టీడీపీ అనుకూల మీడియా, టీడీపీ అనుబంధ సోషల్ మీడియా రెండేళ్లుగా విపరీతంగా కష్టపడిపోతోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక వీటికి పని మరింత పెరిగింది. ఇప్పటికీ ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే అన్న రీతిలో వీటిలో వార్తలు వండి వారుస్తుంటారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టి వస్తుందంటారు. అలా పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో లీకులు వదిలి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలా అనుకుంటున్నారు, అలా భావిస్తున్నారంటూ పూర్తిగా ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చూశారు. ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు రుజువైంది. వైసీపీ సొంత మీడియా ఉన్నా కూడా టీడీపీ దుష్ప్రచారాలను అడ్డుకోవడం దాని వల్ల కావడం లేదు. అందులోనూ దానిపై కూడా పార్టీ ముద్ర ఉంది కాబట్టి.. పూర్తిస్థాయిలో ప్రజలు విశ్వసించలేని పరిస్థితి.
ఈ దశలో ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ వ్యవస్థని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు సీఎం జగన్. గతంలో దీన్ని ట్రయల్ వెర్షన్ గా రన్ చేస్తూ.. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్, ట్విట్టర్ అకౌంట్ ను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
మీడియాలో, సోషల్ మీడియాలో ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారాయన. కొంతమంది పనిగట్టుకు చేస్తున్న దుష్ప్రచారాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందుంచుతారు.
అక్కడితో ఆగరు.. అంతకు మించి..
ఏపీ ఫ్యాక్ట్ చెక్ వేదికలో ఒకసారి ఒక వీడియో తప్పు అని చూపించారంటే.. దాన్ని షేర్ చేసిన వారికి తాటతీశారన్నమాటే. తప్పుడు వార్తల్ని వైరల్ చేయడం, వాటి ద్వారా రాష్ట్రంలో లేనిపోని గొడవలు రేకెత్తించడం, సామాజిక, మతపరమైన కలహాలు సృష్టిండచం వంటి పనులు చేస్తే ఇక జైలుకెళ్లడం ఖాయమన్నమాటే.
దురుద్దేశపూర్వక ప్రచారంపై అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటారు. అసలా ప్రచారం ఎక్కడ్నుంచి వచ్చింది, దాని మూలం ఏంటి అనేది కూడా కనిబెట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈ విషయమై అధికారులకు స్పష్టమైన మార్గనిర్దేశకాలనిచ్చారు సీఎం జగన్.
ఒక వ్యక్తి ప్రతిష్టను, వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని, వ్యవస్థలను తప్పుదోవ పట్టించే పనులు ఎవరూ చేయకూడదని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలపై దుష్ప్రచారం చేయడం తగదని, ఇలాంటి వారికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలన్నారు జగన్.
మొత్తమ్మీద ప్రభుత్వంపై జరిగే దుష్ప్రచారాన్ని గట్టిగా అడ్డుకునేందుకు ఇన్నాళ్లకు సీఎం జగన్ ఓ గట్టి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఓ పూర్తిస్థాయి వ్యవస్థను తెరపైకి తెచ్చారు. ఇది ఏ మేరకు ఫలితాలు అందిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుంది.