వాలంటీరు వ్యవస్థ అనేది ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో నిరుపేదలకు నేరుగా అందడానికి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. మధ్య దళారీ వ్యవస్థలు లేకుండా.. ప్రతినెలా ఒకటో తేదీని ముంగిట్లోకి అందడానికి చాలా ఉపయోగపడుతున్నది. అయితే.. ఇదే వాలంటీరు వ్యవస్థ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూల ప్రచారం నిర్వహిస్తున్నదని, వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసి.. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి అధికార పార్టీ కుట్ర చేస్తున్నదని విపక్షాలు పదేపదే ఆరోపిస్తుంటాయి.
పవన్ కల్యాణ్ లాగా తలాతోకా లేకుండా మాట్లాడేవాళ్లయితే.. వాలంటీర్లను ఏకంగా అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులుగా కూడా ప్రచారం చేసేస్తున్నారు. అయితే.. జాగ్రత్తగా గమనిస్తే.. వాలంటీరు వ్యవస్థను పూర్తిగా అంతమొందించడానికి విపక్ష పార్టీలు, పచ్చమీడియా ఒక వ్యూహాత్మక ప్రయత్నం చేస్తున్న్టట్టుగా కనిపిస్తోంది.
విశాఖపట్టణంలో ఓ వృద్ధురాలి హత్య జరిగింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి.. షాపు యజమాని ఇంటికి వెళ్లి, యజమాని తల్లిని హత్యచేసి ఆమె మెడలోని బంగారు ఆభరణాలతో పారిపోయాడు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా అతడు వచ్చి వెళ్లిన విషయం తెలియడంతో పోలీసులు విచారించినప్పుడు.. తాను హత్య చేసిన సంగతి కూడా ఒప్పుకున్నాడు. ఇదీ అసలు సంఘటన.
అయితే.. ఈ ఘటనను ఆధారం చేసుకుని వాలంటీర్లు అందరూ హంతకులు అన్నట్టుగా చిత్రీకరించడానికి, పచ్చమీడియా నానా పాట్లు పడుతున్నట్టుంది. వాలంటీర్లు అంటేనే రకరకాల అక్రమాలకు పాల్పడుతున్నారని.. వారి మీద ఉన్న అనేక నేరారోరపణలను ప్రస్తావిస్తూ ఇప్పుడు హత్యలు కూడా చేస్తున్నారంటూ వాలంటీరు వ్యవస్థను తప్పుపడుతున్నారు.
నిజానికి వెంకటేష్ అనే వ్యక్తిని విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనే ఫిర్యాదుతో జులై 24న వాలంటీరుగా తొలగించినట్టు జీవీఎంసీ కమిషనర్ ప్రకటించారు. హత్య సంగతి బయటకు వచ్చిన తర్వాతనే.. తొలగించినట్టుగా సమర్థించుకుంటున్నారనేది పచ్చమీడియా ఆరోపణ. అదే నిజమని అనుకున్నప్పటికీ.. వెంకటేష్ చేసిన నేరాన్ని యావత్ వాలంటీరు వ్యవస్థకు ఆపాదించడం అనేది ఎంతవరకు సబబో అర్థం కావడం లేదు.
ఉదాహరణకు పోలీసు వ్యవస్థ అంటేనే సమాజాన్ని రక్షించడానికి ఉన్న వ్యవస్థ అని మనం నమ్ముతాం. అలాంటిది పోలీసుల్లో కూడా నేరాలకు పాల్పడేవారుంటారు. చాలా సందర్భాల్లో పోలీసుల పాత్ర ఉన్న నేరాలు బయటపడుతుంటాయి. అంతమాత్రాన పోలీసు వ్యవస్థను మొత్తం రద్దు చేసేయాలని అంటే ఎలా ఉంటుంది.
తప్పు చేసిన వ్యక్తి ఒక వాలంటీరు అయినంత మాత్రాన.. మొత్తం ఆ వ్యవస్థను నిందించడానికి జరుగుతున్న ప్రయత్నం చాలా నీచంగా కనిపిస్తోంది. పచ్చ మీడియా కళ్లకు గంతలు కట్టుకుని మరీ.. వాలంటీరు వ్యవస్థ అంతానికి కుట్ర చేస్తున్నదని పలువురు భావిస్తున్నారు.