అభిమానులకు ఎంత దగ్గరగా ఉంటే అంత క్రేజ్ వస్తుంది. అందుకే హీరోలంతా లోకల్ ఫ్లేవర్ సినిమాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ దర్శకుడు శంకర్ మాత్రం రజనీకాంత్ ను లోకల్ ఫ్యాన్స్ కు దూరం చేశాడు. 2.0 సినిమాకు సంబంధించి అసలు చెన్నైను పట్టించుకోవడం మానేశాడు శంకర్.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ముంబయిలో లాంచ్ చేశారు. అప్పట్లో తమిళనాడు నుంచి ముంబయి వెళ్లిన తళైవ ఫ్యాన్స్ చాలా తక్కువ. పోనీలే కనీసం చెన్నైలో జరగబోయే ఆడియో ఫంక్షన్ కు అయినా వెళ్లొచ్చని ఫ్యాన్స్ సర్దిచెప్పుకున్నారు మొన్నటివరకు.
ఇప్పుడు ఆ ఆనందం కూడా లేకుండా చేస్తున్నాడు శంకర్. అవును.. 2.0 ఆడియో రిలీజ్ ను ఏకంగా దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నారట. తాజా సమాచారం ప్రకారం, రోబోకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.0 సినిమా ఆడియో ఫంక్షన్ ను దుబాయ్ లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఇలా చేయడం వల్ల అరబ్ దేశాలకు సినిమా మరింతగా రీచ్ అవుతుందని, మార్కెట్ వాల్యూ పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, మార్కెట్ వాల్యూ పేరుచెప్పి స్థానికంగా ఉండే ఫ్యాన్స్ ను విస్మరిస్తే ఎలా..? రజనీకాంత్ సినిమా ఎన్ని దేశాల్లో ఆడినా అత్యథికంగా వసూళ్లు వచ్చేది మాత్రం తమిళనాడు నుంచే కదా. ఇంత చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా..?
టాలీవుడ్ తరహాలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు ఏర్పాటుచేసే కల్చర్ కోలీవుడ్ లో లేదు. వాళ్లకు ఆడియో రిలీజే అతిపెద్ద పండగ. సో.. 2.0కు సంబంధించి భారీ ఈవెంట్ ను తళైవ ఫ్యాన్స్ మిస్ అవుతున్నట్టే లెక్క.
ఈ సినిమాను ఇండియాతో పాటు అమెరికా, జపాన్, జర్మనీ, బ్రెజిల్ లాంటి దేశాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో 2.0 రిలీజ్ అవుతుంది.