అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత చంద్రబాబుకు తలబొప్పి కట్టిస్తున్నారు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని పలుమార్లు హెచ్చరించినా మాజీ ఎమ్మెల్యే , తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పట్టించుకోవడం లేదు. పైకి మాత్రం చంద్రబాబును పొగుడుతూ, సొంత పార్టీ నేతల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
మాజీ మంత్రి, పుట్టపర్తి టీడీపీ ఇన్చార్జ్ పల్లె రఘునాథరెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మరోసారి శుక్రవారం వివాదం తలెత్తింది. పుట్టపర్తిలో ఉజ్వల భూకబ్జాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి బయల్దేరారు. అయితే జేసీ ప్రభాకర్‌రెడ్డి రాకను పుట్టపర్తి టీడీపీ శ్రేణులు వ్యతిరేకించాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డి వస్తే తాడోపేడో తేల్చుకోవాలని పల్లె రఘునాథరెడ్డి అనుచరులు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో జేసీ పుట్టపర్తి వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే కారణంతో మార్గమధ్యంలోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథరెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గ విషయాలపై జేసీ జోక్యం చేసుకోవడాన్ని పల్లె రఘునాథరెడ్డి తప్పు పట్టారు. తన నియోజకవర్గంలో జేసీ తల దూరిస్తే ఊరుకోనని మరోసారి పల్లె రఘునాథరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమయైంది.
ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని చంద్రబాబునాయుడు చెప్పిన సంగతిని పల్లె గుర్తు చేశారు. అయినప్పటికీ జేసీ ప్రభాకర్‌రెడ్డి అధినేత ఆదేశాలను పట్టించుకోకుండా, పదేపదే జోక్యం చేసుకుంటూ వివాదాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే తాను మంత్రి పదవికి అడ్డమవుతాననే ఓర్వలేనితనంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి రచ్చ చేస్తున్నారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో జేసీ తల దూరిస్తే ఊరుకోనని హెచ్చరించారు. తన నియోజకవర్గంలో కార్యకర్తల కష్టసుఖాలు తాను చూసుకుంటానని తెలిపారు. టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గంలోకి వచ్చి జేసీ ప్రభాకర్‌రెడ్డి చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు.
పుట్టపర్తి నియోజకవర్గంలో సమస్య ఏదైనా ఉంటే తనతో చర్చించాలని సూచించారు. ఉజ్వల భూకబ్జాల అక్రమాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. గతంలో అనేక మార్లు పల్లె రఘునాథరెడ్డిని ఇబ్బంది పెట్టేలా జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహరించినా క్రమశిక్షణ చర్యలు తీసుకునే దమ్ము టీడీపీ అధిష్టానానికి కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ బలహీనత పసిగట్టిన జేసీ బ్రదర్ రెచ్చిపోతున్నారనే చర్చ జరుగుతోంది.