ఆమె చేస్తుంది సరే.. టాలీవుడ్ భరించగలదా?

తెలుగులో అయితే ప్రభాస్ సరసన, తమిళంలో అయితే విక్రమ్.. అంటూ దక్షిణాదిన తన ఛాయిస్ లను చెప్పింది కత్రినాకైఫ్. బాలీవుడ్ ఇప్పుడు టాప్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ తన తాజా…

తెలుగులో అయితే ప్రభాస్ సరసన, తమిళంలో అయితే విక్రమ్.. అంటూ దక్షిణాదిన తన ఛాయిస్ లను చెప్పింది కత్రినాకైఫ్. బాలీవుడ్ ఇప్పుడు టాప్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ తన తాజా సినిమా ప్రమోషన్ కోసం సైమా అవార్డుల ఫంక్షన్ కు హాజరు కాగా.. అక్కడ ఈ వ్యాఖ్యలు చేసింది. మరి ఒకప్పుడు కత్రినాను ఆదుకుంది దక్షిణాది చిత్ర పరిశ్రమే.

అప్పట్లో ఈమెకు నటనలో, హిందీలో ఓనమాలు వచ్చేవి కావు. దీంతో బాలీవుడ్ పట్టించుకోలేదు. సల్మాన్ ఎంకరేజ్ మెంట్ దక్కేంత వరకూ కూడా కత్రినా అనామకురాలే. ఆ సమయంలో మలయాళంలో మమ్ముట్టీ సరసన ఒక సినిమా, తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి సినిమాలను చేసింది. అయితే అప్పట్లోనే ఈమెకు దక్షిణాది చిత్రపరిశ్రమ భారీ పారితోషకం ఇచ్చింది.

ఆ తర్వాత హిందీలో ‘వెల్ కమ్’ సినిమాతో తొలి హిట్టు రుచి చూసింది కత్రినా, ఆ వెంటనే ‘పార్ట్‌నర్’ వంటి సినిమా రావడంతో అక్కడ ఈమె దశ తిరిగిపోయింది. మళ్లీ వెనక్కు చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈ క్రమంలో దాదాపు పదేళ్ల తర్వాత కత్రినా సౌత్ సినిమాల గురించి స్పందించినట్టుంది.

ఆ హీరోల సరసన చేస్తానని అంటోంది. అనడం వరకూ బాగానే ఉందికానీ.. కత్రినా ప్రస్తుత పారితోషకానికి మనోళ్లు తట్టుకోగలరా అని? చిరంజీవి భారీ బడ్జెట్ తో చేస్తున్న సినిమాకు ఐశ్వర్య తొమ్మిది కోట్లు అడిగిందనే మాటతోనే మనోళ్లు జావగారిపోతున్నారు. ఇక ప్రభాస్ సినిమాలో నటించడానికి పరిణీతి చోప్రా, దిశాపటానీలను సంప్రదించి పారితోషకం వద్ద వెనక్కు వచ్చారు.

మరి వారినే భరించలేని మనోళ్లు పది కోట్లకు పైన అడిగే కత్రినాను భరించగలరా? హీరోకి ఎంతైనా ఇస్తాం, హీరోయిన్ కి మాత్రం ఇవ్వమన్నట్టుగా వ్యవహరించే దక్షిణాదిలో, ప్రత్యేకించి తెలుగులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నటించడం కుదిరే అంశం కాకపోవచ్చు.