మూడు సినిమాల ముచ్చట్లు

మరో మూడు రోజుల్లో మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సాధారణంగా ఒకే రేంజ్ కు చెందిన మూడు సినిమాలు పోటీ పడడం అన్నది టాలీవుడ్ లో రేర్ గా జరుగుతుంటుంది. అలా విడుదల కావడం…

మరో మూడు రోజుల్లో మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. సాధారణంగా ఒకే రేంజ్ కు చెందిన మూడు సినిమాలు పోటీ పడడం అన్నది టాలీవుడ్ లో రేర్ గా జరుగుతుంటుంది. అలా విడుదల కావడం ఇబ్బంది కూడా. పైగా థియేటర్లలో భాగమతి, టచ్ చేసి చూడు, ఛలో అనే మూడు సినిమాలు ఈవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి.

ఎందుకంటే షేర్ రాబట్టుకోవడంలో ఛలో, భాగమతి, టచ్ చేసి చూడు ఇప్పట్లో థియేటర్ లోంచి తీసేసే స్థాయిలో అయితే లేవు. వీటితో పాటు హిందీ డబ్బింగ్ సినిమా పద్మావతి కూడా బాగానే రాబడుతోంది.

కొత్తగా మూడు సినిమాలు జాయిన్ అయ్యాక పరిస్థితి ఎలా వున్నా, ముందు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఈమూడూ షేర్ చేసుకోవాలి. అది తప్పదు. చిత్రమేమిటంటే, మూడూ మూడు డిఫరెంట్ జోనర్లు కావడం. ఒకటి యూత్ ఫుల్ లవ్ స్టోరీ. రెండవది మాస్ ఎంటర్ టైనర్. మూడవది ఫ్యామిలీ టచ్ వున్న డిఫరెంట్ మూవీ. అందువల్ల తొలి రోజు వచ్చే టాక్ ను బట్టే ఈమూడు సినిమాల్లో విజేత ఎవరు అన్నది తేలుతుంది.

సాయి ధరమ్ ఇంటిలిజెంట్ కు ఓపెనింగ్స్ లో ప్రయారిటీ వుంటుంది. అందులో సందేహం లేదు. ఎందుకంటే వివి వినాయక్ పేరు, మాస్ ఎంటర్ టైనర్ కావడం అన్నది. దాంతో పాటే విడుదలవుతున్న గాయత్రికి బజ్ బాగుంది. చాలా కాలం తరువాత మంచు ఫ్యామిలీ సినిమాకు ఈరేంజ్ బజ్ వచ్చిందనే చెప్పాలి.

వదుల్తున్న ప్రోమోలు, యంగ్ యాక్టర్లతో సమానంగా సీనియర్ హీరో మోహన్ బాబు పాల్గొంటున్న ప్రచార కార్యక్రమాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. కాస్త వాస్తవం మాట్లాడుకోవాలంటే, ప్రమోషన్లలో వరుణ్ తేజ తొలి ప్రేమ కాస్త వీక్ అయింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తప్పిస్తే, ప్రచార కార్యక్రమాలకు ఇంకా తెర తీయలేదు.

ఇన్ సైడ్ టాక్ పరంగా చూసుకుంటే ఇంటిలిజెంట్ కు అంత గొప్ప టాక్ లేదు. కానీ వినాయక్-ఆకులశివ కాంబినేషన్ లో వుండే మాస్ ఫన్ మీదే అందరి ఆశలు వున్నాయి. అవి బి సి సెంటర్లలను కచ్చితంగా ఆకట్టుకుంటాయి.

ఇక గాయత్రి సినిమా సెకెండాఫ్ చాలా బాగా పండిదని, మోహన్ బాబు విలన్ పాత్ర చాలా బాగా వచ్చిందన్నది ఇన్ సైడ్ టాక్. పొలిటికల్ డైలాగులు గట్టిగా పడ్డాయంటున్నారు. అవి కూడా వర్తమాన రాజకీయాల మీద కాబట్టి, జనాలకు పట్టే అవకాశం వుంది.

తొలిప్రేమ సినిమా ఆది నుంచీ క్లాస్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ట్రయిలర్ కూడా అలాగే వుంది. కలర్ ఫుల్ గా, ఫీల్ గుడ్ లవ్ రొమాటిక్ గా వుంది. అందువల్ల మల్టీ ఫ్లెక్స్ లు, అర్బన్ ఆడియన్స్ అటు మొగ్గే చాన్స్ వుంది.

విడుదల రోజున వందకు కనీసం 75మార్కులు ఏ సినిమా తెచ్చుకుంటే ఆ సినిమానే మర్నాటి నుంచి ప్రయారిటీలో వుంటుంది. మిగిలిన సినిమాలు ఆ తరువాత ప్రయారిటీ జాబితాలోకి వస్తాయి. గాయత్రి టైటిల్ బట్టి, సీనియర్ హీరో మోహన్ బాబును చూసి ఫ్యామిలీలు, సాయిధరమ్-వినాయక్ కోసం బి సి సెంటర్లు, తొలి ప్రేమ కోసం క్లాస్ ఆడియన్స్ అయితే ప్రస్తుతానికి వెయిట్ చేస్తున్నారు.