'రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన..' అన్న మాట ఇకపై వినడం కష్టమే. ఎందుకంటే, ఆ పదవిని అంతలా భ్రష్టు పట్టించేస్తున్నాయి ప్రస్తుత రాజకీయాలు. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి పదవికీ, రాష్ట్రాల స్థాయిలో గవర్నర్ పదవికీ వున్న 'అధికారం' ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
సింపుల్గా చెప్పాలంటే, 'రబ్బర్ స్టాంప్, పేపర్ వెయిట్..' అనేస్తుంటారు కొందరు రాజకీయ పరిశీలకులు. గవర్నర్ పదవికి సంబంధించి 'నియామకం' జరుగుతుంటుంది. రాష్ట్రపతి విషయంలో అలా కాదు.
రాష్ట్రపతి ఎన్నికలు ప్రతిసారీ ఓ ప్రసహనంగానే జరుగుతుంటాయి. ఇప్పుడూ అంతే. 'ఏకాభిప్రాయం' కోసం నరేంద్రమోడీ సర్కార్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అదే సమయంలో, విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి పెట్టాలనే ప్రయత్నాలు షురూ చేసిన విషయం విదితమే.
చట్ట సభలు జరుగుతున్న తీరుపై ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చాలా సందర్భాల్లో చాలా ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభలు పాలక ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధానికి వేదికలు కాకూడదు.. అని ఆయన ఘాటైన సూచనలే చేశారు. కానీ, ఏం లాభం.? ఎవరు రాష్ట్రపతి ఆవేదనని అర్థం చేసుకున్నారు.? ఎవరు రాష్ట్రపతి సూచనల్ని పరిగణనలోకి తీసుకున్నారు.?
గడచిన మూడేళ్ళలో పార్లమెంటు సమావేశాలు ఎంత గొప్పగా జరిగాయో చూశాం. త్వరలో మళ్ళీ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి.. అప్పుడూ పార్లమెంటు సమావేశాల నిర్వాకాన్ని చూడబోతున్నాం. చట్ట సభల్లో 'రచ్చ' ఈనాటిది కాదు.
అయినాసరే, రాష్ట్రపతి పదవిలో వున్న వ్యక్తి, చట్ట సభల నిర్వహణపై ఆవేదన వ్యక్తం చేసిన దరిమిలా, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల కోసం నీతులు చెబుతున్న రాజకీయ పార్టీలు పునరాలోచించుకోవాలి.
ఇదొక్కటే కాదు, రాష్ట్రపతి పదవిలో వున్న వ్యక్తి వ్యవస్థలోని లోటుపాట్లను ప్రస్తావిస్తూ, ప్రభుత్వాలకు పలు సూచనలు చేస్తుంటారు. విద్య, వైద్య రంగాలు.. ఇతరత్రా అనేక రంగాల్లోని సమస్యల గురించి మాట్లాడుతుంటారు.
న్యాయవ్యవస్థ గురించీ సూచనలు ఇవ్వడం మామూలే. కానీ, ప్రభుత్వాలకి అవేమీ పట్టవు. అలాంటప్పుడు, రాష్ట్రపతి అనే పదవి ఎందుకు.? అన్న చర్చ జరగడాన్ని ఎలా తప్పు పట్టగలం.?
పరువు పోకూడదు గనుక, ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నామని రాష్ట్రపతి ఎన్నికల కోసం నరేంద్రమోడీ సర్కార్ నీతులు షురూ చేసింది. అదే సమయంలో అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలి గనుక విపక్షాలు ఉమ్మడి అభ్యర్థి జపం చేస్తున్నాయి.
'రాష్ట్రపతి' అన్న పదవికి ఏ రాజకీయ పార్టీ ఇవ్వాల్సిన స్థాయిలో గౌరవం ఇవ్వడంలేదనే వాదనలో నిజం లేకపోలేదు. అదే సమయంలో, రాష్ట్రపతి పదవిలో వున్న వ్యక్తి సైతం, ఆ పదవికి ఎంతవరకు న్యాయం చేస్తున్నారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
ఈ రాజకీయం ఇంతే.! రాష్ట్రపతి పదవికి ప్రజల్లో వున్న గౌరవం వేరు. రాజకీయ పార్టీలకు వున్న గౌరవం వేరు. అది జగమెరిగిన సత్యం.