అసలీ పార్టీకి రావడానికి నాకు మొదట్నించీ ఇష్టం లేదు. ఆయనదే బలవంతం – ''మిసెస్ భట్నాగర్ మనకెంతో హెల్ప్ చేసింది. బర్త్‌డే పార్టీకి వెళ్లకపోతే కాంపస్‌లో అందరూ చెప్పుకుంటారు'' అంటూ. ఇక్కడకొచ్చి చూస్తే మామూలు వాతావరణమే. గొప్ప కబుర్లు, విషపునవ్వులు, దొంగవేషాలూనూ, వస్తూనే మిసెస్ సాఠే పట్టుకుంది. వాళ్లాయన మావారికంటే పెద్ద డాక్టర్ అని చెప్పుకోవాలని తాపత్రయం. ఈయన వస్తూనే ఫ్రెండ్స్‌తో కబుర్లలో పడిపోయారు. నేనీ మూల బియర్ చప్పరిస్తూ ఈవిడ పాలపడాల్సి వచ్చింది.
పార్టీకి ఏభయిమంది దాకా వచ్చి వుంటారు. అందరూ పెద్ద తలకాయలే. మేజర్ గిల్, మిసెస్ గిల్ ఈయనతో కబుర్లు చెపుతున్నారు. నాకేసి చూపించి ఈయనేదో అనడం, మిసెస్ గిల్ పడిపడి నవ్వడం, నాకేమీ వినబడకపోయినా నేనూ నవ్వాను. మిసెస్ గిల్ – ఆ డ్రెస్ ఏమిటి? ఎంత పాడెడ్ అయితే మాత్రం ఆ షేప్ ఏమిటి? – బొత్తిగా అన్నేచురల్‌గా. ఆవిడే ఏమిటి, ఎవర్ని చూసినా లోనెక్‌లు, బాక్‌లెస్‌లు, రివీలింగ్ డ్రెస్ లేనివాళ్లెవరున్నారు – నేను తప్ప. మామూలుగా వేసుకున్నా మా అమ్మాయి వనజ 'అబ్బే, నువ్విలా వేసుకుంటే బావుండదమ్మా, ఎబ్బెట్టుగా ఉంటుంది' అంటుంది. ఇక్కడకొచ్చి చూడమను.
మిసెస్ సాఠే వదలగానే శ్రీరంగనాధన్ వచ్చి కూచున్నాడు. నుదుటనామం, చేతిలో విస్కీగ్లాసు. అరవ ఇంగ్లీషులో కార్పొరేషన్ ఎండీగా తన ప్రయోజనకత్వం ఏకరువు పెడుతున్నాడు. టేబుల్‌మీద ఉన్న నా చేతిమీద చెయ్యి వేసి మాట్లాడుతున్నాడు. విస్కీ మత్తులో ధైర్యం వచ్చిందేమో. మామూలప్పుడు అంత తెగింపా, నా మొహమా? చిరాకేసి చెయ్యి తీసేసినా నొచ్చుకోలేదు. సొల్లు సాగుతూనే ఉంది. మా వారి చుట్టూ ఓ పెద్ద కాకస్…ఓ గుజరాతీ పేషంట్ ఆపరేషన్ టేబుల్ మీద ఎలా భయపడిందీ ఈయన మిమిక్రీ, అందరూ పగలబడి నవ్వడం, ఆయన అసిస్టెంటు షీలా మహా ఎడ్మైరింగ్‌గా చూస్తోంది. ఏభయ్యవ పడిలో పడ్డా ఈయన ఛార్మ్ తగ్గలేదు.
మిసెస్ శుక్లా వచ్చి శ్రీరంగనాధాన్ని డాన్స్‌కి పిలిచింది. పరిగెట్టుకెళ్లాడు. డాన్సింగ్‌ఫ్లోర్ అంటూ వేరేలేదు కానీ, పెద్దహాలు కాబట్టి ఓ మూల లైట్స్ కాస్త డిమ్ చేసి మ్యూజిక్ పెట్టారు. పది, పదిహేను జంటలదాకా ఉన్నాయి. చూస్తూ కూచున్నాను. ఎవరికీ సరిగ్గా డాన్స్ వచ్చినట్టులేదు. కౌగిలింతలు, పెనవేసుకోడాలు ఎక్కువా, డాన్స్ చేసేది తక్కువా. ఏ జంటా ఐదు నిమిషాల కన్నా స్థిరంగా ఉండటం లేదు. మిసెస్ దమానీతో డాన్స్ చేయడానికి చాలామంది పోటీ పడుతున్నారు. చిన్నవయస్సు, పొందికైన శరీరం, బరితెగించింది. డ్రెస్సు వేసిన భాగం కంటే వేయని భాగం ఎక్కువుంది.
మావారి హరికథ మారింది. హంటింగు అనుభవాల కథ. మిస్ షీలా త్రిల్లింగ్ స్టోరీ వింటున్నట్టు మొహం పెట్టి ఆయన్ని వాటేసుకుని కూచుంది. నాకు తెలుసు ఆయనంటే పడి చస్తుంది. కానీ ఈయనకి ఆడధ్యాస లేదు. ఎంతసేపూ తన ప్రాక్టీసూ, పార్టీలు తప్ప కొడుకు, కూతురు ఏ కాలేజీయో కూడా తెలీదు. అయిదారేళ్ల నుంచీ తన్నే పట్టించుకోవటం లేదు. పక్కన పడుక్కున్నా మీద చేయి వేయడమే అబ్బురమైపోయింది.
బాటిల్ ఖాళీ అయిపోయింది. బేరర్‌ని పిల్చి విస్కీ తెమ్మన్నాను. బోరు కొడుతోంది. పళ్లు రాలిపోయిన, ఒళ్లు జారిపోయిన ముసలమ్మలు కన్నెపిల్లల్లా వేషాలేస్తూంటూ చూడడం ఎంత చికాకు!… విసుగ్గా ఉంది… చుట్టూ మనుషుల గోల… మా వారి అసిస్టెంటు రామారావు పలకరింపు, 'మీదీ అమలాపురమేటగా…' ఆవకాయజాడీ గురించి మాట్లాడతాడేమో యూస్‌లెస్‌ఫెలో …మిసెస్ గంగూలీ జాకెట్ చూడు… ఓ రెండు అంగుళాలు లోతుగా వేసుకుంటే చాలు మగాళ్ల చూపులక్కడే ఇరుక్కుపోతాయేం?… అవి ఎలా వున్నా సరేనా?… నన్ను అన్‌సోషల్ బీయింగ్ అంటున్నారు, అననీ. డోంట్‌కేర్. చీర రెండంగుళాలు కిందికి కడితే సరి… నా చుట్టూ పదిమంది…
ఇందాకణ్నుంచి ఆ మూల ఒంటరిగా కూచుని బెరుగ్గా చూస్తున్న అబ్బాయి నా దగ్గరికి వస్తున్నాడు. విస్కీ గ్లాసు అంచులోంచి పలకరింపుగా నవ్వాను. ధైర్యం వచ్చేసినట్టుంది, వచ్చి పరిచయం చేసుకున్నాడు. బెంగాలీ – షేక్‌హాండ్ ఇచ్చినప్పుడు చేతులు వణికాయి పాపం. కుర్రాడు, ఇరవైయ్యుంటాయేమో. రీసెర్చి స్కాలరట. తండ్రి, బిజినెస్‌మన్, మిష్టర్ భట్నాగర్‌కి బాగా తెలుసుట. తండ్రి తరఫున ఇతనొచ్చేడట.
ఉన్నట్టుండి 'డాన్స్ చేద్దామా' అన్నాడు. అంతకుముందు అడిగిన చాలామందికి 'నో' అన్నాను. వాళ్లంతా మా వారితో అవసరాలుండి నాతో చనువు సంపాదించి, పరిచయం ఉపయోగించు కోవాలని చూసేవాళ్లు. ఇతనలాటివాడు కాడు. అందుకే డాన్స్ మానేసి నాలుగేళ్లవుతున్నా కాదనలేకపోయాను. ఫ్లోర్‌కి వెళుతూ మావారికేసి చూసాను. జర్మనీ అనుభవాల కథ .. షీలాకు తోడు మిసెస్ చంపకం కూడా మావారిని పెనవేసుకుని కూచుంది.
డాన్స్ చేసే జనం పలుచబడ్డారు. అర్ధరాత్రి దాటిందేమో, కొంతమంది పక్కరూముల్లో జారుకుంటున్నారు. నా పార్ట్‌నర్‌కి డాన్స్ వచ్చినట్టులేదు, నా నడుంచుట్టూ గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. నొప్పి పుట్టింది, మానేద్దామనుకున్నా అతని మొహం చూసి పోన్లే అని కంటిన్యూ చేసా. అతన్ని ఈజ్ చేయడానికి నే వేస్తున్న ప్రశ్నలకి అతను సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. మనిషిలో ఆవేశం, ఉద్వేగం ఎక్కువే. నన్ను దగ్గరకు లాక్కొని అదుముకుంటున్నాడు. ఎవరైనా చూస్తే? కాస్త చీకటివైపుకి తీసుకెళ్లా.
ఇంకా క్లోజ్‌గా వచ్చేసాడు, నా చెవిలో 'ఐ లవ్ యూ' అంటూ గొణిగేడు. నేను ఫక్కుమని నవ్వి, అల్లరిగా 'తాగి ఉన్నావా' అన్నాను. అన్నాను కానీ అతని మొహం చూసేక జాలిపడ్డాను. 'నీ అందాన్ని ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను' అన్నాడు.
''నీ లాటి టీనేజ్ బాయ్ రెట్టింపు వయస్సున్న నన్ను ప్రేమించడమా, ఆర్ యూ మాడ్?'' అన్నాను సీరియస్‌గానే. 'యస్, ఐ యామ్ మాడ్, మాడ్ ఆఫ్టర్ యూ అండ్ యువర్ బ్యూటీ' అంటూ కౌగలించుకుని ముద్దుపెట్టుకున్నాడు.
*
కారులో ఇంటికెళుతుంటే అతని ఆలోచనలే. నా భర్త, కూతురు, కొడుకు, ఫ్రెండ్స్ – ఎవరికీ పట్టని నా అందం ఓ తరుణవయస్కుణ్ని రెచ్చగొట్టగలిగిందా? అంత బిడియస్తుడిని నేను అంతగా రెచ్చగొట్టగలిగేనా, ఈ వయసులో? ఇప్పుడు మా ఇంట్లో ఎవరికీ నేనక్కర్లేదు. జీవితంలో ఈ స్టేజిలో నన్నారాధించే యువకుడు తారసిల్లాడు.. నా అందం చూసి ముగ్ధుడై, మా ఆయనతో పనిబడి కాదు… ఓహ్,
తనేం చేసింది? తమకంతో ముద్దుపెట్టుకున్నంత మాత్రాన, ముఖం చిట్లించి విదిల్చుకొని వచ్చేయడమేం!? అతనెంత బాధపడ్డాడో. అతనికి తనలో నచ్చిందేమిటి..? పెద్దగా మాట్లాడలేదు కాబట్టి నా తెలివితేట లతనికి తెలియవు. తన శరీరమే అయి వుండాలి. అంత అందంగా ఉందా తన శరీరం?
ఇంటికెళ్లాక అద్దం ముందు నగ్నంగా కూచుని ప్రతీ అవయవాన్నీ తడిమి తడిమి చూసుకున్నాను. ఏది అతన్ని ఆకర్షించింది? ఆయన అప్పుడే నిద్రపోతున్నారు. వాళ్లావిడ ఎవరితో డాన్స్ చేసినా, ఎవరితో ఎలా పోయినా అక్కర్లేదు మహానుభావుడికి. తన ఇగో ఎలాగోలా శాటిస్ఫై అవుతోంది. నా ఇగో శాటిస్ఫై అయ్యే అవకాశం వచ్చినవేళ ఎంత నేస్టీగా బిహేవ్ చేసాను? అతనికి కావాలంటే ఎంతమంది వయస్సువాళ్లు దొరకరు? పార్టీలో అర్ధనగ్న ముసలమ్మలెవరి దగ్గరి కెళ్లినా పడకగదిదాకా తీసికెళ్లందే వదిలేవారా? ఏరికోరి ఈ 'చాదస్తురాలి' దగ్గరకి వచ్చినందుకు బాగానే శాస్తి జరిగింది అనుకుంటాడు. తిట్టుకోడేమోలే…. నేను విసవిసా నడిచి వచ్చేటప్పుడు దీనంగా ముఖం పెట్టాడు పాపం.
ఆ అబ్బాయి పేరేమిటో – మర్చేపోయాను. నాకు బుద్ధిలేదు. ఓ 'హేజ్‌బీన్' లా బతుకుతున్న నన్ను గుర్తించి, నిస్సారమైన జీవితంలో ఓ వెలుగు కనబరచి, బతుక్కి ఓ ఫ్రెష్‌లీజ్, ఓ కొత్త ఊపిరి నిచ్చినతని పేరు మర్చిపోయాను. ఛ, అతన్ని కలవాలి. కలిసి నాలో అతనికేం నచ్చిందో అడగాలి. కలవడం ఎలా? మిసెస్ భట్నాగర్‌కి రేపు ఫోన్ చేస్తాను. బెంగాలీ బిజినెస్‌మన్ కొడుకు, రీసెర్చి స్కాలర్ అంటే సులభంగా చెప్పగలదు.
(ఆంధ్రజ్యోతి వీక్లీ జులై 1998లో ప్రచురితం)
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]