టాలీవుడ్‌లో సోషల్‌ మీడియా స్కామ్‌!

– ఫేక్‌ ప్రతాపం చూపుతున్న తెలుగు సినిమా వాళ్లు Advertisement – నకిలీ రికార్డుల్లో ఇప్పుడు సోషల్‌ మీడియా వంతు -ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లు వేదికగా పాట్లు – నకిలీ ఫాలోయర్లు, నకిలీ వ్యూస్‌,…

– ఫేక్‌ ప్రతాపం చూపుతున్న తెలుగు సినిమా వాళ్లు

– నకిలీ రికార్డుల్లో ఇప్పుడు సోషల్‌ మీడియా వంతు

-ఫేస్‌బుక్‌, ట్విటర్‌, యూట్యూబ్‌లు వేదికగా పాట్లు

– నకిలీ ఫాలోయర్లు, నకిలీ వ్యూస్‌, నకిలీ క్లిక్స్‌ 

– ఆదరణ ఉందని చాటుకోవడానికి చీప్‌ ట్రిక్స్‌

టాలీవుడ్‌ దారి అడ్డదారి.. అది ఏ విషయంలో అయినా, సినిమాల్లో నటించండ్రా బాబూ అంటే మనోళ్లు సినిమా బయట కూడా నటనతో జీవించేస్తున్నారు. అన్నింటా అడ్డదారులు తొక్కుతూ, అబద్ధాలతో మేనేజ్‌ చేస్తూ అభాసుపాలవుతున్నారు. అవకాశం లేదనుకున్న చోట కూడా అబద్ధాలతోనే బండి లాగించేస్తున్న వీరు సోషల్‌ మీడియాలో ఇప్పుడు కొత్త స్కామ్‌కు పాల్పడుతున్నారు. టాలీవుడ్‌ ఫేక్‌ ఫీట్ల పరంపరలో ఇప్పుడు సోషల్‌ మీడియా స్కామ్‌ తెరపైకి వస్తోంది.

ఫేక్‌ థియేటర్లను దాటొచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది, ఫేక్‌ రిలీజ్‌ రికార్డులను చూసొచ్చాం.. అవి కొన్నాళ్లు రాజ్యం ఏలాయి. ఇక ఫేక్‌ వసూళ్ల హడావుడి కొనసాగుతూనే ఉంది. వీటన్నింటి మధ్యనా ఇప్పుడు మరో ఫేక్‌ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈసారి టాలీవుడ్‌ సోషల్‌ మీడియా మీద కన్నేసింది. ఇక్కడ ఆదరణను సొంతం చేసుకోవడం సంగతెలా ఉన్నా.. ఇక్కడ ఎక్కువ ఆదరణను పొందినట్టుగా చెప్పుకోవడానికి సినిమా వాళ్లు తాపత్రయపడుతున్నారు.

సినిమాల వారీగా, హీరోల వారీగా.. ఎవరికి వారు తమదే హవా అని చెప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో సహజంగానే అడ్డదారి తొక్కుతున్నారు. అభాసుపాలవుతున్నారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. సినిమా వాళ్ల మధ్య పోటీ ప్రతిసారీ అబద్ధాల వైపే దారిమళ్లుతూ ఉండటం. వీళ్ల విషవ్యూహాలను చూస్తూ సగటు సినీ అభిమాని వీరిని అసహ్యించుకుంటున్నాడు. వీళ్లింతే..! అనుకుంటున్నాడు.

సినిమాలోనూ నటనే.. బయటా అదే!

వీళ్ల మధ్య అనుబంధాలు అబద్ధం.. బయటవాళ్లపై చూపించే అనురాగం అబద్ధం.. సినిమాల్లో ఎలా నటిస్తారో, బయట కూడా అలాగే నటించేయగల సమర్థులు ఈ సినీమనుషులు. సినిమా ఆడియో విడుదల వేడుకల్లో, ప్రీ రిలీజ్‌ వేడుకల్లో సినిమా వాళ్ల ప్రసంగాలను వింటుంటే ఒక్కోసారి వెగటు పుడుతూ ఉంటుంది. ఒక దర్శకుడేమో మరో హీరోని దేవుడు అంటాడు. దేవుడికి మించిపోయాడని కీర్తిస్తాడు. ఏ విధంగా అంటే.. లాజిక్‌ లేమీఉండవు.

పొగడటం అంతే. ఇక వల్గర్‌ జోకులు, అబద్దపు ప్రశంసలు.. ఆకాశానికి ఎత్తుకోవడాలు, ఒకరి భజన మరొకరు చేసుకోవడాలు. వీరి వేషాలను జనాలు కూడా సునాయాసంగానే గ్రహిస్తున్నా, అభిమానుల ముసుగేసుకున్న కొంతమంది వల్ల ఏ మాత్రం వ్యక్తిత్వం లేని సినీతారలు కూడా దేవుళ్లై కూర్చున్నారు. ఏదో ఒక మిష మీద సదరు సినీ సెలబ్రిటీలకు అభిమానించే తీవ్రవాదులను పక్కన పెడితే, సినిమా వాళ్ల మాటల్లో, చేతల్లో డొల్లతనం ఇట్టే బయటపడిపోతూనే ఉంది!

ఫేక్‌ అని ఒప్పుకున్న రాజమౌళి!

ఇప్పటి సంగతి కాదు.. దాదాపు ఎనిమిదేళ్ల కిందట వచ్చిన 'మగధీర' సినిమా వందరోజుల థియేటర్ల సంఖ్య ఫ్యాబ్రికేటెడ్‌ అని ఇటీవలే ఒప్పుకున్నాడు ఆ సినిమా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. సినిమాను వందరోజుల పాటు ఆడించడంపై తనకూ, ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్‌కు మధ్య అభిప్రాయ బేధాలు కూడా వచ్చాయని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

ఖర్చు పెట్టుకునో, పరపతిని ఉపయోగించుకునో.. సినిమాను బలవంతంగా వందరోజుల పాటు ఆడించడాన్ని అప్పట్లో తను వ్యతిరేకించాను అని రాజమౌళి అన్నాడు. సినిమా ఆరంభం సమయంలోనే తను ఆ షరతును పెట్టానని కూడా చెప్పుకొచ్చాడు.

మొదట్లో తనతో ఏకీభవించిన అల్లు అరవింద్‌ ఆ తర్వాత మాట తప్పారని, పరపతిని ఉపయోగించుకుని సినిమాను ఎక్కువ థియేటర్లలో వందరోజులు ఆడించాడని.. అది నచ్చదని తను ఆ సినిమా వందరోజుల వేడుకకు కూడా హాజరుకాని మాట వాస్తవమే అని ఎస్‌ఎస్‌ రాజమౌళి చెప్పుకొచ్చాడు. మరి వాస్తవాన్ని ఒప్పుకోవడానికి ఎనిమిదేళ్లు పట్టింది!

అప్పట్లో మగధీర సినిమా వందరోజుల థియేటర్ల రికార్డు ఫేక్‌ అని ఆ సినిమా దర్శకుడు ఎనిమిదేళ్ల తర్వాత ఒప్పుకున్నాడు. మరి అలాంటి ఫేక్‌ ఫీట్‌ కేవలం మగధీర సినిమా ఒక్కదానిదే కాదు.. ఏ సినిమా అయితే రికార్డు స్థాయి థియేటర్లలో వందరోజులు, 175రోజులు ఆడిందని అప్పుడు చెప్పుకున్నారో.. అవన్నీ కూడా ఏదో నిర్మాతల శక్తి మీద సాధించిన రికార్డులే! కాదా? కాదనగలరా?

'మగధీర' వ్యవహారాన్ని రాజమౌళి బయటపెట్టాడు, మిగతావాళ్లు ధైర్యంగా ఒప్పుకోవడం లేదు. లేకపోతే.. 'సమరసింహా రెడ్డి' వంటి సినిమాలతో మొదలుకుని.. 'ఇంద్ర' 'నరసింహనాయుడు' 'ఆది' 'ఠాగూర్‌' వంటి సినిమాల వందరోజుల, 175రోజుల థియేటర్ల రికార్డులన్నీ నిజాలా?

ఎనభై థియేటర్లలో బాలయ్య సినిమా వందరోజులు ఆడితే ఆపై చిరంజీవి సినిమా వంద థియేటర్లలో వందరోజులు ఆడుతుంది. ఆపై బాలయ్య సినిమానో, ఎన్టీఆర్‌ సినిమానో వంద రోజులను 120 థియేటర్లలో పూర్తి చేసుకుటుంది.

ఇక 175రోజుల రికార్డులు మరో వైపు. సింహాద్రి, ఠాగూర్‌ వంటి సినిమాల మధ్య అప్పట్లో పోటీ నడిచింది. మరి అదంతా అభిమానుల కోసం చేసే వ్యవహారం అని అల్లు అరవింద్‌ లాంటి నిర్మాత తనతో అన్నాడని రాజమౌళి లాంటి దర్శకుడు చెప్పాడంటే.. గుడ్డి అభిమానుల కళ్లు తెరుచుకోవడానికి అంతకన్నా నిదర్శనం అక్కర్లేదు.

ఆ తర్వాత థియేటర్లలో విడుదల హడావుడి!

'స్టాలిన్‌' వంటి సినిమా దగ్గరకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. సినిమాలకు లాంగ్‌ రన్‌ తగ్గిపోయింది. వందరోజులు ఆడించడం నిర్మాతలకు తలకుమించిన భారం అయ్యింది. జనాలు కూడా వందరోజుల, 175రోజుల ఫేక్‌ రికార్డ్స్‌తో అలసిపోయారు. ట్రెండ్‌ మారింది. స్టాలిన్‌ను నాలుగొందల థియేటర్లలో విడుదల చేయడం గొప్ప ఫీట్‌గా చిరంజీవి అభిమానులు అప్పట్లో చెప్పుకున్నారు. ఇంకేముంది.. ఆ తర్వాత మరో సినిమా.. అంతకన్నా ఎక్కువ సంఖ్య థియేటర్లలో విడుదల అయ్యింది.

అప్పటి వరకూ రిలీజ్‌ సినిమాలను ఆడించిన నేపథ్యంలేని చిన్న చిన్న పట్టణాల్లోని థియేటర్లలో కూడా రిలీజ్‌ బొమ్మలు పడటం మొదలైంది. టెంట్లలో కూడా స్టార్‌ హీరోల సినిమాలు విడుదల కావడం మొదలైంది. ఈ పోటీ ఎక్కువయ్యింది. ఒక్కో ఊరిలో రెండు మూడు థియేటర్లలో ఒకే సినిమా విడుదల కావడం మొదలైంది.

స్టాలిన్‌ దగ్గర నుంచి మొదలుపెట్టి.. బాహుబలి వరకూ వచ్చిన మార్పును చూస్తే.. సీడెడ్‌ ఏరియాలోని ఒక జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో స్టాలిన్‌ సినిమా మూడు థియేటర్లలో విడుదల కావడం అప్పటికి ఆశ్చర్యం అయితే అదే జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో బాహుబలి ఎనిమిది థియేటర్లను ఆక్రమించింది.

ఈ క్రమంలో చాలా మార్పులు వచ్చాయి. వారానికి ఒకటీ రెండు సినిమాల ఫార్ములా అమల్లోకి వచ్చింది. భారీ సినిమా అయితే ఒకటే వస్తుంది.. అన్ని థియేటర్లనూ అదే ఆక్రమిస్తుంది. వారంగడిచే సరికి మాయం అవుతుంది! వందరోజుల ట్రెండ్‌ నుంచి కేవలం పదేళ్ల వ్యవధిలో వారంరోజుల వ్యవధికి వచ్చేసింది తెలుగు సినిమా. ఇలాంటి సమయంలో అభిమానులను అలరించడానికి కలెక్షన్స్‌ రికార్డ్స్‌ మొదలయ్యాయి.. ఇవి కూడా ఫేకే!

వందల కోట్లలో నిజాలు ఎన్ని?

ఫేక్‌ రికార్డ్స్‌ ప్రకటించుకోవడం మొదలైన కొత్తలో.. ఒక ప్రొడ్యూసర్‌ ఒక స్టార్‌ హీరోతో తను తీసిన సినిమా భారీ ఎత్తున కలెక్షన్లను సంపాదించిందని ప్రకటించుకున్నాడు. తను పెట్టిన పెట్టుబడికి అనేక రెట్ల లాభాలు వచ్చాయని, తొలి వారంలోనే భారీ సొమ్ము వచ్చిందని చెప్పుకొచ్చాడు. రెండో వారంలో ఆ నిర్మాత ఆఫీసుపై ఇళ్లపై ఐటీ రైడ్స్‌ జరిగాయి! నిర్మాత నోటి నుంచి మ్యాజిక్‌ ఫిగర్లు వినేసరికి ఐటీవాళ్ల నోళ్లలో నీళ్లు ఊరాయి. కోట్లరూపాయల సొమ్ముకు లెక్కలు అడగొచ్చు.. అంత మొత్తంపై భారీఫైన్‌ వేయొచ్చు.. అని వెళ్లిన వారు విస్తుపోయారు.

తాపీగా అసలు విషయాన్ని చెప్పాడు నిర్మాత.. 'అబ్బే.. ఆ కలెక్షన్ల లెక్కలు అన్నీ అబద్ధాలండీ, ఏదో సినిమాకు జనాలను ఆకర్షించడానికి అలా చెబుతూ ఉంటాం అంతే…' అని వారిదగ్గర నిజాయితీగా అసలు విషయాన్ని చెప్పాడు. మరి అప్పుడు కూడా నిజం ఒప్పుకోకపోతే.. ఆ డబ్బు ఎక్కడ దాచావ్‌ అని ఐటీవాళ్లు అదరగొట్టేస్తారు. దీంతో అసలు విషయాన్ని చెప్పేసి బతుకు జీవుడా.. అన్నాడు ఆ నిర్మాత.

కేవలం ఆయన కథే కాదు.. చాలా సినిమాల కలెక్షన్ల విషయంలో కూడా అలాంటి ఫేక్‌ ప్రకటనలే రాజ్యం ఏలాయి, రాజ్యం ఏలుతున్నాయి. తొలివారంలో భారీ వసూళ్లతో నిలిచిందని వార్తల్లోకి వచ్చిన సినిమాలనేకం.. అంతిమంగా నిర్మాతకు భారీ లాస్‌ను మిగిల్చాయి. అలాంటి సినిమాలు బోలెడు. అయినప్పటికీ ఒక దశలో టాలీవుడ్‌లో ఫేక్‌ ప్రకటనల ట్రెండ్‌ నడించింది. ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

అయిననూ అసహనమే.. అందుకే కొత్త రూటు!

మరి సినీ జనం ఏం చేసినా అందులో అబద్ధాలు, నకిలీలు, బూటకపు మాటలు తప్పేలా లేవు. ఎన్నోరకాల ఫేక్‌ ఫీట్లు చేసిన వీళ్లు ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియా మీద పడ్డారు. ఇక్కడ తమ ఫేక్‌ ప్రతాపాలు చూపుతున్నారు! ఇక్కడ వీరి నకిలీలలకు హద్దే లేకుండా పోతోంది. థియేటర్ల విషయంలో ఎలాంటి చీప్‌ టెక్నిక్స్‌కు పాల్పడ్డారు.. ఆఖరికి ఫేస్‌బుక్‌ లైక్స్‌, ట్విటర్‌ ఫాలోయర్స్‌, యూట్యూబ్‌ వ్యూస్‌ విషయంలో కూడా అచ్చం లాంటి టెక్నిక్స్‌కే పాల్పడుతున్నారు టాలీవుడ్‌ జనాలు. ఈ విషయంలో కూడా వీరు యథావిధిన పట్టుబడిపోతున్నారు.

వీళ్లకు తమకు అచ్చొచ్చిన నకిలీ వ్యవహారాలనే ఫాలో అవుతున్నారు.. సోషల్‌ మీడియాలో కూడా మనోళ్లు స్కామ్‌ చేసేస్తున్నారనే అంశం స్పష్టం అవుతోంది. సామాన్యుడిదే హవా అనుకున్న చోట కూడా టాలీవుడ్‌ తనదైన శైలిలోనే సాగుతోంది.

సోషల్‌ మీడియాలో పోటా పోటీ!

సోషల్‌ మీడియా సామాన్య ప్రజానీకానికి ఎంత ఉపయుక్తంగా ఉందో సినిమా వాళ్లకు కూడా అంతే ఉపయుక్తంగా ఉంది. మొదట మెల్లగా మొదలైన ఈ సునామీలో సినిమా వాళ్లు చాలా త్వరగా భాగం అయిపోయారు. ముందుగా కాస్త రాసేతీరిక ఉన్నవాళ్లు సోషల్‌ మీడియా వైపు రాగా స్పందించే వాళ్లు రాగా ఆ తర్వాత సోషల్‌ మీడియాను పక్కా కమర్షియల్‌గా మార్చేశారు.

తమ తమ ఫొటోలను పోస్టు చేసుకొంటూ, తమ సినిమాల ప్రమోషన్‌ కోసం సోషల్‌ మీడియాను అడ్డాగా మార్చేసుకున్నారు సినిమా వాళ్లు. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడం ప్రత్యేకించి యువతకు అందుబాటులోకి రావడంతో సినిమా వాళ్లకు కలిసొచ్చింది. తమ సినిమాల ప్రమోషన్స్‌ కోసం సోషల్‌ మీడియా వరం అయ్యింది. మరి అంతవరకే ఉపయోగించుకుంటే దాన్ని తప్పుపట్టడానికి లేదు. అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.

అయితే.. ఇదే సమయంలో సోషల్‌ మీడియా అభిమానాన్ని సినీస్టార్ల ఆదరణకు కొలమానంగా చూడటం మొదలైంది. అక్కడ నుంచే కథ అడ్డం తిరిగింది. ఫలానా హీరో కన్నా ఇంకో హీరోకి ఎక్కుమంది ఫాలోయర్లున్నారు, ట్విటర్లో అతడే టాప్‌.. ఫేస్‌బుక్‌లో హవా ఇతడిదే తెలుగు హీరోల కన్నా కొంతమంది హీరోయిన్లకే ఎక్కువమంది ట్విటర్‌ ఫాలోయర్లున్నారు.. అనే విశ్లేషణలు మొదలయ్యాకా మనోళ్ల టాలెంట్‌ బయటకు వచ్చింది.

ఈ పరంపరలో ఫేక్‌ ఫాలోయర్స్‌, ఫేక్‌ లైక్స్‌ పరంపర మొదలైంది. తమ పేజ్‌ ప్రమోషన్‌ కోసం ఫేస్‌బుక్‌కు డబ్బు చెల్లించే ప్రక్రియ ఒకటి ఉంది. ఎంత డబ్బు చెల్లిస్తే అన్ని లైక్స్‌ వచ్చి పడతాయి. తెలుగు సినీ హీరో పేజ్‌ను తెలుగు సినీ అభిమానుల ఫేస్‌బుక్‌ అకౌంట్ల మధ్య ప్రమోట్‌ చేస్తూ లైక్స్‌ను తెప్పించే థియరీ ఫేస్‌బుక్‌ది. అయితే ఇందులో ఫేక్‌ లైక్స్‌ ఉంటాయనేది సోషల్‌ మీడియా నిపుణుల అభిప్రాయం.

కొంత డబ్బు ఖర్చు పెట్టుకోవడంతో అనామకులు ఒక పేజ్‌ను క్రియేట్‌ చేసి దానికి రెండు మూడు లక్షల లైక్స్‌ తెప్పించుకునే అవకాశం ఉంది. అలాగే సెలబ్రిటీల అకౌంట్ల ఫాలోయర్లలో కూడా చాలా వరకూ పెయిడ్‌ లైక్స్‌ ఉంటాయనేది బహిరంగ రహస్యం.

మరి లైక్స్‌ అలా వచ్చి పడిపోయే అవకాశం ఉండటంతో పోటా పోటీ వాతావరణం పెరిగింది. పైకి ప్రకటించకుండానే సాగిన ఈ పోరాటం సోషల్‌ మీడియా వేదికగానే రచ్చకు ఎక్కుతోంది. కొంతమంది హీరోలు తమను తాము సోషల్‌ మీడియా కింగ్‌లుగా ప్రకటించుకుంటున్నారు. అదెలా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.

యూట్యూబ్‌ వ్యూస్‌ లొల్లి…

ఒక తెలుగు సినిమా విడుదల అయిన 24 గంటల్లో యూట్యూబ్‌లో కోటి వ్యూస్‌ను సంపాదించుకుందట! ఇదీ ప్రస్తుతం ఒక ఆల్‌టైమ్‌ రికార్డ్‌ అట. చెప్పుకోవడానికైనా ఒక హద్దుండాలి. తెలుగు వాళ్ల జనాభా ఎంత? అందులో ఇంటర్నెట్‌ ఎంతమందికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది? వారిలో ఎంతమంది యూట్యూబ్‌ గురించి తెలుసు? 
యూట్యూబ్‌ను చూస్తున్న వారిలో ఎంతమంది ఆ సినిమా టీజర్‌ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు? సరిగ్గా ఆ ఇరవై నాలుగు గంటల్లో ఎంతమందికి నెట్‌ అందుబాటులో ఉండి ఉండాలి? ఇలాంటి లాజిక్స్‌తో ఆలోచిస్తే.. ఒక తెలుగు సినిమా టీజర్‌ వితిన్‌ 24 అవర్స్‌లో కోటి వ్యూస్‌ సంపాదించుకోవడం అనేదానికి మించిన అబద్ధం మరోటి ఉండదు.

కానీ మనోళ్లు అలాంటి అబద్ధాలను ఈజీగా ఆడేస్తున్నారు. ఫేక్‌ వ్యూస్‌ను చూపించేస్తున్నారు. తద్వారా తమే టాప్‌ అని చెప్పుకోవడానికి ప్రయాస పడుతున్నారు. మరి వీరు కోటి వ్యూస్‌ చూపిస్తే.. రేపు ఇంకొకరు కోటిన్నర చూపుతారు. అచ్చం థియేటర్ల సంఖ్య విషయంలో జరిగిన పోటీలాగా అన్నమాట.

ఈ కామెడీలు ఇంతటితో ఆగిపోలేదు.. మరో తెలుగు సినిమా ఫేస్‌బుక్‌లో టాప్‌ ట్రెండింగ్స్‌లో నిలిచిందట. అది తెలుగునాటో, ఇండియా పరిధిలోనో కాదు.. ఖతార్‌లోనట. ఖతార్‌ ఫేస్‌బుక్‌ ట్రెండ్స్‌లో ఒక తెలుగు సినిమా టాప్‌ ప్లేస్‌లో వచ్చిందట. బహుశా అడ్రస్‌ మిస్సై అటు వెళ్లిందేమో. ఖతార్‌ జనాభా పాతికలక్షలు. కరడుగట్టిన ముస్లిం దేశం అది.

అక్కడకు ఉపాధికోసం వెళ్లిన ఇండియన్స్‌ చాలా మందే ఉన్నమాట వాస్తవమే. అయినా వారిలో ఎంతమందికి మన తెలుగు హీరో తెలిసి ఉండాలి? ఆ ధనిక దేశం ట్రెండింగ్స్‌లో తెలుగు సినిమా ముందుండటం అంటే అంతకు మించిన ఫేక్‌ వ్యవహారం ఏముంటుంది? మరి దానివెనుక కథేమిటి అని ఆరాతీస్తే సదరు హీరో గారి పీఆర్‌ ఏజెన్సీ వ్యూహాత్మకంగా ఖతార్‌ ఐపీ అడ్రస్‌లనుంచి ఆ సినిమా గురించి స్కామ్‌ చేయించిందట. ఇవీ మనోళ్ల కథలు. శోధించి చూస్తే ఇలాంటి కామెడీలు ఎన్నో అగుపిస్తున్నాయి.

ఫేస్‌బుక్‌లో ఫాలోయర్ల సంఖ్యను పెంచుకోవడానికి ఇంకా మరెన్నో చీప్‌ ట్రిక్స్‌ కొంతమంది సినీ తారలవి. ఫేస్‌బుక్‌లో తరచూ ఒక పోస్టు అగుపిస్తూ ఉంటుంది. 'ఈ పేజీకి లైక్‌ కొట్టి.. కింద 2 అని టైప్‌ చేయండి.. ఏమవుతుందో చూడండి..' అంటూ ఒక పోస్ట్‌ వస్తూ ఉంటుంది. నిజంగానే స్పెషల్‌ ఉంటుందేమో అని చాలామంది ఆ పేజీకి లైక్‌ కొడతారు చెప్పిన సంఖ్యను టైప్‌ చేస్తారు. తర్వాత ఏమీ జరగదు.. జస్ట్‌ ఆ సినీతార పేజీకి టైప్‌ చేసిన వారి ద్వారా ఒక లైక్‌ పెరుగుతుందంతే!

ఇలా సాగుతోంది… తెలుగు సినీతారల సోషల్‌ మీడియా స్కామ్‌. అనేక రకాలుగా, అనేక విధాలుగా ఇది ట్రెండ్‌ అయిపోయింది. మరి ఇప్పటికిప్పుడు కాకపోయినా.. థియేటర్ల వ్యవహారం గురించి రాజమౌళి ఒప్పుకుంటున్నట్టుగా, ముందు ముందు సోషల్‌ మీడియా ఫేక్‌ వ్యవహారాల గురించి వీళ్లలోనే ఎవరో ఒకరు ఒప్పుకోవడం ఖాయమే!