సినిమా హిట్ అయితే హీరోకు పేరు రావడం, సినిమాలు రావడం సంగతి అలా వుంచితే డైరక్టర్లకు మాంచి అవకాశాలు పరుగెత్తుకుంటూ వస్తాయి. అందునా ఇప్పడు టాలీవుడ్ లో విషయం కాస్తయినా వున్న డైరక్టర్ ఎవరు దొరకుతారా? ఏ కథ వున్న డైరక్టర్ దొరుకుతారా? అని తెగ వెదుకుతున్నారు. అందువల్ల సినిమా హిట్ అయితే అందులో డైరక్టర్ క్రెడిట్ వుంటే మాత్రం అస్సలు వదలడంలేదు.
అర్జున్ రెడ్డి హిట్ కాగానే ఆ సినిమా డైరక్టర్ వెనుక అలాగే పడ్డారు. ఈ నెలలో రెండు హిట్ సినిమాలు వచ్చాయి. ఒకటి భాగమతి. రెండవది ఛలో. భాగమతి డైరక్టర్ అశోక్ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసారు. కానీ చిత్రంగా భాగమతి హిట్ వల్ల ఆయన పేరు మాత్రం మారుమోగలేదు. అంతా సూపర్ గా సెట్ వేసారు. సినిమాటోగ్రఫీ అదిరింది. థమన్ మ్యూజిక్ బాగుంది. యూవీ వాళ్లు బాగా ప్రమోట్ చేసారు. అంటున్నారు తప్ప, డైరక్టర్ సూపర్ అని ఎక్కడా వినిపించలేదు.
అంతేకాదు, భాగమతి సినిమా హిట్ టాక్ వచ్చాక, ఏ బ్యానర్ లేదా ఏ హీరో అర్జెంట్ గా అశోక్ వెనుక పడినట్లు గుసగుసలయినా వినిపించలదు. కానీ ఛలో దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం రివర్స్ లో వుంది. సినిమా క్రెడిట్ ఎక్కువగా డైరక్టర్ వెంకీ కుడుమలకు వెళ్లిపోయింది. సినిమా విడుదలయిన మర్నాడే బోలెడు ఆఫర్లు వెంకీని వెదుక్కుంటూ వచ్చాయి. ఏది ఒప్పుకోవాలా? ఏది వద్దా? అని కిందామీదా అయ్యేంతగా వచ్చాయి.
ఇదే చిత్రంగా వుంది. భాగమతి హిట్ అయితే అలా. చలో హిట్ అయితే ఇలా. ఎందుకలా? భాగమతి హిట్ లో డైరక్టర్ అశోక్ పార్టిసిపేషన్ లేదా? లేక గతకాలపు పరాజయాలు ఆయనను ఇంకా వెన్నాడుతున్నాయా?