రివ్యూ: ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
రేటింగ్: 2/5
బ్యానర్: మధుర ఎంటర్‌టైన్‌మెంట్
తారాగణం: సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మానస, మనాలి రాథోడ్, కృష్ణ భగవాన్ తదితరులు
కూర్పు: బస్వా పైడిరెడ్డి
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: నగేష్ బానెల్
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి
కథ, కథనం, దర్శకత్వం: వంశీ
విడుదల తేదీ: జూన్ 2, 2017
అమ్మాయి నెత్తిన పెద్ద పెద్ద బస్తాలు, కొబ్బరి బొండాలు పడేయడం, తంతే ఎగిరెళ్లి ఎదురుగా కాలువలో వెళుతోన్న పడవలో పడుకున్న ఆవిడ దగ్గర పడిపోవడం, కోడిగుడ్లు జేబులో పెట్టుకుంటే వాటి మీద కొట్టగానే, కోడిపిల్లలు ప్యాంట్‌లో నుంచి బయటకి రావడం! ఇది హ్యూమర్.
స్నానం చేస్తుంటే లేజర్ బీమ్ వేసాడని ఒక అమ్మాయి హీరోని లవ్వాడేస్తుంది. మరొకామె తనని వివస్త్రగా చూసాడని మనసిచ్చేస్తుంది. పల్లెటూరి మొద్దులు కదా అని సరిపెట్టుకుందామంటే, అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి చీర కడుతూ టైలర్ తన నడుము తడమగానే ఆవిర్లు కక్కుతూ సరండర్ అయిపోతుంది! ఇది రొమాన్స్.
''వంశీ గారండోయ్… ఇది రెండు వేల పదిహేడు'' అంటూ బిగ్గరగా అరిచి గుర్తు చేయాలనిపించేలా 'ఫ్యాషన్ డిజైనర్' నిండా ఎన్నో వింతలూ, విశేషాలూను. 'జమ జచ్చ' అంటూ ఆ కాలంలోనే అడల్ట్ కామెడీని తెలుగు సినిమా మెయిన్ స్ట్రీమ్‌లోకి తెచ్చిన 'లేడీస్ టైలర్'కి కొడుకు ముప్పయ్యేళ్ల తర్వాత ఇప్పుడు 'ఫ్యాషన్ డిజైనర్'గా వస్తున్నాడంటే, ఇది ఇంకెంత అడ్వాన్స్‌డ్‌గా వుంటుందో, ఎంత కొత్త ఫ్యాషన్ చూపిస్తుందో అనుకోవడం సహజం. కానీ పేరులో వున్న ఫ్యాషన్ తీరులో లేదు, రాతలో లేదు, తీతలో లేదు… అంతెందుకు అసలు దాని ఆచూకీనే లేదు.
పంతొమ్మిది వందల ఎనభైల్లో రీళ్లల్లో ఇరుక్కుపోయి ఇప్పటికి బయట పడ్డట్టు అనిపించే తీరున సాగిన ఈ అవుట్ డేటెడ్ ఫ్యాషన్ డిజైనర్ అడుగడుగునా అసహనానికి గురి చేస్తాడు. వంశీ స్టయిల్ పాతబడిపోయిందని, ఆయన కామెడీ ఇప్పుడు చెల్లడం లేదని సింపుల్‌గా ఒక మాట అనేసి ఊరుకోవచ్చు. కానీ ఏప్రిల్ 1 విడుదల సినిమా ఒకసారి యూట్యూబ్‌లో చూసి అదే మాట అనండి చూద్దాం. దివాకరం… అంటూ మల్లిఖార్జునరావు గింజుకుంటూ వుంటే నవ్వాపుకోవడం ఎవరి తరం? అలా ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయిన కామెడీ అందించిన దర్శకుడు అప్పటిలా హాస్యాన్ని పండించలేకపోవడం మన దురదృష్టం.
వంశీ గత పది, పదిహేనేళ్లలో తీసిన ఏ సినిమా చూసినా కానీ ఒక విషయం అయితే స్పష్టం. షాట్ డివిజన్ నుంచి స్టోరీ టెల్లింగ్ వరకు అన్నిట్లోను ఆయన అప్పటి ట్రెండు విడిచి పెట్టలేదు. ఆయన మార్కు షాట్ డివిజన్లు అప్పట్లో కొత్తరకం అనుభూతినిచ్చేవి. ఆయన మార్కు పాటల చిత్రీకరణ మిగిలిన సినిమాల మధ్య తన చిత్రాలని ప్రత్యేకంగా నిలబెట్టేవి. అయితే ఆ షాట్ల వల్లో, సాంగుల వల్లో ఆ సినిమాలు అంతగా ఆదరణకి నోచుకోలేదని గుర్తుంచుకోవాలి. ఆయన సృష్టించిన పాత్రలు, వాటి మధ్య జరిగే సహజమైన సంభాషణలు, మన జీవితాల్లోంచి ఎగిరి వెళ్లి తెరపై పడ్డాయన్నట్టు అనిపించే హాస్య ఘట్టాలు, అన్నిటికీ మించి పసందైన, రసవత్తరమైన కథలు వంశీ చిత్రాలకి ఆ కీర్తిని తెచ్చిపెట్టాయి. వాటికి హంగులుగా ఆయన మార్కు షాట్ మేకింగ్, సాంగ్స్ పిక్చరైజేషన్ పనికొచ్చేవి.
అసలుది వదిలేసి కేవలం అప్పటి ఆ చమక్కులు చూపిస్తా నా మార్కు వెతుక్కోండి అంటే ఎలా వేగేది? అయినా నటకిరీటి చేసిన పాత్రకి కొనసాగింపుని తెచ్చి చిన్న పిల్లాడి చేతిలో పెట్టిన తప్పెవరిది? గోదావరి యాస మాట్లాడితే గోదారి పరుగులా అలా హాయిగా గలగలా సాగిపోవాలే కానీ పట్టి పట్టి మాట్లాడుతోన్న సుమంత్‌ని 'సుందరం' కొడుకు 'గోపాళం' అంటే ఎలా నమ్మేది? డబ్బింగ్ ఆర్టిస్టులకి కూడా యాస చేత కానపుడు ఇక వారి సాయంతో నెట్టుకొచ్చే అమ్మాయిలని చూసి గోదారోళ్లే అని ఎలా అనుకునేది? బట్టల సత్యం లాంటి సహజమైన పాత్ర మచ్చుకైనా కనిపించలేదేంటి? ఊరంతటినీ గడగడలాడించే గవర్రాజుగారి ముఖంలో టార్చి వేసినా ఎక్స్‌ప్రెషన్ జాడ లేదేంటి?
అసలు కథలోకి వెళితే… చేతిలో మన్మధ రేఖ వుంది కనుక దానిని వాడుకుని డబ్బున్న అమ్మాయిని పడేసి పట్నంలో షాప్ ఓపెన్ చేద్దామనుకుంటాడు గోపాళం (సుమంత్ అశ్విన్). ఆర్థికంగా వివిధ స్థాయిల్లో వున్న ముగ్గురమ్మాయిలని పిక్ చేసుకుంటాడు. వారిలో అమెరికా అమ్మాయికి (అనీషా) ఫిక్స్ అవుతాడు కానీ మిగతా ఇద్దరిని (మానస, మనాలి) ఎలా వదిలించుకోవాలనేది తెలియదు. తేడా జరిగితే గవర్రాజు చంపేస్తాడని భయం. లేడీస్ టైలర్‌లో రాజేంద్రప్రసాద్‌కి వచ్చిన సమస్యకి ఏప్రిల్ 1 విడుదలలో రాజేంద్రప్రసాద్ ద్వారా పరిష్కారం దొరికినట్టు, ఈ రెండో సినిమాని తలపించే పతాక సన్నివేశం.
ముందే చెప్పినట్టు అక్కడెక్కడో ముప్పయ్యేళ్ల క్రితం స్టక్ అయిపోయిన ఆలోచనలు, అక్కడే ఆగిపోయిన టెక్నాలజీలతో బాహుబలులు చూస్తోన్న ఈ తరం ప్రేక్షకులని మెప్పించడం కష్టం. స్టాండ్ అప్ కమెడియన్ల నుంచి, జబర్దస్త్ టీవీ షోల వరకు హాస్యం కోసం ఎన్నెన్నో ఆప్షన్స్ వున్నపుడు మనిషిని వెనక్కి తిప్పి తన్నే సీన్లు చూపించి ఇదే హాస్యమంటే ఎలా నవ్వుతాం? వంశీ గారి సంగీతాభిరుచి అయితే ఇప్పటికీ చెక్కు చెదరలేదనిపించేలా మణిశర్మ మూడు, నాలుగు మాంఛి మెలొడీలని అలా చెవుల్లో అమృతంలా పోసేసాడు.
వంశీగారి సంగతి సరే… అసలు ఈయనకి ఆఫర్లెందుకు తగ్గిపోయాయసలు? వంశీ సినిమాల్లో గోదావరి ఎందుకో మామూలుగా కంటే అందంగా అనిపిస్తుంటుంది. హంగులు, సెట్టింగులు లేని చోట ప్రకృతి అందాలతోనే తెర అందంగా కనిపించాల్సిన అవసరంలో నగేష్ బానెల్ పనితనం బహుచక్కగా అక్కరకొచ్చింది. వంశీ మార్కు వినోదాన్ని నేటితరం ప్రేక్షకులకి అందించాలనే మధుర శ్రీధర్ ఆలోచన మంచిదే కానీ అసలాయనే గతంలోంచి వర్తమానానికి రానని భీష్మించుకుంటే ఎవరు మాత్రం ఏం చేసేది?
ప్రథమార్ధంలో పడిలేస్తూ ఏదో నెట్టుకొచ్చినా, ద్వితీయార్ధం ''ఇంకా ఎంతసేపు కూర్చుంటారు?'' అంటూ మనల్ని ప్రతి పాత్రా అడుగుతున్నట్టు, ప్రతి సీను నిలదీస్తున్నట్టు, ప్రతి ఘట్టం పరీక్షిస్తున్నట్టు అనిపిస్తూ వుంటే వంశీగారిపై గౌరవం కూర్చోబెడుతుంది. మణిశర్మ సంగీతం కాస్త సేదదీరుస్తుంది.
బాటమ్ లైన్: ఓల్డు ఫ్యాషనండీ!
– గణేష్ రావూరి