ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. ఈ మూవీ తర్వాత నేసన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా లేక మైత్రీ మూవీ మేకర్స్ కు ఓ సినిమా చేసి పెడతాడా అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే అసలు కొన్నాళ్ల పాటు పవన్ సినిమాలు చేస్తాడా చేయడా అనే డౌట్స్ ఇప్పుడు మొదలయ్యాయి. దీనికి కారణం పవన్ కల్యాణ్ తాజా ప్రకటన.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్, అక్టోబర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంటరవుతానని ప్రకటించారు. ఇప్పుడు కూడా ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. కాకపోతే ఒక్కోసారి సినిమా పనుల్లో పడిపోయి, కీలకమైన సందర్భాల్లో తన స్పందన కూడా తెలియజేయడం లేదు. అలాంటి టైమ్ లో పవన్ పై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి.
వీటిని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ నుంచి మ్యాగ్జిమమ్ టైమ్ రాజకీయాలకే కేటాయిస్తానని ప్రకటించిన పవన్, సినిమాలకు తక్కువ టైం కేటాయిస్తానని ప్రకటించాడు. అంటే త్రివిక్రమ్ మూవీ తర్వాత పవన్ ఎక్కువగా రాజకీయాలపైనే దృష్టిపెట్టబోతున్నాడన్నమాట.
ఈ నేపథ్యంలో పవన్ నుంచి మరో సినిమా రావడానికి చాలా టైం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సినిమా సెట్స్ పైకి వచ్చినా దాన్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడో పవన్ కు కూడా తెలీదన్నమాట.