అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సరైనోడు సినిమా. ఈ మూవీ కలెక్షన్లపై అప్పట్లో పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాకు తన మాస్టర్ బ్రెయిన్ ను జోడించి సక్సెస్ వైపు నడిపించాడు అల్లు అరవింద్. మూవీని సేఫ్ జోన్ లోకి లాక్కొచ్చాడు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఆ మూవీ సాధించిన వసూళ్లపై మాత్రం ఇప్పటికీ చాలామందికి చాలా అనుమానాలున్నాయి. ఇంకా చెప్పాలంటే.. సరైనోడు వసూళ్లపై వచ్చినన్ని వివాదాలు, వాగ్వాదాలు మరే సినిమాపై రాలేదు. మొత్తమ్మీద బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ 'సరైనోడు' అనిపించారు.
మళ్లీ ఇన్ని రోజులకు దువ్వాడ జగన్నాథమ్ వస్తోంది. మరి ఈ సినిమా పరిస్థితేంటి? ఇది అల్లు అరవింద్ సినిమా కాదు. దిల్ రాజు నిర్మించిన సినిమా. కాకపోతే సినిమాపై మొదట్నుంచి అల్లు అరవింద్ ఓ కన్నేసి ఉంచారు. ఇప్పుడు రిలీజ్ కు కూడా రాజు, అరవింద్ కలిసి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
బన్నీ కెరీర్ లోనే అత్యథిక థియేటర్లలో డీజే మూవీని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో ఓవర్సీస్ వసూళ్లు బాగా ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి, బజ్ తో సంబంధం లేకుండా అక్కడ కూడా వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ పై సినిమాను వదలాలని ఫిక్స్ అయ్యారు.
ఇలా బన్నీ కోసం తెరవెనక చాలా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. సో.. ఓపెనింగ్స్ వరకు ఢోకా లేదు. కాకపోతే లాంగ్ రన్, రికార్డు వసూళ్లపైనే అందరికీ డౌట్. ఎందుకంటే, ఎందుకో మొదట్నుంచి ఈ సినిమాకు సరైన బజ్ క్రియేట్ అవడం లేదు. ఎంత హైప్ తీసుకురావాలని భావిస్తున్నప్పటికీ రోజురోజుకు క్రేజ్ జారిపోతోంది.
ఇలాంటి టైమ్ లో దువ్వాడ జగన్నాథమ్ కు తొలిరోజు మిక్స్ డ్ టాక్ వచ్చిందంటే మాత్రం అంతే సంగతి. యూనిట్ కు కూడా అదే భయం ఉంది. అందుకే సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. సినిమాలో ఆశ్చర్యకరమైన ఎలిమెంట్స్ ఉన్నాయంటూ ఊరిస్తోంది.
ఇన్ని చేసిన తర్వాత కూడా మూవీ తేడాకొడితే మరోసారి వసూళ్లను ఫేబ్రికేట్ చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే మిగతా సినిమాల రికార్డుల సంగతి అటుంచితే, కనీసం తన కెరీర్ లో “మెగా” హిట్ గా చెప్పబడుతున్న సరైనోడు వసూళ్లనైనా డీజే క్రాస్ చేసి తీరాలి. తీరుతుంది కూడా. ఇంత వరకైతే గ్యారెంటీ.