భావన కేసులో మలుపు.. ఆ హీరో ఇరుక్కున్నాడా?

మలయాళీ నటి భావనపై జరిగిన దాడి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నాళ్ల కిందట భావనను ఆమె డ్రైవర్లు కిడ్నాప్ చేసుకుని వెళ్లడం, ఆమెను వేదించడం, ఫొటోలు వీడియోలు తీసిన బ్లాక్ మెయిల్ చేయడం,…

మలయాళీ నటి భావనపై జరిగిన దాడి అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నాళ్ల కిందట భావనను ఆమె డ్రైవర్లు కిడ్నాప్ చేసుకుని వెళ్లడం, ఆమెను వేదించడం, ఫొటోలు వీడియోలు తీసిన బ్లాక్ మెయిల్ చేయడం, చివరకు ఆమె కేసు పెట్టి అంతకులను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే ఆ వ్యవహారం క్రమంగా మరుగున పడింది.

అయితే ఉన్నట్టుండి ఆ కేసులో నిందితులు రాసినదిగా చెప్పబడుతున్న ఒక ఉత్తరం సంచలనంగా మారింది. మరి ఆ ఉత్తరం ఎవరు రాశారు, ఎలా బయటకు వచ్చింది, ఎవరికి చేరింది.. అనేదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. భావనను వేదించిన వారిలో ఒకడైన పల్సర్ సునీ అనే నిందితుడు మలయాళీ స్టార్ హీరో దిలీప్ కు ఆ ఉత్తరం రాశాడు.

దాని సారాంశం ఏమనగా.. భావనపై దాడి విషయంలో మేము మీ పేరు బయట పెట్టలేదు, పోలీసులు ఎంతగా అడిగినా మీ పేరు చెప్పలేదు.. మాకు కొంచెం డబ్బు అవసరం ఉంది సర్ధండి అంటూ జైలులోని ఆ వ్యక్తి దిలీప్ కు ఉత్తరం రాశాడు.

జైల్లో తనకు పరిచయం అయిన వ్యక్తి ఇటీవలే విడుదల కాగా, అతడితో సునీ ఆ లెటర్ ను పంపించి, దిలీప్ కు అందించినట్టుగా తెలుస్తోంది.

మరి ఆ లెటర్ దిలీప్ కు చేరిందనే విషయం ఎలా బయటకు వచ్చిందంటే, ఆ పని ఆ హీరోనే చేశాడు. జైల్లోని సునీ తనకు ఆ లెటర్ రాశాడని, అయితే భావనపై దాడికీ తనకూ ఎలాంటి సంబంధం లేదని.. కేవలం తనను ఇబ్బంది పెట్టడానికే ఈ లెటర్ తనకు పంపించారని.. దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరి ఈ హీరో ఫిర్యాదు చేయడం వరకూ బాగానే ఉంది కానీ, భావనపై దాడి వెనుక ఈ హీరో కుట్ర ఉందనే ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుత పరిణామాలతో చాలా మంది దిలీప్ ను అనుమానిస్తున్నారు. భావనపై దాడి వెనుక దిలీప్ హస్తం ఉండనే ఉంటుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇంతలోనే నాదీర్షా అనే డైరెక్టర్ ఇదంతా కుట్ర అని అంటున్నాడు. భావనపై దాడిలో దిలీప్ కు సంబంధం లేదని, కావాలనే అతడిని ఇరికిస్తున్నారని ఇతడు అంటున్నాడు.

ఇటీవలే తనకు ఒక కాల్ వచ్చిందని, కోటిన్నర రూపాయలు ఇవ్వకపోతే దిలీప్ పేరు, తన పేరు భావనపై దాడి కేసులో ఇరికిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని నాదీర్షా అంటున్నాడు.

పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు తమను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని, తనను దిలీప్ ను భావనపై దాడి కేసులో ఇరికించడానికి యత్నిస్తున్నారని అంటూ ఇతడు మీడియాకు ఎక్కాడు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కేసు పెట్టాడు.

మరి ఈ కేసులు ఎక్కడి వరకూ వెళ్తాయో ఏయే విషయాలను వెలుగులోకి తీసుకొస్తాయో చూడాల్సి ఉంది. మొత్తానికి భావనపై జరిగిన అటాక్ మలయాళీ చిత్ర పరిశ్రమను ఇప్పుడప్పుడే వదిలేలా లేదు.