సినిమా రంగంలో లైమ్ లైట్ లో వుండేవారు కొందరు. లైమ్ లైట్ లో వుండాలనుకునేవారు మరి కొందరు. లైమ్ లైట్ లో వుంచాలనుకునే వారు ఇంకొందరు. దర్శకుడు బోయపాటికి ఈ మూడో రకం జనాలు కాస్త బాగానే వున్నారు. వాళ్లే పాపం బోయపాటిని వార్తల్లోకి లాగుతూ అభాసు చేస్తున్నారు.
సరైనోడు సినిమా తరువాత తప్పనిసరై బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది బోయపాటికి పరీక్షలాంటిది. ఈ సినిమా తేడా చేస్తే కనుక, గతంలోని హిట్ ల క్రెడిట్ అంతా ఆయా సినిమాల హీరోలకు పోతుంది. పెద్ద హీరోలు లేకపోతే బోయపాటి ఏమీ చేయలేరని పెదవి విరిచేస్తారు.
మరోపక్క ఈ సినిమా తరువాత సరైన పెద్ద సినిమా మళ్లీ చేతిలోకి రావాలి. అదీ కాక ఈ సినిమాకు భారీ ఖర్చు చేసారు. ఆ రేట్లు రావాలంటే అన్ని విధాల బజ్ వుండాలి. బోయపాటి తరువాతి సినిమా వస్తోంది అన్న నమ్మకం బయ్యర్లకు వుండాలి.
అందుకోసమే అన్నట్లుగా బోయపాటి మద్దతు దారులో, అభిమానులో తెగ ఫీలర్లు పుట్టిస్తున్నారు. చిరంజీవితో సినిమా అన్నారు. ఆయన మరో రెండేళ్లకు కానీ ఖాళీ కారు. అఖిల్ తో లేదా నాగ్ చైతన్యతో సినిమా అన్నారు. అబ్బే లేదని చెప్పేసాడు నాగ్. ఇప్పుడు లేటేస్ట్ గా మహేష్ తో సినిమా అంటున్నారు. మహేష్ చేతిలో ఫినిష్ చేయాల్సిన సినిమాలు మూడు వున్నాయి.
రామ్ చరణ్ మినహా ఇప్పట్లో డేట్లు ఇవ్వగల పెద్ద హీరో ఎవ్వరూ లేరు. మరి ఇకపై అతని పేరే వినిపిస్తుందేమో? అయినా రామ్ చరణ్ కూడా సుకుమార్ సినిమా చేసాక, మేర్లపాక మురళి సినిమా చేయాల్సి వుంది. ఏదో ఒక సినిమా సెట్ అయ్యే వరకు బోయపాటిని ఎవరో ఒకరికి ఇలా ముడి పెడుతూ వుంటారేమో?