‘వకీల్ సాబ్’ స్త్రీజనోద్ధరణ సినిమాలకి స్పీచులకేనా?

ప్రియా పొంగూరు..ఈమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మోగుతోంది. కారణం ఈమె నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకి తమ్ముడి భార్య. ఈమె నారాయణ మీద అనేకరకమైన అభియోగాలు చేస్తున్నారు. అతనిలోని కామాంధుడిని లోకానికి పరిచయం…

ప్రియా పొంగూరు..ఈమె పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మోగుతోంది. కారణం ఈమె నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకి తమ్ముడి భార్య. ఈమె నారాయణ మీద అనేకరకమైన అభియోగాలు చేస్తున్నారు. అతనిలోని కామాంధుడిని లోకానికి పరిచయం చేసే పని చేస్తున్నారు. ఇదంతా సినిమాల్లో చూపించినట్టు అధికారవర్గం పన్నుతున్న కుట్రగా కొట్టి పారేస్తున్న వారున్నారు. తెదేపా వర్గీయులైతే ఆమెకు మానసిక ఆరోగ్యం సరిగా లేని కారణంగా అలా మాట్లాడుతోందటున్నారు. 

కానీ ఆమె వీడియోలను నిశితంగా పరిశీలిస్తే ఆమె మానసికంగా ఆరోగ్యంగా ఉండే మాట్లాడుతోందని చూస్తున్నవాళ్ళ మనస్సాక్షికే తెలుస్తుంది. కచ్చితమైన చేదు అనుభవం అయితే తప్ప ఒక స్త్రీ అదే పనిగా మీడియాకెక్కి ఒక మాగాడిపై వేలెత్తదు. ఆమె చెప్పుకుంటున్న బాధ స్వానుభవం కాబట్టి కొందరు నమ్మొచ్చు కొందరు నమ్మకపోవచ్చు. కానీ ఆమె అడుగుతున్న కొన్ని ప్రశ్నలు మాత్రం అందరూ ఆలోచించాల్సినవే. 

వాటిల్లో రెండు ప్రశ్నలు- ఈ విషయంపై చంద్రబాబు గానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు మాట్లాడడం లేదని?

పవన్ విషయంలో ఆమె నేరుగా చెబుతున్నది ఒక్కటే. తాను పవన్ అభిమానిని అని, గత ఎన్నికల్లో పవన్ కి ఓటు వేయమని తమ కులానికి (కాపు) చెందిన వాళ్లందర్నీ కోరానని, ఆయన వ్యక్తిగతంగా కూడా తెలుసని…అయినా ఆయన తనకు అండగా నిలబడట్లేదని వాపోతోంది. అంతే కాదు..స్త్రీలకు తాను అండగా ఉంటానని బీరాలు పలుకుతూ తన అభిమాని అయిన ఆమె గోడునే వినని వాడు ఇక రాష్ట్రానికేం చేస్తాడు..ఎవడి గోడు మాత్రం వింటాడు అని బహిరంగంగానే అనేసింది. ఇది కచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే. పవన్ కళ్యాన్ స్త్రీజనోద్ధరణ, సంరక్షణ కేవలం వకీల్ సాబ్ సినిమా వరకే పరిమితం తప్ప వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయ జీవితంలోనూ ఉండవని కాలం చరిత్ర రాసేసేలా ఉంది. పైగా నిన్నటి వరకు విలేజ్ వలంటీర్లు రాష్ట్రంలోని అమ్మాయిల్ని అన్యాయం చేసేస్తున్నారని ఎలుగెత్తి అరిచిన పవన్ కళ్యాన్ తన అభిమాని అయిన ప్రియా విషయంలో ఎందుకు మొహన్ చాటేశాడు? అడ్డంగా దొరికిపోవడమంటే ఇదే. 

ఇక చంద్రబాబు ఈ విషయంపై స్పందించి తీరాలి. ఎందుకంటే ఆమె అభియోగం వేస్తున్నది రేపు తాను టికెట్ ఇవ్వబోయే నారాయణ మీద. సచ్చీలుడు, విద్యాదాత అయిన తన మనిషి మీద అభాండాలు ఎందుకు వేస్తున్నావని పబ్లిక్ గా ఎదురుప్రశ్న వేయడమో..లేదా ఒక స్త్రీకి సంఘీభావం తెలుపుతూ నారాయణపై పార్టీ పరంగా చర్య తీసుకోవడమో చెయ్యాలి కదా! ఆ మధ్యన గాయకుడు గజల్ శ్రీనివాస్ పై ఒక మహిళ ఇలాంటి అభియోగమే చేస్తే, నిజానిజాల సంగతి తర్వాత..ఇలాంటి విషయం పై నింద ఉన్నవాడు కూడా తమ సంస్థలో ఉండడానికి వీల్లేదని హిందూ దేవాలయాల సంస్థ అతనిని వెంటనే డిస్మిస్ చేసింది. అప్పుడే కదా సంస్థ మీద ప్రజలకి గౌరవం పెరిగేది! అటువంటి పని చంద్రబాబు ఎందుకు చేయడు నారాయణ విషయంలో? అవసరార్ధం అంత ధైర్యం చేయలేని స్థితిలో ఉన్నారా? 

కొందరైతే కేవలం డబ్బు కోసమే ప్రియ ఈ పని చేస్తోందని..మీడియాకెక్కితే పనౌతుందని చూస్తోందని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఆమెకున్న ఉద్దేశ్యాలేమిటో, భయాలేమిటో చూద్దాం. 

నారాయణ విద్యాసంస్థల్లో నారాయణ సోదరుడికి 25% వాటా ఉంది. అయితే అతను ప్రస్తుతం మరొక స్త్రీతో సహజీవనం చేస్తున్నాడు. అతని భార్య ప్రియకు క్యాన్సర్ వచ్చి ప్రస్తుతానికి కోలుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతానికి తాను చట్టపరంగా నారాయణ తమ్ముడికి భార్యే. కానీ ఆమెకు ఏదైనా జరిగితే అతను ప్రస్తుతం సహజీవనం చేస్తున్న స్త్రీని వివాహమాడే అవకాశం లేకపోలేదు. అప్పుడు తన పిల్లలు అనాధలవుతారని, వాళ్ళకి 25% చిల్లిగవ్వ కూడా రాకపోవచ్చని ప్రియ భయం. 

నిజానికీ అమె భయంలో న్యాయం ఉంది కదా! ఆమె స్థానంలో ఏ స్త్రీ ఉన్నా ఇలాగే ఆలోచిస్తుంది కదా! అంతే కాదు..నారాయణకి కూడా భార్య ఉండగా మరో స్త్రీతో సంబంధముంది. ఆమె బతికుంది కాబట్టి తన పిల్లలకి అన్యాయం జరగకుండా చట్టపరంగా చూసుకోగలిగింది. అలా కాపాడుకోగలిగే పరిస్థితి ఆరోగ్యరీత్యా తనకు ఉంటుందో ఉండదో అని ప్రియ భయం. ఎందుకంటే అలాంటి పరస్త్రీ సమబంధమే తన భర్త కూడా పెట్టుకున్నాడు. అదే ఆమె భయం, బాధ. అసలిక్కడ భార్య ఉండగా మరొక స్త్రీతో సంబంధం నడుపుతున్న అతనిని, తమ్ముడి భార్యతో అనుచితంగా ప్రవర్తించాడని చెప్పబడుతున్న నారాయణని ఇద్దర్నీ నిందితులుగానే చూడాలి. 

కనీసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా ఆమెకు అండగా నిలిచి నారాయణ పై కేసు నమోదు చేయించి ముందుకు తీసుకువెళ్లాలి. అసలు నిజాలు కోర్టు తేల్చాలి. ప్రియ అయితే ఏకంగా తాను నార్కో టెస్ట్ కి రెడీ అని, తాను చెప్పింది అబద్ధమని నార్కో టెస్ట్ చెబితే ఆత్మహత్య చేసుకుంటానని, నారాయణ దానికి సిద్ధమా అని ధైర్యంగా అడుగుతోంది. ఆమె స్వరం వింటుంటే అది బాధ నుంచి వచ్చిన ధైర్యంలా ఉంది తప్ప ఎవరో నూరిపోస్తేనో, కుటిలత్వంతోనో వినిపిస్తున్న ధైర్యంలా లేదు. 

రాష్ట్రంలో ఒక స్త్రీకి తనకు న్యాయం చేయమని కోరుతున్నప్పుడు ఎటువైపు నుంచి ఆమెకు భరోసా దొరకపోతే ఇక ఆ సమాజం ఉన్నా లేనట్టే. 

శ్రీనివాసమూర్తి