సినిమా హీరోలు ఓ సినిమా ఫెయిలైతే తరువాతి సినిమాను విజయవంతం చేయాలని కంకణం కట్టుకొని కసిగా నటిస్తారు. ఇందుకోసం మంచి కథను, మంచి దర్శకుడిని ఎన్నుకొని బాగా కసరత్తు చేస్తారు. విజయం సాధిస్తారు. ఆ ఉత్సాహంతో మరిన్ని సినిమాల్లో నటిస్తారు. అంటే సినిమా రంగంలో అపజయం ఎదురైతే కుంగిపోకుండా విజయం కోసం తాపత్రయపడతారు.
కాని ఇదే హీరోలు రాజకీయ రంగంలో ప్రవేశించినప్పుడు గొప్పగా వెలిగిపోవాలనుకుంటారు. కాని అంచనాలు తప్పిపోయి అపజయం ఎదురైతే నిరాశపడి కుంగిపోతారు. రాజకీయాలు అనవస రమని, సినిమాలే బెస్టని బ్యాక్ టు పెవిలియన్ అంటారు. మెగా స్టార్ చిరంజీవి ఇదే కేటగిరీలో చేరారు. ఆయన రాజకీయ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.
బ్లాక్‌బస్టర్ అవుతుందనుకున్న రాజకీయ జీవితం బిగ్ డిజాస్టర్‌గా మిగిలిపోవడంతో నిరాశకమ్ముకుంది. ఈ నిరాశ ఎందుకు? ముఖ్యమంత్రి పదవి ఆశించాడు. ఆ కల నెరవేరలేదు. కాని ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశాక రాజ్యసభ సభ్యుడై, కేంద్ర మంత్రి కావడం ఒకింత ఊరట. అయినప్పటికీ అనుకున్నది నెరవేరలేదు కదా…!
దీంతో కాంగ్రెసులో క్రియాశీలకంగా వ్యవహరించని చిరంజీవి సుదీర్ఘకాలం తరువాత 'ఖైదీ నెంబర్ 150' విజయవంతం కావడంతో సినిమా జైల్లోనే ఖైదీగా ఉండిపోతే హాయిగా ఉంటుందని అనుకున్నాడు. అందుకే పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఓ పక్క కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికల కోసం కసరత్తు చేస్తుండగా, మరో పక్క చిరంజీవి సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. కాంగ్రెసు రాజకీయాలను, వ్యవహారాలను పట్టించుకోవడంలేదు.
జూన్ మొదటివారంలో ఆంధ్రాలో జరిగిన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభకు కూడా హాజరుకాలేదు. ఆంధ్రాలో గత ఎన్నికల్లో పూర్తిగా కుదేలైన కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. తన బలం పెరిగిందని, ప్రజాగ్రహం తగ్గిందని భావిస్తోంది. ఏపీలో కాంగ్రెసు పార్టీ పుంజుకుంటోందట…! గత మూడేళ్లలో దాని ఓటింగ్ పది శాతం పెరిగిందట…! ఈ విషయం కాంగ్రెసు నాయకులు చెబితే విశేషమే ముంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సమావేశంలో 'పచ్చ' తమ్ముళ్లకు చెప్పారు.
చంద్రబాబు ప్రతిపక్షాల పరిస్థితిపై చేయించిన సర్వేలో కాంగ్రెసు బలం పెరుగుతోందన్న విషయం తెలిసింది. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెసు పార్టీ పార్లమెంటులోనూ, బయటా పోరాటం చేయడం ఇందుకు కారణమని తెలుస్తోంది. కొంత కాలం క్రితం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ నిర్వహించిన తరువాత కాంగ్రెసుపై ప్రజల్లో సానుకూల వైఖరి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు సారథ్యం వహించేందుకు ప్రజాదరణ, సమ్మోహనశక్తి ఉన్న నాయకుడు కావాలని కాంగ్రెసు హైకమాండ్ అన్వేషిస్తోంది. ముఖ్యంగా కీలక ఓటు బ్యాంకుగా ఉన్న కాపులను ఆకట్టుకోవాలంటే ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుడు అవసరం.
ఏపీలో ఇందుకు తగిన వ్యక్తి చిరంజీవి అని భావించిన నాయకత్వం ఆయనకు సారథ్య బాధ్యతలు అప్పగించే విషయం చూడాలని పార్టీలో కీలక నాయకుడు, మాజీ బ్యూరోక్రాట్ అయిన కొప్పుల రాజును ఆదేశించింది. ఆయన సారథ్య బాధ్య తల గురించి చిరుతో మాట్లాడినప్పుడు మరో ఆలోచన లేకుండా తిరస్కరించాడని సమాచారం.
ప్రస్తుత రాజ్యసభ పదవీ కాలం ముగిసిన తరువాత రెండోసారి కూడా ఎంపీని చేస్తామని, కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ఏదో ఒక దాన్నుంచి రాజ్యసభకు పంపుతామని నాయకత్వం మాటగా రాజు చెప్పారు. అయినప్పటికీ చిరు అంగీకరించలేదు. తాను పెద్ద బాధ్యత తీసుకోలేనని చెబుతూ పార్టీ వదలి వెళ్లనని హామీ ఇచ్చారు.
చిరంజీవి ఇప్పుడు సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టారు కాబట్టి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలనుకు న్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సారథ్య బాధ్యత స్వీకరణకు చిరుకు క్రియాశీలకంగా వ్యవహరించడంపై ఆసక్తి లేకపోవడం ఓ కారణమైతే, ఏపీలో కాంగ్రెసు పరిస్థితి ఇప్పటికీ ఆశాజనకంగా లేదనే అభిప్రాయం ఉందట…!
సారథ్య బాధ్యత తీసుకుంటే అపజయం మూటగట్టుకోవల్సి వస్తుందని, అదో మాయని మచ్చగా మిగిలిపోతుందని భావిస్తున్నాడు. చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెర మీదికి ఫోకస్ చేసే అవకాశాలున్నట్లు కొంతకాలం క్రితం ఓ ఆంగ్ల పత్రిక రాసింది.
కుల రాజకీయాలకు నిలయమైన ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని కాంగ్రెసు ప్లాన్ వేసింది. కాపుల ఓట్లు కొల్లగొట్టేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా చిరంజీవిని పీసీసీ అధ్యక్షుడిని చేయాలని ఓ దశలో నాయకత్వం ఆలోచించింది. మొత్తం మీద చిరంజీవి హైకమాండ్ ఆశలకు గండికొట్టారు. ఎన్నికల్లో ప్రచారం వరకు పరిమితమ వుతాడేమో….!
-నాగ్ మేడేపల్లి