డబ్బులు పెట్టలేదు.. పేరు చూస్తే ఇలా

అ..ఆ సినిమా హిట్ అయిన ఊపులో త్రివిక్రమ్ పేరు, తన అభిమాని అని పవన్ కళ్యాణ్ పేరు కలిపి వాడేసుకుందాం అనుకున్నాడు హీరో నితిన్. అందుకే త్రివిక్రమ్ రచన, పవన్ సమర్పణ అంటూ సినిమా…

అ..ఆ సినిమా హిట్ అయిన ఊపులో త్రివిక్రమ్ పేరు, తన అభిమాని అని పవన్ కళ్యాణ్ పేరు కలిపి వాడేసుకుందాం అనుకున్నాడు హీరో నితిన్. అందుకే త్రివిక్రమ్ రచన, పవన్ సమర్పణ అంటూ సినిమా స్టార్ట్ చేసేసాడు. కృష్ణ చైతన్య దర్శకుడు. కానీ ఆ సినిమాలు ఇటు త్రివిక్రమ్ ది కానీ, పవన్ ది కానీ పైసా పెట్టుబడి లేదు. మొత్తం పెట్టుబడి నితిన్ స్వంత బ్యానరదే.

ఎప్పటి నుంచో ఇదిగో అదిగో అంటూ ఆఖరికి ఇప్పటికి ఓ కొలిక్కి వస్తోంది ఆ సినిమా షూటింగ్. అది పూర్తి చేసి, దిల్ రాజు-సతీష్ వేగ్నిశ సినిమా మీదకు వెళ్లాలి. అప్పట్లో వున్న క్రేజ్ ప్రకారం పెట్టుబడి లేకపోయినా త్రివిక్రమ్-పవన్ ల పేర్లు వాడుకోవడానికి, వాళ్లకు లాభాల్లో వాటా ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు వినికిడి.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా వుంది. పవన్ చూస్తే పోలిటికల్ లైన్ లోకి వెళ్లిపోయారు. పవన్ అంటే కిట్టని వర్గాలు ఆయన సినిమా తేడాగా వుంటేనే తీసి పక్కన పెట్టేసాయి. ఇక ఆయన ప్రమేయం వున్న సినిమాలు వస్తే మాత్రం ఊరుకుంటాయా? ఇక దర్శకుడు త్రివిక్రమ్ పేరు కూడా ఎంత డ్యామేజ్ కావాలో అంతా అయింది.

అసలే నితిన్ టైమ్ అంత గొప్పగా లేదు. ఇలాంటి టైమ్ లో నితిన్ సినిమాకు ఆ రెండు పేర్ల వల్ల పెద్దగా ఒరిగేది లేదు. కానీ ఎటొచ్చీ త్రివిక్రమ్ కూడా ఒక లుక్ వేసిన కృష్ణ చైతన్య కథ, ఆ స్క్రిప్ట్ ను అతగాడు డీల్ చేసే విధానం కలిసి సినిమాను నిలబెట్టాలి.

మరి అది ఏ మేరకు వుంటుందో? అసలే సరైన సినిమాలు లేక నితిన్, సరైన హిట్ లు లేక అతని బ్యానర్ కష్టాల్లో వున్నాయి. ఇలాంటపుడు మంచి ప్రాజెక్టులు, వేరే బ్యానర్లు చూసుకుని సరైన సినిమాలు చేసుకోవాలి. మరి ఆ లైన్లోకి నితిన్ ఎప్పుడు వెళ్తాడో ?