అదే ‘టచ్’.. అదే ‘చూడడం’

మాస్ మహరాజా అన్నది రవితేజ ఫ్యాన్స్ టాగ్ లైన్. రవితేజ టైపు సినిమాలు రెండు విధాలుగా వుంటాయి. అయితే అతనికి మాత్రం నప్పే తరహా కామెడీ ప్లస్ యాక్షన్ సినిమాలు. లేదా ఫవర్ ఫుల్…

మాస్ మహరాజా అన్నది రవితేజ ఫ్యాన్స్ టాగ్ లైన్. రవితేజ టైపు సినిమాలు రెండు విధాలుగా వుంటాయి. అయితే అతనికి మాత్రం నప్పే తరహా కామెడీ ప్లస్ యాక్షన్ సినిమాలు. లేదా ఫవర్ ఫుల్ యాక్షన్ సినిమాలు.

మొన్నటికి మొన్నే రాజా ది గ్రేట్ సినిమా చేసాడు. హీరోకి కళ్లు లేవు అన్న పాయింట్ తప్పిస్తే, ఫక్తు రవితేజ సినిమా అది. రవితేజ టైపు కామెడీ. అదే టైపు యాక్షన్. దాని తరువాత మళ్లీ మరో సినిమా వస్తోంది అంటే, వైవిధ్యంగా వుంటుందేమో అన్న ఆలోచన అవసరం లేదని విడుదలయిన ట్రయిలర్ చెప్పేసింది.

టచ్ చేసి చూడు ట్రయిలర్ చూడగానే ఇంతకు ముందు చూసిన రవితేజ, గోపీచంద్, కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది సినిమాలు గుర్తుకువస్తాయి. చిటికెడు ఫ్యామిలీ ఎమోషన్లు, చెంచాడు లవ్ అండ్ రొమాన్స్, గరిటెడు డైలాగులు, ఆపైన కంచం నిండా యాక్షన్ సీన్లు వడ్డించినట్లు వుంది ట్రయిలర్.

హీరో పోలీస్.. వాడికి కోపం ఎక్కువ… రాజకీయ నాయకులు, విలన్లు, వేటాడం, మధ్యలో ఇద్దరు హీరోయిన్లతో ప్రేమాయణం. ఇదే కనిపిస్తోంది ట్రయిలర్ లో. రవితేజ లుక్స్ చూస్తుంటే చూసిన ఆయన సినిమాలే మళ్లీ గుర్తుకు వస్తున్నాయి.

కొత్త దర్శకుడు కొత్తగా ఏదో చెప్పాలని కానీ, చూపించాలని కానీ కాకుండా, జస్ట్ రొటీన్ కమర్షియల్ ఫార్ములాలోనే ఓ రెగ్యులర్ మాస్ భారీ సినిమా తీసి జనం ముందు పెట్టే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తోంది. చూడాలి సినిమాలోనైనా ఏమైనా కొత్త ట్విస్ట్ లు, కొత్త నెరేషన్ వుంటుందేమో?