టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 15 ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్, గుంటూరు సహా తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గతంలో బ్యాంకుల నుంచి రూ.9394 కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలపై ఆయనపై సీబీఐ కేసు నమోదైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత అవసరాలకు వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కేసు విచారణలో భాగంగానే రాయపాటి నివాసంతో పాటు ఆయన సంస్థలకు చెందిన పలువురి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. కీలక పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కనిపించిన మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. అలాగే పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాంట్రాక్ట్ కూడా ట్రాన్స్ ట్రాయ్ చేజారిపోయింది.