ట్ ఫెలోస్ అనడం ఎప్పుడైనా విన్నారా? కన్నారా? కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల అలాగే అంటున్నారు.
ఆమె తన కథ, దర్శకత్వంలో 'మనసుకు నచ్చింది' అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందిస్తున్నారు. సందీప్ కిషన్ కథానాయకుడు. ఈసినిమాకు సంబంధిచిన పాటల ఫంక్షన్ జరిగింది.
ఈకార్యక్రమంలో మంజుల మాట్లాడుతూ, తమ సినిమా నచ్చని వారు వేస్ట్ ఫెలోస్ అని కుండ బద్దలు కొట్టినట్లు అనేసారు. ఎందుకంటే, హార్ట్ వున్నవాళ్లందరికీ తమ సినిమా నచ్చుతుందట. అలా నచ్చలేదు అంటే వాళ్లకు హార్ట్ లేదు, వేస్ట్ ఫెలోస్ అని అర్థం అంట.
సందీప్ కిషన్ హీరో. కొత్త హీరోయిన్. సూపర్ స్టార్ ఫ్యామిలీ మెంబర్ అన్న ట్యాగ్ లేకుంటే ఔత్సాహిక దర్శకురాలు. అలాంటి ప్రాజెక్టును పాజిటివ్ గా బజ్ తీసుకువచ్చి జనాల్లోకి తీసుకెళ్లాలి కానీ, ఇలా నచ్చని వాళ్లు వేస్ట్ ఫెలోస్ అని ముందే అనేయడం ఏమిటి? వెళ్లిన తరువాత తీరా నచ్చకపోతే తమని వేస్ట్ ఫెలోస్ అంటారని, ముందే సినిమాకు దూరంగా వుండే ప్రమాదం వుంది.