దిల్ రాజు పరువు తీసేసారు కదా

ఇప్పటి దాకా నిర్మాత దిల్ రాజు అంటే టాలీవుడ్ లో అందరికీ ఆప్తుడు. నాన్ కాంట్రావర్సీ. అందరివాడు. కానీ లేటెస్ట్ గా విడుదలైన డిజె సినిమా ఆయనకు ఆ ఆనందం లేకుండా చేసేస్తోంది. పైగా…

ఇప్పటి దాకా నిర్మాత దిల్ రాజు అంటే టాలీవుడ్ లో అందరికీ ఆప్తుడు. నాన్ కాంట్రావర్సీ. అందరివాడు. కానీ లేటెస్ట్ గా విడుదలైన డిజె సినిమా ఆయనకు ఆ ఆనందం లేకుండా చేసేస్తోంది. పైగా ఈ సినిమా ఆయన సంస్థకు 25వ సినిమా కావడం విశేషం.

సినిమా ఎంతకు అమ్మారు, ఏ మేరకు లాభాలు వచ్చాయి. కొన్నవాళ్లు లాభ పడ్డారా లేదా? అనే విషయాలు అలా వుంచితే, ఈ సినిమా కలెక్షన్ల వివరాలు, వాటిని ప్రకటించిన తీరు, వాటిపై శోధన అన్నీ కలిసి ఇప్పుడు ఆ సినిమా నిర్మాత దిల్ రాజను కార్నర్ లోకి తోస్తున్నాయి.

డిజె సినిమాకు మూడు రోజుల్లో 75 కోట్ల గ్రాస్ వచ్చిందని, ఫస్ట్ వీక్ లో వంద కోట్లు అని ప్రకటించేసారు. అంతటితో ఆగకుండా, బాహుబలి తరువాత రికార్డు తమదే అంటూ గంట వాయించారు. పోనీ అక్కడితో ఆగారా అంటే, దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా ముందుకు పోయి, నైజాంలో 20 కోట్ల షేర్ వసూలు చేసిందని, ఇది తప్పు అని నిరూపిస్తే, మెగా ఫోన్ వదిలేస్తానని సవాల్ విసిరారు.

ఇవన్నీ కలిసి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ను తీవ్రంగా అసంతృప్తికి గురిచేసాయి. ఖైదీ నెంబర్ 150 సినిమా రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయని పరోక్షంగా చెప్పడం, వారికి కోపం తెప్పించింది. ఇప్పటి దాకా ట్వీట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సాగిన యుద్ధం ఏకంగా ప్రత్యక్షంగా ధర్నాకు దారితీసింది.

సుమారు 150 మంది మెగా ఫ్యాన్స్ సాగర్ సొసైటీ లోని దిల్ రాజు ఆపీసు దగ్గర నినాదాలు చేస్తూ ధర్న చేసారు. నైజాం 20 కోట్ల కలెక్షన్ల వివరాలు బయట పెట్టాలని వారు నినాదాలు చేసారు. 

సరే, ఏం జరిగింది అన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఈ వివాదం పుణ్యమా అని దిల్ రాజు చిరు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లకు దూరమైనట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ తో తరువాతి సినిమా చేయాలని అనుకుంటున్న దిల్ రాజుకు అది అంత వేగం సాధ్యం కాదు. అలాగే మిగిలిన హీరోలు కూడా ఇలా ఫేక్ కలెక్షన్లు ప్రకటించడం పట్ల దిల్ రాజుపై కినుకగా వున్నారని వినికిడి.

నిర్మాతగా అందరు హీరోలను కలుపుకుని పోవాల్సిన దిల్ రాజు, ఇలా ఓ హీరో సినిమాను గాల్లోకి ఎత్తే ప్రయత్నం చేసి, ఇబ్బందుల్లో పడ్డారు. అయితే దీంట్లో దిల్ రాజు తప్పు కన్నా, డైరక్టర్ హరీష్ శంకర్ అత్యుత్సాహం ఎక్కువగా వుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనే కావాలని కలెక్షన్లను ప్రకటింప చేసారని, తమ తప్పు లేదని సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చూసిన వారు చెబుతున్నట్లు తెలుస్తొంది.

ఇప్పటికే హరీష్ శంకర్ సవాళ్లు వంటి వాటిపై బన్నీ సోదరుడు అల్లు శిరీష్ అసంతృప్తిగా వున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ధర్నాతో బన్నీ కూడా అంత సంతృప్తిగా వుండలేడు. మొత్తం మీద డిజె సినిమా ఎవరికీ సంతోషాన్ని ఇచ్చినట్లు లేదు.