తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మినహాయిస్తే, ఆయన కుటుంబమంతా ప్రజల్లోనే వుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల ఆదరణ పొందేందుకు తమ పార్టీ ఏం చేస్తున్నదో, ఏం చేస్తుందో వివరిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రగిరిలో చెవిరెడ్డి అసలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
చంద్రగిరిలో టీడీపీ తరపున మరోసారి పులివర్తి నాని బరిలో నిలవనున్నారు. నాని, ఆయన భార్య సుధారెడ్డి ప్రజా సమస్యలపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా చంద్రగిరిలో ఇసుకరీచ్‌లపై టీడీపీ పోరుబాట పట్టింది. మరోవైపు చంద్రగిరిలో రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన కుమారుడిని బరిలో నిలపనున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రకటించి, జనంలోకి కుమారుడిని పంపారు.
తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్న మోహిత్‌రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నియోజకవర్గంలో అన్నీ తానై చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. కానీ చెవిరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. చెవిరెడ్డి సతీమణి లక్ష్మి, మోహిత్‌రెడ్డి, చిన్నకుమారుడు హర్షిత్‌రెడ్డి జనం వద్దకెళ్లి మరోసారి ఆశీస్సులు కోరుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వయసురీత్యా రాజకీయ విశ్రాంతి తీసుకునేది కానప్పటికీ, ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నట్టుంది.
వైఎస్ జగన్‌కు రాష్ట్రస్థాయిలో చేదోడుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే తన కుమారుడిని ఎమ్మెల్యేగా నిలపాల్సి వస్తోందని ఆయన చెబుతున్నారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారికి ఆయనకు ఎమ్మెల్యే గిరిపై విసుగెత్తిందంటే… ఆయన మదిలో పెద్ద ఆలోచన ఏదో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చెవిరెడ్డిలో గొప్ప గుణం ఏంటంటే, ఆయన కార్యసాధకుడు. అయితే తన మనసులో ఏముందో ఎవరైనా చెబితే మాత్రం ఆయనకు అసలు గిట్టదు.
ప్రస్తుతానికి చంద్రగిరి ప్రజానీకానికి కనిపించనంతగా ఆయన ఎదిగిపోయారు. తన ప్రతినిధులను మాత్రం జనంలో విస్తృతంగా తిప్పుతున్నారు. మున్ముందు చెవిరెడ్డిని మరో స్థాయిలో తప్పక చూసే అవకాశం వస్తుందని చంద్రగిరి ప్రజలు అంటున్నారు.