రామనాథ్ కోవింద్ అనే ఆయన రాష్ట్రపతి కాబోతున్నారనే విషయం గోడ మీద రాత. ఆయన పేరు ప్రకటించేవరకు ఆయనెవరో తెలియదు. ప్రకటించగానే అందరూ గూగుల్ చేసి ఓహో అనుకున్నారు. అలా అనుకున్నవాళ్లలో బిజెపి నాయకులూ వున్నారు. మొత్తం మీద ఆయన గురించి కాస్త సమాచారం పోగేసి మీడియాలో ప్రవేశపెట్టారు. ఎవరు రాసినా అదే. అంతకంటె విశేషంగా రాయడానికి ఏ జర్నలిస్టూ సిద్ధంగా లేడు. ఎందుకంటే ఆయనను, ఆయన కెరియర్ను జాగ్రత్తగా ఫాలో అయి, ఫలానా అప్పుడు అది చేశారు, ఫలానాది సాధించారు అని సాధికారంగా చెప్పగల మొనగాడు లేడు.
రాస్తేగీస్తే బిహార్ గవర్నరుగా వుండగా చేసిన పనుల గురించి రాయాలి. అదీ కాస్తే. బిజెపి తరఫున రాష్ట్రపతి అభ్యర్థి ఎవరని వూహాగానాలు చెలరేగినపుడు కూడా యీయన పేరు ఎవరూ తలవలేదు. ఆయనా తలచుకోలేదు. నిజానికి యీ మే 30న తమ పెళ్లయి 43 ఏళ్లయిన సందర్భంగా భార్యతో సహా ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని మషోబ్రా వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి సమ్మర్ పాలెస్ అయిన 'రిట్రీట్ బిల్డింగ్' కనబడితే వెళ్లి చూద్దామనుకున్నారు. గవర్నరు హోదా వ్యక్తి అయినా ముందస్తు అనుమతి లేని కారణంగా లోపలకి రానీయలేదు.
రెణ్నెళ్లు పోయాక ఆ బిల్డింగుకు ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు వస్తూపోతూండవచ్చని ఆయన వూహించి వుండడు. 'వీరివీరి గుమ్మడిపండు, వీరి పేరెవరు?' అన్నట్టుగా మోదీ, అమిత్ రాష్ట్రపతి అభ్యర్థి యీయనే అని అనగానే హఠాత్తుగా ఫోకస్ ఆయన మీద పడింది. దాంతో ఆయన గురించి రాయవలసిన అవసరం ఏర్పడింది. కానీ రాయడానికి ఏమీ కనబడటం లేదు.
రైతులను సంతుష్టి పరచడానికేమో కోవింద్ తండ్రి మైకూలాల్ను మోదీ రైతుగా పేర్కొన్నారు. కానీ వాళ్ల కుటుంబానికి భూమే లేదు. మహా అయితే రైతు కూలీగా కొంతకాలం పనిచేసి వుండవచ్చేమో కానీ ఆయనను ప్రధానంగా కిరాణా వ్యాపారనే అనాలి. రామనాథ్ పెద్దన్నగారు కూడా అదే వ్యాపారంలో వున్నాడు. కాన్పూరుకి 60 కిమీల దూరంలో దేహాత్ జిల్లాలోని పరౌంఖ్ గ్రామంలో 1945లో రామనాథ్ పుట్టారు. నలుగురు అన్నలు, యిద్దరు అక్కలు. తల్లి చిన్నప్పుడే పోయింది. గ్రామంలో వున్న బడిలో చదువుకుని, కాన్పూరులో బి.కామ్, తర్వాత ఎల్ఎల్బి చదివారు.
25 ఏళ్ల వయసులో దిల్లీకి వెళ్లి అడ్వకేటుగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. దిల్లీ హైకోర్టులోను, సుప్రీం కోర్టులోను పనిచేశారు. ఆయన ఎంత గొప్ప లాయరో మనకు తెలియదు కానీ పెద్దగా సంపాదించినట్లు లేదు. 1977లో జనతా పార్టీ తరఫున మొరార్జీ దేశాయి ప్రధానిగా వుండగా వెళ్లి కలిస్తే ఆయన తన వద్ద ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటుగా ఉద్యోగం యిచ్చారట. దానితో పాటు దిల్లీ హైకోర్టులో కేంద్రప్రభుత్వం తరఫున కౌన్సెల్‌గా పదవి కూడా యిచ్చారు. 1979లో జనతా ప్రభుత్వం పడిపోయి 1980లో ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చింది. ఈయన కేంద్రం తరఫున 1980 నుంచి 1993 వరకు స్టాండింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా వున్నాడు. 1993తో ఆయన ప్రాక్టీసు ముగిసింది.
1991లో బిజెపి ప్రతిపక్షంలో వుండగానే తన 46 వ యేట ఆ పార్టీలో చేరాడు. ఈయనకు ఆరెస్సెస్ నేపథ్యం లేదు. అయినా వారి సంస్థలతో కలిసి పనిచేశాడు. బిజెపికి దళిత అభ్యర్థి ఓ పట్టాన దొరకడు కాబట్టి వెంటనే యుపిలోని ఘాటంపూర్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి టిక్కెట్టిచ్చి నిలబెట్టారు. ఓడిపోయాడు. 1994లో యుపిలో ప్రతిపక్షంలో వున్న బిజెపి నాయకుడు కళ్యాణ్ సింగ్ రాజ్యసభ ఎంపీగా పంపాడు. 2000 వరకు నడిచిన పదవీకాలంలో 261 ప్రశ్నలు వేశాడు.
2000లో మళ్లీ గెలిపించి పంపితే ఈసారి ఆరేళ్లలో12 ప్రశ్నలు వేశాడు. ప్రశ్నల మాట ఎలా వున్నా ఎంపీ నిధులతో పదివేల మంది జనాభా వున్న తన వూరిని బాగు చేద్దామనుకున్నాడు. బాలికల కోసం స్కూలు కట్టించాడు. రోడ్లు వేయించాడు. స్టేట్ బ్యాంక్ చేత ఒక బ్రాంచ్ తెరిపించాడు. ప్రతి యింటికి కరంటు మీటర్లు పెట్టించాడు. తన పూర్వీకుల యింటిని కమ్యూనిటీహాలుగా మార్చి దానికి మరమ్మత్తులు చేయించాడు.
ఇదే సమయంలో 1998 నుంచి 2002 వరకు బిజెపి వారి ఎస్సీ/ఎస్టీ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ హోదాలో ఆయన సాధించిన విజయాలు లేదా చేపట్టిన ఆందోళనలు అంటూ ఏవీ రిపోర్టు కాలేదు. 2010లో రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఖ్కు మతంలోని దళితులకు దళిత రిజర్వేషన్ యిచ్చినట్లే, ముస్లిం, క్రైస్తవ దళితులకు కూడా దళిత రిజర్వేషన్ యివ్వాలని ప్రతిపాదించినప్పుడు 'క్రైస్తవులు, ముస్లిములు యీ దేశానికి పరాయివారు' (ఏలియన్స్) అనే వ్యాఖ్య చేశారు. దీన్నే ఒవైసీ ప్రస్తావించాడు.
ఆరెస్సెస్ నడిపే డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ రిసెర్చి ఫౌండేషన్ నడిపేటప్పుడు కోవింద్ పుస్తకప్రచురణలతో సరిపెట్టకుండా బిజెపి-ఆరెస్సెస్ కార్యకర్తలతో ప్రసంగాలు ఏర్పాటు చేశారు. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఐన దివ్యప్రేమ సేవా మిషన్ హరిద్వార్‌లో కుష్ఠురోగులకు సేవ చేస్తూ వుంటుంది. రోగుల పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూలు కడతానన్నపుడు యీయన తన ఎంపీ ఫండ్స్ నుంచి రూ.25 లక్షలు యిచ్చారు. ఈ విధంగా తన సౌజన్యాన్ని, మంచితనాన్ని చూపుకున్నారు తప్ప ఉద్యమకారుడిగా, సామాజిక కార్యకర్తగా పేరు తెచ్చుకున్నది లేదు.
గూగుల్‌లో ఎంత వెతికినా ఆయన యూత్‌ఫుల్‌గా వున్న ఫోటో ఒక్కటీ కనబడటం లేదు. దళిత మోర్చా నాయకుడిగా వుండే సమయంలో లేదా లాయరుగా వుండే సమయంలో వున్న ఒక్క ఫోటో కూడా కానరాదు. బిహార్ గవర్నరు అయినప్పటినుంచి మాత్రమే వున్నాయి. ఆయన ఏ విధంగానూ 'వార్తల్లో వ్యక్తి' కాడు.
యుపి దళితుల్లో అత్యధికులు జాతవులు (మాయావతిది యిదే కులం). తర్వాతి స్థానం పాసీలది. మూడో స్థానం కోరీలది. ఈయన ఆ కులానికి చెందినవాడు. దళిత మోర్చా పదవి వచ్చే ముందు అఖిల భారత కోరీ సమాజ్‌కు అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా వ్యవహరించాడట కానీ దాని ద్వారా వారికి ఆయన సాధించిపెట్టిన సౌకర్యాల గురించి ఎవరూ ప్రస్తావించటం లేదు. దళితులకు చాలా సేవ చేశారు అని మోదీ చెప్తున్నారు కానీ ఓటర్లు అలా అనుకోనట్టుగా వుంది. 2007 ఎన్నికలలో భోగినీపూర్ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నిలబడితే ఓడించేశారు.
ఇలా పెద్ద గుర్తింపు లేకుండా వుంటూ వస్తున్న కోవింద్ 2014 పార్లమెంటు ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న అమిత్ షా కంటపడ్డాడు. 2012 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి దెబ్బ తింది. మాయావతి వెనకాల వున్న దళితులను ఉపకులాలుగా చీలిస్తే తప్ప ఆమె ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టడం కష్టమని గ్రహించిన అమిత్ కంటికి కోరీ కులస్తుడైన కోవింద్ కనబడ్డాడు. దిల్లీలో వున్న అతన్ని రాష్ట్ర బిజెపికి జనరల్ సెక్రటరీగా తెచ్చి రాష్ట్రంలోని కోరీలను బిజెపివైపు తెమ్మనమని అడిగాడు.
కోవింద్ తనూ ఓ నియోజకవర్గంలో నిలబడతానన్నాడు. 'వద్దు, రాష్ట్రమంతా పర్యటించు' అన్నాడు అమిత్. కోవింద్ విన్నాడు. అది అమిత్‌ను మెప్పించింది. ఫలితమే 2015 ఆగస్టులో బిహార్‌కు గవర్నరుగా పంపడం! గవర్నరుగా కోవింద్ నీతిశ్తో చాలా మర్యాదగా వ్యవహరించాడు. మద్యనిషేధం బిల్లుతో సహా తనకు పంపిన ప్రతి బిల్లును ఆమోదించాడు. రాజకీయంగా కూడా తెలివిగా వ్యవహరించి నీతిశ్కు, బిజెపి కేంద్రనాయకత్వానికి సయోధ్య కుదిర్చాడు. ఇవన్నీ మోదీ, అమిత్ కళ్లల్లో పడ్డాయి.
రాష్ట్రపతి ఎన్నిక సమయం దగ్గర పడేటప్పటికి మోదీ, అమిత్ చాలా లెక్కలు వేసుకున్నారు. గతంలో ఎన్డిఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు కాబట్టి అందరికీ ఆమోదయోగ్యుడైన తటస్థుడు కలాం గారిని ఎన్నుకోవలసి వచ్చింది. ఇప్పుడు బిజెపికి సంపూర్ణ ఆధిక్యత వుంది. తమ పార్టీవాణ్నే పెట్టుకోవచ్చు. ఎవరైనా అనుభవజ్ఞులైన నాయకుణ్ని పెట్టడం సహజం. కానీ దానిలో రిస్కుంది. ఇప్పటివరకు రాష్ట్రపతులైన వారిలో రాజకీయ నాయకులు ఎక్కువ.
పార్లమెంటు ఎన్నికలలో ఏదైనా పార్టీకి పూర్తి ఆధిక్యత రాని సమయాల్లో రాష్ట్రపతి నిర్ణయం, విచక్షణ కీలకమవుతాయి. గతంలో తమ పార్టీకి చెందినవాడు కదాని ధైర్యంగా వుండడానికి లేదు. 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మొరార్జీ తమ పార్టీవాడే అయిన సంజీవరెడ్డిని రాష్ట్రపతిని చేశారు. కానీ 1979లో పార్టీ ముక్కలైనపుడు సంజీవరెడ్డి మొరార్జీ ఆశించిన విధంగా ప్రవర్తించలేదు. సిండికేటు రాజకీయాల నాటి కక్షలు అప్పటిదాకా మనసులో పెట్టుకుని అలా వ్యవహరించాడని మొరార్జీ అనుయాయుల సందేహం.
ఇందిర ప్రధానిగా వుండగా పెద్దగా ప్రతిభాపాటవాలు లేని కాంగ్రెసు మంత్రి జ్ఞానీ జైల్ సింగ్‌ను 1982లో రాష్ట్రపతిని చేసింది. ''నేను ఇందిరకు అత్యంత విధేయుణ్ని. చీపురు తీసుకుని గది తుడవమన్నా తుడుస్తాను.'' అని జైల్ సింగ్ ప్రకటించి తన విధేయత చాటుకున్నాడు. అలాటి వాడు కూడా ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఇందిరంటే విముఖత పెంచుకున్నాడు. రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాక ముప్పుతిప్పలు పెట్టాడు. సొంత పార్టీ నాయకులు సైతం విపత్కర పరిస్థితుల్లో నమ్మదగినవారు కారు. అందువలన రాజకీయంగా ప్రముఖులైన వారిని తీసుకోదలచుకోలేదు.
మోదీ గతంలో తనను రక్షించినందుకు ఆడ్వాణీని రాష్ట్రపతి చేస్తాడనుకున్నారు. అంతలో పాత కేసు ముందుకు వచ్చింది. సరే, ఆడ్వాణీని తీసుకోరు, పోనీ మురళీ మనోహర్ జోషీకి ఏమొచ్చింది? అందుకే యీ అనుమానం.
ప్రతిపక్షం నామమాత్రం అయిపోయింది కాబట్టి 2019లో బిజెపియే మళ్లీ గెలిచి, మోదీయే ప్రధాని కావడానికి అన్ని అవకాశాలూ వున్నాయి. అయినా బిజెపికి యిప్పుడున్నంత బలం రాకపోతే….? అనే అనుమానం ఏ మూలో వుండి వుండవచ్చు. త్రిశంకు సభ ఏర్పడితే రాష్ట్రపతి పాత్ర కీలకమౌతుంది. తమ చెప్పుచేతల్లో వుండేవాడు అక్కడ వుంటేనే పనులవుతాయి. ఎవరైనా వ్యాపారవేత్త లేదా సైంటిస్టు వంటి ఏ పార్టీకి చెందని తటస్థుణ్ని తీసుకోవచ్చు.
కానీ కలాంను రాష్ట్రపతిగా తీసుకున్నపుడు ఏం జరిగింది? ప్రధానిగా వాజపేయి తెచ్చుకుంటున్న ప్రజాదరణతో సైంటిస్టుగా, దార్శనికుడిగా, మేధావిగా, స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తిగా, అందర్నీ కలుపుకుని పోయే మంచివాడిగా కలాం యిమేజి పోటీ పడింది. దేశయువతలో కలాం కంటూ అభిమానులు ఏర్పడ్డారు. ఆయన డైరక్టుగా వాళ్లతో సంపర్కం పెట్టుకుని బాగా పాప్యులర్ అయిపోయాడు. అటువంటి పరిస్థితి మోదీకి రుచించదు.
దేశం మొత్తం తన నామస్మరణే చేయాలి. లైమ్లైట్ పంచుకోకూడదు. ఈ విధంగా లెక్కలు వేసి ప్రముఖుడు కానివాడు, రాజకీయంగా బలహీనుడు వుండాలనుకున్నాక దళితుడైతే మంచిదనుకున్నారు. యుపిలో దళితులు 2014లో మోదీ మ్యాజిక్ ఫలితంగా పెద్ద సంఖ్యలో బిజెపికి ఓటేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా జాతవేతర దళితులు బిజెపి వెంట నడిచారు. అయితే ముఖ్యమంత్రి పదవి ఠాకూర్‌కు యిచ్చారు. ఉప ముఖ్యమంత్రులుగా బ్రాహ్మణుణ్ని, బిసిని పెట్టారు. దళితుడికి ఏదీ యివ్వలేదు. గోవధ నిషేధంతో నష్టపోతున్నవారిలో మైనారిటీలతో బాటు గోమాంసం తినే దళితులు కూడా వున్నారు.
గోచర్మంతో పనిచేసే దళితులూ వున్నారు. ఇప్పుడు రాష్ట్రపతిగా దళితుణ్ని నియమిస్తే వాళ్లను సంతుష్టి పరిచినట్లుంటుందని అంచనా. ఇలాటి లెక్కల్లో ఏ మాత్రం పస వుంటుందో నాకు తెలియదు. కెఆర్ నారాయణన్‌ను జనతాదళ్ ఉపరాష్ట్రపతి చేసింది. 1997లో నేషనల్ ఫ్రంట్ రాష్ట్రపతిని చేసింది. తర్వాత వచ్చిన ఎన్నికలలో దళితులందరూ నేషనల్ ఫ్రంట్‌కు ఓటేశారా? కాంగ్రెసు ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్‌ను 1974లో రాష్ట్రపతి చేసింది. మరి 1977 ఎన్నికలలో ముస్లిములు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఓటేసి ఓడించారే!
బిజెపిలో దళిత నాయకుణ్ని వెతకడం కష్టమైన పనే. జనసంఘ్ రోజుల్లో అయితే అది బొత్తిగా అగ్రవర్ణాల పార్టీగానే వుంది. బిజెపి అవతారం ఎత్తి విస్తరించ నారంభించాక బిసిలు కలిశారు. ఇప్పటికీ దళితులలో, మైనారిటీల్లో బిజెపి యింకా వ్యాపించవలసి వుంది. గోవాలో మైకేల్ లోబో అనే ఎమ్మెల్యే తప్ప బిజెపి క్రైస్తవ నాయకుడెవరూ వున్నట్లు నాకు తెలియదు. ముస్లింలైతే గతంలో షో పీస్‌గా సికిందర్ భక్త్ వుండేవాడు, ఇప్పుడు ముక్తార్ నక్వీ, ఎంజె అక్బర్లు వున్నారు.
40 మంది దళిత బిజెపి ఎంపీలున్నా, అందరికీ తెలిసిన బిజెపి దళిత నాయకుడు ఎవరు అంటే తల గోక్కోవలసిందే. ఈ పరిస్థితుల్లో వాళ్లు కష్టపడి కోవింద్‌ను పట్టారు. యుపిలో యిప్పట్లో ఎన్నికలు లేవు కానీ గుజరాత్లో వున్నాయి. యుపిలో కోరీలను రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్లో కోలీలంటారు. చేనేత పనిచేస్తారు. ఆ రాష్ట్రాలలో వాళ్లు ఒబిసిల కింద లెక్క. గుజరాత్‌కి వస్తే 18% ఓట్లు వాళ్ల చేతుల్లో వున్నాయి.
18 నియోజకవర్గాల్లో వారి ఓట్లు కీలకం. ఇప్పుడీ కోవింద్‌కు యిచ్చిన ప్రాముఖ్యతను చూపించి గుజరాత్లో కోలీలను యింప్రెస్ చేయవచ్చని అమిత్ ఐడియా. ఇన్నాళ్లూ బిజెపికి అండగా నిలిచిన పటేళ్లు జారుకుంటున్నారు కాబట్టి యిలాటి ఊతాలు ఎంతో అవసరం. కోవింద్‌ను రాష్ట్రపతి చేసి దళితుల పట్ల తమకు ఏ వ్యతిరేకత లేదని చాటుకోవచ్చని మోదీ, అమిత్ ద్వయం ఆలోచన.
జూన్ మొదటివారంలోనే వాళ్లిద్దరూ కోవింద్‌ను సెలక్టు చేసుకోవడం జరిగిందట. అయితే బయటకు పొక్కనియ్యలేదు. కాబినెట్ సహచరులకు కూడా తెలియదు. జూన్ 17 వరకు కోవింద్‌కు కూడా చెప్పలేదు. జూన్ 11న నితిన్ గడ్కరీకి మాత్రం వాసన తగిలింది – 'కోవింద్ గురించి సమాచారం రహస్యంగా కనుక్కో' అని అమిత్ అతనికి చెప్పడంతో! రాజ్‌నాథ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జేట్లే లతో ఓ కమిటీ వేశారు. వాళ్లు ప్రతిపక్షాల వద్దకు వెళ్లి 'మా అభ్యర్థికి మద్దతియ్యండి' అన్నారు. 'అభ్యర్థి ఎవరని మీరనుకుంటున్నారు? వారి పేరు సెలవిస్తే మా ఉద్దేశం చెప్తాం' అన్నారు వాళ్లు.
మీ ముక్కలు కింద పెట్టండి తప్ప మా ముక్క చూపించం అనేసి వీళ్లు వచ్చేశారు. ఆ తర్వాత జూన్ 19న పార్టీ 11 మంది సభ్యుల పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పరచి అందరినీ పిలిచి మీమీ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు. వాళ్లంతా కూడబలుక్కున్నట్లు 'మీ అబిప్పాయమే మా అబిప్పాయం' అనేశారు. వాళ్లకెలాగూ తెలుసు మోదీ, అమిత్ కలిసి ఏదో ఒకటి అనేసుకుని వుంటారని, తమని ఉత్తుత్తినే అడుగుతున్నారని. ఆ పాటి దానికి ఆలోచించే శ్రమ కూడా ఎందునుకున్నారు.
వీరి మాటలు విని అమిత్ గంభీరంగా తల వూపి, గదిలోకి వెళ్లి మోదీతో అప్పుడే మాట్లాడినట్లు నటించి, మళ్లీ వీళ్ల దగ్గరకి వచ్చి కోవింద్ పేరు ప్రకటించాడు. 'ఎవరారు?' అని అందరూ అడగ్గా ఆయన అంతటివాడు, యింతటివాడు అని అమిత్ వర్ణించి చెపుతూండగానే గదిలోంచి మోదీ ప్రతిపక్షాల నాయకులకు ఫోన్లు చేసి 'అభ్యర్థి పేరు ఫలానా, మీరు మద్దతివ్వడమే తరువాయి' అని చెప్పసాగాడు. మీటింగు ముగిసిపోగానే అమిత్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లో కోవింద్ పేరు ప్రకటించేశాడు. ఇక అప్పణ్నుంచి అందరూ గూగుల్ మీద పడ్డారు.
ఓ రెండు రోజులకు ఒవైసీ 2010లో కోవింద్ చేసిన వ్యాఖ్య అంటూ దుమ్ము లేపబోయాడు కానీ మీడియా పట్టించుకోలేదు. కోవింద్ గురించి వివాదాస్పదంగా రాయడానికీ ఏమీ లేదు, అలాగే పాజిటివ్‌గా రాయడానికీ పెద్ద లేదు. ఇప్పుడు మోదీ ప్రభంజనానికి ఎదురు లేకుండా వుంది. అతను తలచుకుంటే నందిని పంది చేయగలడు, పందిని నంది చేయగలడు. నెహ్రూ హయాంలో దేశంలోని పలుప్రాంతాల్లో బలమైన నాయకులుండేవారు.
ఇందిరా గాంధీ తన హయాంలో వారందరికీ తోకలు కత్తిరించేసింది. అనామకులను పిలుచుకుని వచ్చి అందల మెక్కించింది. దాని కారణంగా కొంతకాలానికి దేశం మొత్తం మీద సరైన నాయకుడంటూ లేకుండా పోయాడు. ఇప్పుడు కాంగ్రెసులో దేశమంతా తెలిసిన ఒక్క నాయకుడు కూడా లేడు. సోనియాకు అనారోగ్యం, రాహుల్‌కు అనాసక్తి. కానీ గాంధీ కుటుంబాన్ని పక్కన పడేద్దామంటే నేషనల్ స్టేచర్ వున్న నాయకుడు ఎవరూ లేకుండా పోయారు. మోదీ హయాం యిలాగే కొనసాగితే బిజెపిలో కూడా అంతే జరుగుతుంది.
ఏ పథకమైనా సరే, మంచైనా చెడైనా ఏ విధానమైనా సరే, అంతా మోదీ పేరు మీదుగానే నడుస్తోంది. మోదీ తదనంతరం బిజెపి పరిస్థితి ఏమిటి? అని ఎవరూ ఆలోచించటం లేదు. అతని కాబినెట్ సహచరులు కూడా అంగుష్టమాత్రులే. ఎక్కడ చూసినా మోదీ నామజపమే. మోదీ తప్ప మనకు వేరే లీడరు ఎవరూ లేకుండా పోతున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎంపికలో అది మరొక్కమారు రుజువైంది. కోవింద్ మంచివాడు కావచ్చు, రాష్ట్రపతిగా హుందాగా ప్రవర్తించవచ్చు కానీ వ్యక్తిగతంగా స్టేచర్ లేనివాడు. అతన్ని అభ్యర్థిగా చేయకపోయినా, అతన్ని చేయలేదేం అని ఎవ్వరూ అడగరు. అటువంటి అగస్త్యభ్రాతను దేశప్రథమపౌరుణ్ని చేస్తున్నాడు మోదీ. అలా చేసే అవకాశం యిస్తున్నారు దేశప్రజలు!
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]