అది చైనాకీ.. ఇది పాకిస్తాన్‌కీ రాసిచ్చేద్దామా.?

పాకిస్తాన్‌కేమో కాశ్మీర్‌ కావాలి.. చైనాకేమో అరుణాచల్‌ ప్రదేశ్‌ కావాలి. రాసిచ్చేద్దామా.? అట్నుంచి పాకిస్తాన్‌, ఇట్నుంచి చైనా.. ఇండియా మీదకు దండెత్తేందుకు తెగ ఆరాటపడిపోతున్నాయి మరి.! కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ ఎన్నో ఏళ్ళుగా నానా తంటాలూ…

పాకిస్తాన్‌కేమో కాశ్మీర్‌ కావాలి.. చైనాకేమో అరుణాచల్‌ ప్రదేశ్‌ కావాలి. రాసిచ్చేద్దామా.? అట్నుంచి పాకిస్తాన్‌, ఇట్నుంచి చైనా.. ఇండియా మీదకు దండెత్తేందుకు తెగ ఆరాటపడిపోతున్నాయి మరి.! కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ ఎన్నో ఏళ్ళుగా నానా తంటాలూ పడ్తోంది. ఏమీ చేయలేక, ఎప్పటికప్పుడు తీవ్రవాదాన్ని ఎగదోస్తూనే వుంది. 

ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కి, చైనా సహాయం అందిస్తుండడం ఓపెన్‌ సీక్రెట్‌. పాకిస్తాన్‌, చైనా ఇప్పటికే భారదేశంలో చాలా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అది చాలదన్నట్టు, ఇప్పుడు మరింతగా భారత్‌పై 'దాడుల్ని' పాకిస్తాన్‌, చైనా తీవ్రతరం చేస్తున్నాయి. దాడులంటే యుద్ధమే చేయక్కర్లేదు.. కవ్వించొచ్చు, అశాంతిని రేకెత్తించొచ్చు.. ఈ అలజడుల కారణంగా, భారతదేశం ఆర్థికాభివృద్ధిలో వెనుకబడితే, కొంతమేర తమ ప్రయత్నం సఫలమైనట్లేనని పాకిస్తాన్‌, చైనా భావిస్తున్నాయన్నమాట.

గతంతో పోల్చితే, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో భారత్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇది పాకిస్తాన్‌, చైనాలకు అస్సలు నచ్చడంలేదు. అంతరిక్ష రంగంలో భారత్‌ సాధిస్తున్న విజయాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ ఏర్పరచుకున్న స్పష్టమైన లక్ష్యాలు.. ఇవన్నీ పాకిస్తాన్‌, చైనాలకు కంటగింపుగా మారిన మాట వాస్తవం. అదే ఇప్పుడు సరిహద్దుల్లో కొత్తగా తలెత్తుతున్న ఉద్రిక్తతలకు కారణం.

అరుణాచల్‌ప్రదేశ్‌ విషయంలో చైనాది మొదటి నుంచీ ఒకటే వైఖరి. అది తమ భూభాగమేనని చైనా వాదిస్తూ వస్తోంది. తాజాగా, సిక్కిం స్వేచ్ఛ కోసమంటూ చైనా కొత్త పల్లవి అందుకుంది. ఈ మధ్యకాలంలో సిక్కిం బోర్డర్‌లోనే చైనా, భారత సైనికులపై భౌతిక దాడులు మొదలు పెట్టింది. '1962 నాటి పరిస్థితుల్ని గుర్తుచేసుకోండి..' అంటూ చైనా, భారత్‌కి ఆనాటి యుద్ధ పరిస్థితుల్ని గుర్తుచేస్తోంది కూడా.

భూటాన్‌తో స్నేహం భారత్‌కి అవసరం. అది మన మిత్రదేశం. ఆ భూటాన్‌పై ఉక్కుపాదం మోపి, భారత్‌పై ఒత్తిడి పెంచాలన్నది చైనా వ్యూహం. ఆ వ్యూహం ప్రతిసారీ బెడిసికొడ్తోంది. దాంతో, ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువు అయిన సిక్కింపై చైనా స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిందన్నమాట. 

ఒక్కటి మాత్రం నిజం. సరిహద్దుల్లో కవ్వింపులు అనేది పిరికిపందల చర్య. ఆ విషయంలో పాకిస్తాన్‌ మాస్టర్‌ డిగ్రీ పొందేసింది. ఇప్పుడు అదే ఘనత తమకూ దక్కాలని చైనా ఉవ్విళ్ళూరుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే ఏమవుతుందో చైనాకి తెలుసు. భారత్‌కి తీవ్ర నష్టం కలుగుతుందన్నది ఎంత నిజమో, ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా చైనా నష్టపోతుందన్నదీ అంతే నిజం. కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌దీ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం విషయంలో చైనాదీ ఒకటే వాదం.. అదే వితండవాదం.