అంతవరకూ మోడల్ గా తన పాట్లను తను పడుతూ… అవకాశం దొరికిన సినిమాల్లో అడ్డగోలుగా ఎక్స్ పోజింగ్ చేసేస్తూ.. సక్సెస్ కోసం ఎదురుచూపుల్లో ఉన్న కత్రినాకైఫ్ కు బ్రేక్ ను ఇచ్చింది సల్మాన్ ఖాన్.
ఆమెను బాలీవుడ్ లో ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకుని.. అవకాశాలు ఇప్పించాడు, అలాంటి సినిమాల్లో కొన్ని హిట్టు కావడంతో.. కత్రినా దశ తిరిగింది. నటనరాదు, హిందీ రాదు.. అని విమర్శలు వచ్చినా కత్రినా నిలదొక్కుకుందంటే అదంతా సల్మాన్ చలువే.
ఆ బంధంతో కొన్నాళ్ల పాటు సల్మాన్ కు ప్రేయసిగా చలామణి అయ్యింది కత్రినా. ఆ తర్వాత బ్రేకప్.. కత్రినాకు కూడా సల్లూ అవసరం తగ్గిపోయింది. హీరోయిన్ గా నిలదొక్కుకోవడం, అదే సమయంలో మరో కుర్ర హీరో ఆమె వెంటపడటం.. కొన్నాళ్ల పాటు ప్రేమాయణం, సహజీవనం.. బ్రేకప్.. మళ్లీ సింగిల్.
అదంతా ఒక చాప్టర్. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ సల్లూకు దగ్గరైంది కత్రినా. ఈ మధ్యనే కలిసి మరో సినిమా చేశారు. అది హిట్టైంది. ఇదే ఊపులో తన చెల్లెలు బాధ్యతలను సల్లూ మీద పెడుతోందట కత్రినా. ఈమె చెల్లెలు ఇసబెల్ కైఫ్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. ఆమెను ప్రమోట్ చేసే బాధ్యతను సల్మాన్ తీసుకుంటున్నాడని సమాచారం.
తన హోం ప్రొడక్షన్ లో రూపొందే ఒక సినిమా ద్వారా ఇసబెల్ కు అవకాశం ఇస్తానని కత్రినాకు సల్లూ ప్రామిస్ చేశాడని బాలీవుడ్ పత్రికలు కోడై కూస్తున్నాయి. మొత్తానికి అక్కకే కాకుండా చెల్లికి కూడా సల్లూ అండ లభించినట్టుగా ఉంది. ఈమె బాలీవుడ్ లో ఎలా వెలుగుతుందో చూడాలి!