ఎమ్బీయస్‌: పోరాడితేనే కాదు, పోలికలున్నా డేంజరే!

జులై నెలలో చైనాలో రెండు సంఘటనలు జరిగాయి. మొదటిది చైనాలో ప్రజాస్వామ్య హక్కులకై పోరాడుతూ వచ్చిన లియు జియాబో మృతి చెందాడు. 1955 డిసెంబరులో పుట్టిన లియు 1977 నుంచి 1984 వరకు లిటరేచర్‌…

జులై నెలలో చైనాలో రెండు సంఘటనలు జరిగాయి. మొదటిది చైనాలో ప్రజాస్వామ్య హక్కులకై పోరాడుతూ వచ్చిన లియు జియాబో మృతి చెందాడు. 1955 డిసెంబరులో పుట్టిన లియు 1977 నుంచి 1984 వరకు లిటరేచర్‌ చదివాడు. తర్వాత బీజింగ్‌ నార్మల్‌ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1987లో ఫిలాసఫీపై ఒక పుస్తకాన్ని వెలువరిస్తే దానికి చాలా పేరు వచ్చింది. 1989లో బీజింగ్‌లోని తియానాన్మెన్‌ స్క్వేర్‌లో ప్రజాస్వామ్యం కోరుతూ విద్యార్థులు పెద్ద ప్రదర్శన నిర్వహించారు. చైనా ప్రభుత్వం దాన్ని అతి క్రూరంగా అణచివేసింది. యుద్ధ ట్యాంకులు వచ్చి విద్యార్థులపై కాల్పులు జరిపాయి. వేలాదిమంది విద్యార్థులు చనిపోయారు. అప్పణ్నుంచి విద్యార్థులపై మరిన్ని ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. దానికి నాయకత్వం వహించినవారిని కష్టాలపాలు చేసింది. అలాటి నాయకుల్లో లియు ఒకడు. అతనికి 20 నెలల జైలుశిక్ష పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజాహక్కుల గురించి ఉద్యమించడం మానలేదతను. ఒకే పార్టీ పాలన ఉండకూడదని, ఎన్నికలలో విభిన్న భావాల పార్టీలు పాల్గొనే అవకాశం వుండాలని ప్రచారం చేయసాగాడు. దాంతో 1996లో ప్రభుత్వం కేసు పెట్టింది. మూడేళ్లపాటు లేబరు క్యాంప్‌లో పనిచేయాలని శిక్ష పడింది. బయటకు వచ్చాడు. మళ్లీ పోరాటబాట పట్టాడు. రాజ్యాంగం కొత్తగా రాయాలని, స్వతంత్రన్యాయవ్యవస్థ ఉండాలని, భావప్రకటనాస్వేచ్ఛ ఉండాలని పెద్ద ఉద్యమమే లేవదీశాడు. 2009లో కేసు పెట్టారు. ఈసారి 11 ఏళ్ల శిక్ష పడింది. ఇతను జైల్లో ఉండగానే నోబెల్‌ ట్రస్టు వారు యితనికి నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించారు. ఇతను వెళ్లి తీసుకోవడానికి చైనా ప్రభుత్వం అనుమతించలేదు. జైల్లో ఉండగానే అతని ఆరోగ్యం క్షీణించసాగింది. అతన్ని విడిచిపెట్టి విదేశాలకు పంపి చికిత్స చేయించమని ఎందరో సలహా యిచ్చారు. ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆరోగ్యం నిక్షేపంలా వుంది అని బుకాయించింది. చివరకు యీ మేలో అతనికి కాన్సర్‌ ఆఖరి స్టేజి అని ప్రకటించింది. జూన్‌ 26 న మెడికల్‌ పెరోల్‌పై జైల్లోంచి విడిచిపెట్టింది. జులై 13న అతను చనిపోయాడు.  ప్రజాస్వామ్యం అని పలవరించినందుకు అతని ప్రాణాలు తీసింది చైనా.

విన్నీ ద పూహ్‌ అలాటి ఉద్యమాలు ఏమీ చేయలేదు. ప్రభుత్వాన్ని విమర్శించలేదు. ఎందుకంటే అది మనిషి కాదు, ఒట్టి కార్టూన్‌ బొమ్మ మాత్రమే. అయినా దానికీ శిక్ష పడింది. ఎ ఎ మిల్నే అనే బ్రిటిషు రచయిత సృష్టించిన ఎలుగుబంటి పాత్ర విన్నీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి నచ్చే పాత్ర అది. దాన్ని చైనాలో 'లిటిల్‌ బేర్‌ విన్నీ' అంటారు. అది చేసిన పాపం ఏమిటంటే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పోలిక కలిగి వుండడం! నిజానికి ఆ బొమ్మ 1936లో పుట్టిన దగ్గర్నుంచీ అలాగే వుంది. 2013లో చైనా సోషల్‌ మీడియాలో ఎవరో కానీ దానికీ, జిన్‌పింగ్‌కు పోలిక కనిపెట్టారు. చిరు బొజ్జతో జిన్‌పింగ్‌ అస్సలు పొట్ట లేని ఒబామాతో కలిసి నడుస్తున్న ఫోటోను విన్నీ నాజూకుగా వుండే తన ఫ్రెండ్‌ టైగర్‌తో కలిసి నడుస్తున్న బొమ్మతో పోలుస్తూ పోస్టు చేశారు. అది చైనావాళ్లకు విపరీతంగా నచ్చేసింది. 2014లో జిన్‌పింగ్‌ జపాన్‌ ప్రధాని షింజో ఏబెతో షేక్‌హ్యాండ్‌ యిస్తున్న ఫోటోకి, విన్నీ తన స్నేహితుడు ఈయోర్‌ అనే గాడిదతో చేతులు కలిపే దృశ్యానికి పోలిక పెట్టారు. అదీ పాప్యులర్‌ అయిపోయింది. 2015లో జిన్‌పింగ్‌ పెరేడ్‌ కారు రూఫ్‌ లోంచి నిలబడిన ఫోటోకి, బొమ్మకారులో తిరిగే విన్నీకి పోలిక కనిపెట్టారు. దాంతో చైనా ప్రభుత్వం ఆ ఫోటోను సెన్సార్‌ చేసింది. త్వరలో జరగబోయే పార్టీ సమావేశంలో జిన్‌పింగ్‌ తన అధికారాన్ని మరింతగా దృఢపరచుకుందా మనుకుంటున్నాడు. విన్నీ బొమ్మ కళ్లపడుతున్నంత కాలం తనే గుర్తుకు వచ్చి హాస్యాస్పదంగా అవుతానన్న భయం పట్టుకుందతనికి. అందువలన ఆ పాత్రను చైనా సోషల్‌ నెట్‌వర్క్‌ల నుంచి బహిష్కరించాడు. ఏదైనా మెసేజిలో దాని బొమ్మ పెడితే వెంటనే 'దిస్‌ కంటెంట్‌ ఈజ్‌ ఇల్లీగల్‌' అని వచ్చి అక్కడితో ఆగిపోతోంది. ముందుకు కదలటం లేదు. స్టికర్స్‌ గ్యాలరీల నుంచి విన్నీ స్టికర్‌ను తొలగించేస్తున్నారు. బొమ్మలను యింకా పూర్తిగా తీసేయలేకపోతున్నారు. చైనీయుల జీవితంలోకి చొచ్చుకుపోయిన విన్నీని పూర్తిగా తీసి అవతల పారేయడం అంత సులభమైన పని కాదు. ఈ ఉదంతం చైనా పాలకుని ఉలికిపాటును ఎత్తిచూపుతోంది.  (ఫోటో- లియు జియాబో)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2017)

[email protected]