తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ తో గొడవ పెట్టుకోనని జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ క్లియర్ గా చేప్పేసారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాల్సి వుందని, అదే తన పాలసీ అని ఆయన కాస్త అటు ఇటుగా చెప్పారు. అంతే కాదు, అసలు తనకు ఎంత బలం వుందో? ఎన్ని చోట్ల పోటీ చేయగలనో, లేదో అన్నది ఎన్నికలకు రెండు నెలల ముందుగా కానీ క్లారిటీ రాదని కూడా చెప్పేసారు.
ఇవన్నీ కలిపి అన్యాపదేశంగా చెబుతున్నది ఒకటే. తెలంగాణలో కేసీఆర్ తేరాస పార్టీతో, ఆంధ్రలో చంద్రబాబు తేదేపాతో ఎన్నికల ఒప్పందం దిశగా పవన్ అడుగులు వేస్తున్నారని. అంతకన్నా వేరే అద్భుతమైన విషయాలు ఏవీ పవన్ ఈ రోజు అక్కడ అక్కడ మాట్లాడిన మాటల్లో అయితే దొర్లలేదు.
మరి కేంద్రంలోని భాజపా కూడా ప్రజులు ఎన్నుకున్న ప్రభుత్వమే. దానికి గౌరవం ఇవ్వకుండా విమర్శలు ఎందుకు చేస్తున్నారో అది పవన్ కు తెలియాలి. అది వేరే సంగతి. ప్రస్తుతానికి అయితే మాత్రం పవన్ కుడి ఎడమల కేసిఆర్, చంధ్రబాబు వున్నారు. అది పక్కా.
ప్రశ్నించను
ప్రశ్నించేందుకే జనసేన అన్న పవన్, ఇప్పుడు మాట మార్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో తాను ప్రశ్నలు ఏవీ వేయనని, దశాబ్దాల పోరాటం తరువాత తెలంగాణ వచ్చిందని. అందువల్ల, సమస్యలు అర్థం చేసుకుని, ప్రభుత్వానికి సూచనలు ఇస్తాను కానీ, ఫ్రశ్నించనని ఆయన అన్నారు. పార్టీ నిర్మాణానికి దశాబ్దాలు పట్టిందని, పైగా గతంలో తాను ఎదుర్కోన్న అనుభవాల దృష్ట్యా జనసేన నిర్మాణాన్ని మెల్లగా చేస్తున్నా అని పవన్ అన్నారు.
అనంతపురం, ఒంగోలు, అరకులోయ, శ్రీకాకుళం ప్రాంతాల్లో పర్యటన వుంటుందని సూత్రప్రాయంగా పవన్ చెప్పారు. మధ్యమధ్యలో రెండేసి రోజులు హైదరాబాద్ వెళ్లి మళ్లీ పర్యటిస్తుంటా అని పవన్ వెల్లడించారు. అంటే ఓ లైన్ గా కాకుండా, పవన్ వివిధ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని పర్యటన ప్లాన్ చేసుకున్నట్లు, దానికి వీలయిన కారణాలను కూడా ముందుగానే సెట్ చేసుకున్నారని తెలుస్తోంది.