మనవడి కనుసన్నల్లో ‘ఎన్‌టిఆర్‌’ సినిమా

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి దర్శకుడు సంచలనాల రామ్‌గోపాల్‌ వర్మ. హీరోగా నటించేది బాలకృష్ణ. వర్మ వైపు నుంచి ప్రకటన వచ్చేసింది. బాలకృష్ణ వైపు నుంచి ఇంకా…

స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి దర్శకుడు సంచలనాల రామ్‌గోపాల్‌ వర్మ. హీరోగా నటించేది బాలకృష్ణ. వర్మ వైపు నుంచి ప్రకటన వచ్చేసింది. బాలకృష్ణ వైపు నుంచి ఇంకా కన్‌ఫర్మేషన్‌ రావాల్సి వుంది. అయితే, స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత చరిత్రలో నటించబోతున్నానంటూ గతంలోనే బాలకృష్ణ ప్రకటించారు.. పైగా, కథ గురించి చర్చలు జరుగుతున్నాయనీ సెలవిచ్చారు. కానీ, వర్మతో అన్న మాట మాత్రం ఇంకా చెప్పలేదు. 

ఇక, ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ తెరపైకొచ్చింది. అది కూడా స్వర్గీయ ఎన్టీఆర్‌ మనవడు నారా లోకేష్‌ నుంచి. 'సినిమా చాలా బాగా వస్తుంది..' అని సెలవిచ్చారు నారా లోకేష్‌. బాలకృష్ణ హీరోగా 'ఎన్‌టిఆర్‌' సినిమాపై నారా లోకేష్‌ 'క్లారిటీ' ఇచ్చాడంటే, ఆ సినిమా పూర్తిగా నారా లోకేష్‌ కనుసన్నల్లోనే జరుగుతోందని అనుకోవాలి. దానికి ఓ బలమైన కారణం కూడా లేకపోలేదు.

ఎన్‌టిఆర్‌ పేరు చుట్టూ పెద్ద వ్యవహారమే వుంది. సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహనీయుడు.. ఇలా చాలానే వున్నాయి. ఆ 'ఎన్‌టిఆర్‌' జీవిత చరిత్రలో 'వెన్నుపోటు' అత్యంత కీలకమైనది. 'ఎన్‌టిఆర్‌' సినిమా చాలా బాగుంటుందని లోకేష్‌ చెప్పడమంటే, అందులో 'వెన్నుపోటు' అనే ఎపిసోడ్‌ లేనట్టే. ఒకవేల ఆ ఎపిసోడ్‌ వుంటే, నారా లోకేష్‌ 'బాగుంటుంది సినిమా' అని ఒప్పుకోడానికే ఇష్టపడరు. 

చూస్తోంటే, ఇదంతా 2019 ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా చంద్రబాబు సూచన మేరకు, నారా లోకేష్‌ నుసన్నల్లో, ఆయన పర్యవేక్షణలో జరుగుతున్న వ్యవహారంగానే కన్పిస్తోంది.