ట్రయిలర్ కటింగ్ అంటే ఒకప్పుడు మిక్చర్ పొట్లామే. అన్ని జోనర్లు ఇష్టపడేవారి కోసం, నవరసాలు వున్నాయని చెప్పడం కోసం ఒక్కో సీన్ కట్ చేసి అతికించడమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జనాల అభిరుచి మారింది. ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తిని డిఫరెంట్ గా కలిగించడం అన్నది ఇప్పుడు అసలు సిసలు లక్ష్యం. ట్రయిలర్ ను ఎక్కడో ఎత్తుకుని, ఎక్కడి నుంచో ఎక్కడికో రన్ చేసి, చురుక్కు మనేలా ముగించడం అన్నది కొత్త ఫార్ములా అయింది.
కానీ సీనియర్ దర్శకుడు, కాస్త విషయం వున్న దర్శకుడు అయిన కృష్ణ వంశీ లేటెస్ట్ మూవీ నక్షత్రం ట్రయిలర్. పోలీస్ కావాలనుకునే ఓ కుర్రాడి కల, దానికి వచ్చిన అడ్డంకులు, దాని చుట్టూ అల్లుకున్న పోలీసు కథలు అన్నట్లుగా కనిపిస్తోంది. కానీ ట్రయిలర్ మాత్రం బీభత్సంగా వుంది. అవీ, ఇవీ అన్నీ కలిపేసి, అందులో మళ్లీ డబ్బింగ్ సినిమాల బిట్లు మాదిరిగా అమ్మాయిలు అందాల ఆరబోత జోడించి, ఏదేదో చేసారు.
అయితే ట్రయిలర్ చూసేలా వుండడానికి కారణం ఒక్కటే. అందులో కనిపించేవి అన్నీ మనకు తెలిసిన, పరిచయం వున్న మొహాలే కావడం. సాయి ధరమ్ తేజ, సందీప్ కిషన్ ఆకట్టుకోవడం పనికి వచ్చింది. అదే కాకుంటే తమిళ నటుడు విజయ్ కాంత్ సినిమా డబ్బింగ్ ట్రయిలర్ చూసినట్లు వుండేది.