ఎంత మంచి సినిమా అయినా రిలీజ్ టైమ్ బాగుండాలి. లేదూ అంటే జనాలు థియేటర్ కు రావడం కష్టం అవుతుంది. అమీతుమీ పరిస్థితి అలాగే వుంది. రిలీజ్ డే నుంచి మంచి టాక్ నే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగా లేవు. సోలో రిలీజ్ అయినా, ఓపెనింగ్స్ అంతంతమాత్రం. దీనికి కారణం రిలీజ్ రాంగ్ టైమ్ అన్నదే అసలు సిసలు రీజన్.
అర్బన్ ఏరియాల్లో జనం అంతా ఇప్పుడు పిల్లలు, స్కూళ్లు, పుస్తకాలు, యూనిఫారమ్ లు అంటున్నారు. మరోపక్క కోస్తాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక పొలం పనులు మెలమెల్లగా ఊపందుకుంటున్నాయి. థియేటర్లు జోలికి రావడం తగ్గింది. మరోపక్క మల్టీ ఫ్లెక్స్ ల్లో అమీతుమీకి సరైన టైమింగ్ ల్లో షో లు పడలేదు. అదీ సమస్యే. మల్టీ ఫ్లెక్స్ లతో పోల్చుకుంటే సింగిల్స్ స్క్రీన్లలోనే బాగా టికెట్ లు తెగుతున్నాయి.
ఇదిలా వుంటే అమీతుమీ అనే కాదు, అసలు థియేటర్ల కలెక్షన్లే తగ్గుముఖం పట్టాయి. రెగ్యులర్ సినీ గోయర్స్ లాంటి వాళ్లు మాత్రమే థియేటర్ల వంక చూస్తున్నారు. వీళ్లతో థియేటర్లు నడవడమే కష్టం. ఇంక షేర్ ఎక్కడి నుంచి వస్తుంది. అయితే అమీతుమీ ఇప్పుడు సెకెండ్ వీక్ మీద ఆశలు పెట్టుకుంది. మౌత్ టాక్ స్ప్రెడ్ కావడం, అది పాజిటివ్ గా వుండడం, అన్నింటికి మించి ఈ వారం క్లాస్, అంటే భారీ సినిమాలు ఏవీ లేకపోవడం అన్నది అమీతుమీకి ఆశలు రేకెత్తిస్తోంది.
కానీ ఈ వీకెండ్ అంతా ఆంధ్ర, నైజాంల్లో తుపాను సూచనలు అంటున్నారు. ఇప్పటికే వాతావరణం అలాగే వుంది. కోస్తాలో వర్షాలు పడుతున్నాయి. అందువల్ల అమీతుమీ ఆశలు నెరవేరుతాయా అన్నది అనుమానంగా వుంది. మరీ మూడు వారాల పాటు థియేటర్లలో వుంచడం అంటే కష్టం. సినిమా అమ్మి వుంటే వేరే సంగతి. కానీ అమీతుమీ ఎక్కువగా అమ్మకాలు జరపుకోలేదని వినికిడి.
ఇదే కనుక సమ్మర్ సీజన్ లో కాస్త గ్యాప్ చూసుకుని వచ్చి వుంటే, ఫలితం వేరేగా వుండేదేమో?