ఆరడుగుల బుల్లెట్ సినిమా మొత్తానికి కిందా మీదా పడి పూర్తి చేసారు. ఇలా పూర్తి చేయడానికి పివిపి సంస్థ ఈ ప్రాజెక్టుకు పది కోట్లకు పైగా అప్పు ఇచ్చిందట. డబ్బులతో సినిమాను కిందా మీదా పడి ఫినిష్ చేసారు. పనిలో పనిగా రెండు పాటలు కూడా జోడించారు.
అంతా బాగానే వుంది. మరి ఈ పది కోట్లకు పైగా ఫైనాన్స్ రికవరీ ఎలా? అందుకే సినిమా మొత్తం వ్యవహారాలు, శాటిలైట్ హక్కులు, మార్కెటింగ్ అంతా పివిపి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సినిమా మీద పైసా వస్తే పైసా, రూపాయి వస్తే రూపాయి ముందు పివిపి అక్కౌంట్ లో జమకావాలి. అక్కడ పది కోట్లకు పైగా బాకీ తీరిపోయిన తరువాత ఏమయినా వుంటే అది నిర్మాతకు.
సినిమాను అమ్ముదాం అంటే ఎవరూ పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది. గౌతమ్ నందాకు సేల్స్ వుంటున్నాయి కానీ, ఆరడగుల బుల్లెట్ కు మాత్రం మార్కెట్ రావడం లేదు. వచ్చినా, గౌతమ్ నందా రేటులో సగానికి సగానికి కోసి అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అయితే పివిపి పెట్టిన పెట్టుబడి పది కోట్లు ఎప్పడు వచ్చేను? ఎలావచ్చేను?
తెగించి ఎవరైనా కొనాలన్నా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పదిహేను కోట్లకు పైగా రేటు చెబుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు అంత రేటు వస్తుందా? కొనడానికి తెగించే జనాలు వున్నారా? అన్నది అనుమానం. పైగా ఇప్పుడు సమ్మర్ సీజన్ ముగిసిపోయింది. మరోపక్క 9న రెండు సినిమాలు వున్నాయి. ఒకటి అమీతుమీ, రెండవది జయదేవ్. అమీతుమీ పక్కా కామెడీ ఎంటర్ టైన్ మెంట్ జోనర్. దీన్ని ఢీకొని ఆరడుగుల బుల్లెట్ ఏ మేరకు నిల్చుంటుందన్నది అనుమానం.
పైగా థియేటర్లు అన్నీ కాస్త ఫుల్ గా వున్నాయి. అందువల్ల ఆరడుగుల బుల్లెట్ కు ఎన్ని థియేటర్లు దొరకుతాయి అన్నది అనుమానం. మరి అలాంటి సినిమాకు సరిపడా థియేటర్లు లేక, ఓపెనింగ్స్ డవుట్ అనుకుంటే కొనడానికి ఎవరు ముందుకు వస్తారు? మరి అప్పుడు పివిపి ఫైనాన్స్ వెనక్కు రావడమే అదృష్టం అవుతుంది.