రాజధాని నగరంలో మత్తు మందుల వాడకం, సెలబ్రిటీలకు నోటీసులు ఇలాంటి వార్తలతో మీడియా ఫుల్ హడావుడిగా వుంది. ఎక్సయిజ్ పోలీసులకు ఓ చిన్న తీగ దొరకడం, ఆ తీగ పట్టుకుని, కొందరిని అరెస్టు చేయడం, ఆపై వాళ్ల ఫోన్ రికార్డులతో అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటపడడం వంటివి చకచకా జరిగిపోయాయి.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా వదంతి ఇంకోటి వుంది. ఈ దర్యాప్తు అంతటికీ మూలం ఓ ప్రమాదంలో దొరకిందని టాక్ వినిపిస్తోంది. ఓ కారు ప్రమాదం జరిగినపుడు పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగి, అక్కడ దొరికిన ఫోన్ ను పరిశీలించారని, ఆ ఫోన్ లో దొరికిన డేటా ఆధారంగా తీగలు లాగితే, ఇప్పుడీ డొంక అంతా కదిలిందని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా వుండగా, మరో పక్క, పన్నెండు మంది, ఇరవై మంది అని రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ, కీలకంగా నోటీసులు ఇచ్చిన వారు ఆరు నుంచి ఎనిమిది మంది మాత్రమే వుంటారని తెలుస్తోంది. బడ్డీ హీరోలు, టాప్ డైరక్టర్, అతనితో సన్నిహితంగా వుండే హీరోయిన్, ఇలా చాలా పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు ఓ సినిమాటోగ్రాఫర్ పేరు కూడా వుందని లేటెస్ట్ గా గ్యాసిప్ వినిపిస్తోంది.
ఏది నిజం? ఏది కాదు అన్నది పోలీసులు పెదవి విప్పి, ప్రకటిస్తే తప్ప తెలియదు. అయితే సెలబ్రిటీలు కాబట్టి అంత సులువుగా బయటకు రాకపోవచ్చు.