నవ్వుతూ లోపలికి వెళ్లింది.. అలానే నవ్వుతూ బయటకు వచ్చింది. కానీ మధ్యలో జరిగిన వ్యవహారం మాత్రం అంత సాఫీగా లేదు. చార్మి లోపలకు వచ్చిన వెంటనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారట సిట్ అధికారులు. ఆమెను ప్రశ్నించేందుకు ఏకంగా నలుగురు మహిళా అధికారుల్ని నియమించిన సిట్.. వాళ్ల ద్వారా ప్రశ్నల వర్షం కురిపించింది.
ఇప్పటివరకు సిట్ కు హాజరైన ప్రముఖులందర్నీ మూడుదశల్లో విచారించింది సిట్. మొదట వ్యక్తిగత సమాచారాన్ని, తర్వాత అలవాట్లకు సంబంధించిన వివరాల్ని అడిగి.. ఆ తర్వాత తాపీగా అసలు విషయంలోకి వచ్చింది. కానీ చార్మి విషయంలో కెల్విన్ తోనే ప్రశ్న మొదలైంది. “డైరక్ట్ ఎటాక్.. నో డొంక తిరుగుడు” అంటూ మధ్యాహ్న భోజన సమయంలో పేరుచెప్పని ఓ అధికారి కామెంట్ చేశాడంటే చార్మిపై ఎలాంటి ప్రశ్నలు పడ్డాయో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటివరకు జరిగిన ఇంటరాగేషన్స్ లో చార్మి ఎపిసోడ్ మాత్రమే చాలా హాట్ గా జరిగిందని అంటున్నాడు సదరు అధికారి. తమకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిందనే కోపం ఒకవైపు, సాయంత్రం 5 గంటల లోపు విచారణను ముగించాలనే కోర్టు ఆదేశాలు మరోవైపు.. ఈ రెండు కారణాల దృష్ట్యా వచ్చిన వెంటనే నేరుగా డ్రగ్స్ కేసుపైకి వెళ్లారట. కెల్విన్ ఎన్నాళ్ల నుంచి పరిచయం, అతడితో ఫొటోలు దిగాల్సిన అవసరం ఏముంది, మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు లాంటి కీలకమైన ప్రశ్నలను వేసి సమాధానాలు రాబట్టారు.
అయితే తామడిగిన ప్రశ్నలకు సూటిగా మాత్రం చార్మి సమాధానాలివ్వలేదంటున్నాడు సదరు అధికారి. ఇప్పటికే విచారణను ఎదుర్కొన్న పూరి జగన్నాథ్, సుబ్బరాజు లాంటి వ్యక్తుల అనుభవాలను పూర్తిగా తెలుసుకొని.. ఆ సమాచారం ఆధారంగా సమాధానాలు ఇచ్చినట్టు ఆ అధికారి వెల్లడించారు.
హాట్ హాట్ గా విచారణ ఎదుర్కొన్న చార్మి.. ఇంటరాగేషన్ అనంతరం చిరునవ్వులు చిందిస్తూ బయటకు రావడం కొసమెరుపు.