కేంద్రంలో వరసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి అయోధ్య రామాలయం ఈ సారి ఆయువు పట్టు అవుతుందా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అపసోపాలు పడుతూ ఉంది.
ఏదోలా అధికారాన్ని కొన్ని చోట్ల సంపాదించుకుంటోంది కానీ, ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రం కాదు! ఎమ్మెల్యేలను తిప్పుకుని, పార్టీలను చీల్చి అధికారంలో ఉన్నామని అనిపించుకోవడం బీజేపీ చేస్తున్న పని. మరి ఇలాంటి ఫిరాయింపుదారులు, అవకాశవాద పొత్తులతో నీతిమయమైన పాలన అందిస్తున్నామని బీజేపీ చెబితే నమ్మేదెవరు? పార్టీలను ఫిరాయించే ఎమ్మెల్యేలు తమకంటూ ఒక రేటు ఫిక్స్ చేసుకుంటారు.
ఆ రేటును వారిని చేరదీసే పార్టీ చెల్లించాలి! లేదా అధికారం ఇస్తూ వారికి సంపాదించుకునే అవకాశం అయినా ఇవ్వాలి. లేకపోతే.. వారు ఎందుకు ఫిరాయిస్తారు? ఇలాంటి ఫిరాయింపులతో స్వచ్ఛమైన పాలన సాగుతుందనుకుంటే అంతకు మించిన అమాయకత్వం లేదు. మరి బీజేపీ రాజకీయాలు ఇప్పుడు ఫిరాయింపులు, ఎమ్మెల్యేలను తిప్పుకోవడం, పార్టీలను చీల్చడం.. చుట్టే సాగుతూ ఉన్నాయి.
ఎలాగోలా అధికారంలో ఉండాలనుకుంటూ.. ఇన్నాళ్లూ తాము తీవ్రంగా విమర్శించిన పార్టీలతో దోస్తీకి కూడా బీజేపీ వెనుకాడటం లేదు. తమతో చేతులు కలిపితే.. ఇన్నాళ్లూ తాము అవినీతి పరులని విమర్శించిన వారు కూడా పుణీతులు అవుతారనేది కమలం పార్టీ చెబుతున్న తత్వం!
మరి గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 90 నుంచి వంద శాతం ఎంపీ సీట్లను ఇచ్చిన రాష్ట్రాల్లో వచ్చే సారి విజయం కోసం కమలం పార్టీ గట్టిగా కష్టపడాల్సిందే అని రకరకాల సర్వేలు, విశ్లేషణలు చెబుతూ ఉన్నాయి. బీజేపీకి 2019 ఎన్నికల్లో మంచి స్థాయిలో ఎంపీ సీట్లను ఇచ్చిన మహారాష్ట్ర, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ వంటి చోట్ల వచ్చే సారి టైట్ కంటెస్ట్ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2014తో పోలిస్తే 2019 నాటికి ఉత్తరప్రదేశ్ లో కూడా బీజేపీకి కొన్ని సీట్లు తగ్గాయి! మరి అదే స్థాయిలో 2024లో యూపీలో బీజేపీకి ఎంపీ సీట్లు తగ్గినా.. ఇబ్బందులు మొదలైనట్టే! ఇవేవీ బీజేపీకి తెలియనివి కావు. అందుకే వచ్చే ఎన్నికలకు బీజేపీ వద్ద ఒక పాశుపతాస్త్రం ఉంది. అదే రామమందిరం ఓపెనింగ్.
వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో ఈ ఘట్టం ఉండబోతోంది. ఇప్పటికే రామమందిరం ఆరంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆలయ కమిటీ ఆహ్వానం కూడా అందింది. ప్రధానమంత్రి తన వీలును బట్టి ఈ కార్యక్రమానికి రావొచ్చని ఆలయ నిర్మాణ కమిటీ ప్రకటించింది. మరి ఈ ఆహ్వానం ప్రదానమంత్రికేనా.. దేశంలోని అందరు రాజకీయ ప్రముఖులకూ అందుతాయా.. అనేది ఆసక్తిదాయకమైన అంశం. కనీసం రాష్ట్రపతికి అయినా ఆహ్వానం ఉంటుందా.. అంటూ సన్నాయి నొక్కుల నొక్కే వారూ ఉన్నారిప్పటికే! పార్లమెంట్ భవనం ఆరంభోత్సవ కార్యక్రమం సంగతి అందరికీ తెలిసిందే.
ఆ కార్యక్రమంలో కనిపించిందంతా సాధువులు, సన్యాసులు, ప్రధానమంత్రి మోడీనే. ప్రజాస్వామ్య దేశంలో.. పార్లమెంట్ భవన కార్యక్రమానికి ప్రజల చేత ఎన్నుకోబడిన వారు, కనీసం సర్పంచ్ లను పిలిపించి వారి చేత రిబ్బన్ కటింగ్ చేయించినా.. ప్రజాస్వామ్య అందం ప్రపంచానికి చాటినట్టుగా అయ్యేదని, అయితే సాధువులు సన్యాసులు పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ముందుడటం ఏమిటంటూ కొందరు ఎండగట్టారు కూడా!
అయితే మతం అనే అంశాన్ని తమ రాజకీయ ఊపిరిగా తీసుకుంటూ బీజేపీ అధికారాన్ని అందుకుంది. ఆ అధికారం చేజారకుండా ఉండటానికి కూడా మతాన్నే ఆధారంగా చేసుకుంది. ఎన్నికల ప్రచార సమాయాల్లో అయితే.. ఈ పిచ్చి పీక్స్ కు చేరుతూ ఉంది. ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు తేడా లేకుండా.. మతం అనే అంశాన్ని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోడీ స్వయంగా కేరళ స్టోరీ అనే సినిమా గురించి ప్రస్తావించి ప్రయోజనం పొందే ప్రయత్నం చేయడం పరాకాష్ట! మరి కేరళ స్టోరీ అనే సినిమానే వాడుకోకుండా వదలిన పార్టీ… అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఏ రేంజ్ లో వాడుతుందో రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. వాడటం అయితే మామూలుగా ఉండబోదు. మరి మందిరం మరోసారి మోడీని పీఎంగా చేస్తుందా అనేది మాత్రం శేష ప్రశ్న!