బాబుపై టీడీపీ యువ‌నేత ధిక్కారం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై ఆ పార్టీ యువ‌నేత భూమా జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజ‌కీయంగా త‌న ఉనికి కాపాడుకునేందుకు చంద్ర‌బాబు ఆదేశాల‌ను సైతం బేఖాత‌ర్ చేయ‌డానికి ఆయ‌న వెనుకాడ‌డం లేద‌నే అభిప్రాయాలు…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిపై ఆ పార్టీ యువ‌నేత భూమా జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజ‌కీయంగా త‌న ఉనికి కాపాడుకునేందుకు చంద్ర‌బాబు ఆదేశాల‌ను సైతం బేఖాత‌ర్ చేయ‌డానికి ఆయ‌న వెనుకాడ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నంద్యాల‌లో త‌న కుటుంబాన్ని తిర‌గొద్ద‌ని చంద్ర‌బాబు ఆదేశాల‌ను ఆయ‌న ఏ మాత్రం ఖాత‌రు చేయ‌లేదు. అవ‌న్నీ త‌న‌కు కాద‌నే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కుల‌తో చంద్ర‌బాబు స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి నంద్యాల టీడీపీ ఇన్‌చార్జ్ భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్‌, ఏవీ సుబ్బారెడ్డి త‌దిత‌రులు వెళ్లారు. భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికే టికెట్ అని చంద్ర‌బాబు ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అలాగే నంద్యాల‌లో మాజీ మంత్రి అఖిల‌ప్రియ జోక్యంపై ఆయ‌న కీల‌క ఆదేశాలు ఇచ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నంద్యాల‌తో అఖిల‌ప్రియ కుటుంబానికి సంబంధం లేద‌ని, ఆమె వెంట ఎవ‌రూ వెళ్లొద్ద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ఇప్ప‌టికే నంద్యాల‌లో అఖిల‌ప్రియ ప్ర‌త్యేకంగా కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల‌లో కొంద‌రు వైసీపీ నాయ‌కుల్ని టీడీపీలో చేర్పించారు. నంద్యాల టీడీపీ మూడు, నాలుగు వ‌ర్గాలుగా వుంది. దీంతో చంద్ర‌బాబు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశానికి అఖిల‌ప్రియ‌ను మిన‌హా మిగిలిన నేత‌లంద‌రినీ పిలిచి, అంతా ఐక్యంగా ప‌ని చేసి పార్టీని గెలిపించాల‌ని దిశానిర్దేశం చేశారు.

ఈ నేప‌థ్యంలో భూమా జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి సోమ‌వారం కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. బాబు ఆదేశాల‌కు విరుద్ధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డం నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌ల‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నంద్యాల బ‌రిలో వుంటాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. తన తండ్రి  భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రాణాలు వదిలిన నంద్యాలను వదిలే ప్రసక్తే లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. భూమా నాగిరెడ్డి ఎక్కడైతే ప్రాణాలు వదిలాడో అక్కడి నుంచే ఆయన కొడుకుగా త‌న రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తానని జ‌గ‌త్ తెలిపారు.  

భూమా నాగిరెడ్డి కొడుకును నంద్యాల‌కు వెళ్లొద్ద‌ని ఎవ‌రూ చెప్ప‌లేద‌న్నారు. ఆ అధికారం ఎవ‌రికీ లేద‌న్నారు. ఆ విష‌యం ఇంత వ‌ర‌కూ పార్టీ త‌న‌కు చెప్ప‌లేద‌ని, చెప్ప‌ద‌ని కూడా ఆయ‌న అన్నారు. అక్క (అఖిల‌ప్రియ‌) ఆళ్ల‌గ‌డ్డ ఇన్‌చార్జ్‌గా ఉన్నార‌న్నారు. ఆళ్ల‌గ‌డ్డ‌లో అక్క తిరగాల్సి వుంద‌న్నారు. నాన్న ఎక్క‌డైతే రాజ‌కీయాన్ని ఆపారో, అక్క‌డి నుంచే మొద‌లు పెట్టాల‌నే సంకల్పంతో తాను నంద్యాల‌లో దిగాన‌న్నారు. నంద్యాల‌లో బ్యాగ్రౌండ్‌లో చేసుకోవాల‌ని పార్టీ కూడా త‌న‌కు క్లారిటీ ఇచ్చింద‌న్నారు. తాను జ‌నాల్లోకి వెళ్ల‌బోతున్న‌ట్టు భూమా జ‌గ‌త్ తెలిపారు. 

త‌న‌ ప్రోగ్రామ్‌ను ఖ‌చ్చితంగా గ్రాండ్ స‌క్సెస్ చేయాల‌ని కోరారు. దీంతో చంద్ర‌బాబు ఆదేశాల కంటే తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని కాపాడ్డ‌మే త‌న‌కు ముఖ్య‌మ‌ని యువ నాయ‌కుడు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ‌ల‌లో టీడీపీ రాజ‌కీయం రంజుగా మారింది. చివ‌రికి ఏ మ‌లుపు తిర‌గ‌నుందో చూడాలి.