సినిమా రివ్యూ: అంధగాడు

రివ్యూ: అంధగాడు రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి. తారాగణం: రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, సయాజీ షిండే, రాజా రవీంద్ర, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు కూర్పు: ఎం.ఆర్‌.…

రివ్యూ: అంధగాడు
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.
తారాగణం: రాజ్‌ తరుణ్‌, హెబ్బా పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, సయాజీ షిండే, రాజా రవీంద్ర, సత్య, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
సంగీతం: శేఖర్‌ చంద్ర
ఛాయాగ్రహణం: బి. రాజశేఖర్‌
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ, కథనం, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్‌
విడుదల తేదీ: జూన్‌ 2, 2017

వినోదాత్మక చిత్రాలతో మినిమమ్‌ గ్యారెంటీ హీరో అనిపించుకుంటోన్న రాజ్‌ తరుణ్‌ ఈసారి 'అంధగాడు'గా వచ్చాడు. పేరులోనే 'అంధుడి' పాత్ర అనేది స్పష్టం చేసారు. హీరో అంధుడు అంటే జనరల్‌గా వేదాంత ధోరణి లేదా జాలి కలిగించే తరహా పాత్ర చిత్రణ వుంటుంది. కానీ ఈ 'అంధగాడు' అంధుడిగా కూడా వినోదాన్ని అందిస్తాడు. కథలో ఎక్కువ సమయం అంధుడిగా కనిపించకపోయినా కానీ, అలా  కనిపించిన కాసేపు నవ్వులు పంచడం ఈ అంధగాడి ప్రత్యేకత.

ఐ బ్యాంక్స్‌ అన్నిట్లోను ఒక మాట వేసి వుంచాడు కనుక కళ్లు 'ఆన్‌ ది వే' అంటుంటాడు గౌతమ్‌ (రాజ్‌ తరుణ్‌). తనకి కళ్లు లేవనే కారణంగా అమ్మాయిలు రిజెక్ట్‌ చేస్తున్నారని, తనకి చూపు లేదనే అబద్ధం చెప్పి సరాసరి ఐ స్పెషలిస్ట్‌ నేత్రని (హెబ్బా పటేల్‌) ప్రేమలోకి దించుతాడు (లాజిక్‌ లేని ఈ వ్యవహారాన్ని కామెడీగా తీసుకోవాలి). కొన్నాళ్లకి తనకి ఐ డోనార్‌ దొరకడంతో గౌతమ్‌కి చూపు తిరిగి వస్తుంది. కానీ కళ్లు వచ్చిన తర్వాత అతనికో కొత్త పాత్ర పరిచయం అవుతుంది. నేత్ర తండ్రినంటూ పరిచయం చేసుకున్న కులకర్ణి (రాజేంద్రప్రసాద్‌) తనని ముప్పు తిప్పలు పెడతాడు. అతడిని ఇంప్రెస్‌ చేసానని అనుకుంటోన్న గౌతమ్‌కి ఒక షాక్‌ తగులుతుంది. కులకర్ణికి, నేత్రకి సంబంధం లేదని, ఆమె తండ్రి వేరే వ్యక్తి (సయాజీ) అని తెలుస్తుంది. మరి కులకర్ణి ఎవరు? ఎందుకని నేత్ర తండ్రిగా పరిచయం చేసుకున్నాడు.

కథ మొదలవడం కామెడీ సినిమా తరహాలో స్టార్ట్‌ అయినా కానీ ఇంటర్వెల్‌కి ట్విస్ట్‌తో థ్రిల్లర్‌గా టర్న్‌ తీసుకుంటుంది. అంధుడిననే సంగతి దాచి పెట్టి హెబ్బాని ఇంప్రెస్‌ చేయడానికి స్నేహితుడు సత్యతో కలిసి రాజ్‌ తరుణ్‌ పడే పాట్లు నవ్విస్తాయి. ఆ కామెడీ ముగిసిన తర్వాత రాజేంద్రప్రసాద్‌ ఎంట్రీతో కథలో ఆసక్తికరమైన మలుపు వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి పెంచుతూ చక్కని ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కుదిరింది. అయితే రాజేంద్రప్రసాద్‌ ఎవరు, ఏమిటి అనేది రివీల్‌ అయ్యాక ఉత్కంఠ చల్లారిపోతుంది. రాజ్‌ తరుణ్‌కి టెస్ట్‌ పెడతానంటూ సయాజీ షిండే అతడిని ఇంటికి పిలవడంతో కథ పూర్తిగా పక్కదారి పడుతుంది. చవకబారు కామెడీ సన్నివేశాలు, కథని ఏమాత్రం ముందుకి తీసుకెళ్లని రాజ్‌తరుణ్‌-రాజేంద్రప్రసాద్‌ మధ్య సీన్లు బాగా విసిగిస్తాయి. అసలు ట్విస్ట్‌ ఏంటనేది రివీల్‌ చేసాక కానీ మళ్లీ కథనంలో చలనం రాదు.

కామెడీ సినిమాగా మొదలై, ఇంటర్వెల్‌ దగ్గర థ్రిల్లర్‌గా మలుపు తీసుకున్న చిత్రం చివరకు రివెంజ్‌ డ్రామాగా ముగుస్తుంది. ఇన్ని జోనర్స్‌ని మిక్స్‌ చేయడమనేది కత్తి మీద సామే. రచయితగా అనుభవం గడించిన వెలిగొండ శ్రీనివాస్‌ ఒక మామూలు రివెంజ్‌ ప్లాట్‌కి ఆసక్తికరమైన ట్విస్టులతో కూడిన కమర్షియల్‌ ట్రీట్‌మెంట్‌ రాసుకున్నాడు. అయితే కీలకమైన తరుణంలో గ్రిప్పింగ్‌గా నడిపించాల్సిన చోట చేతులెత్తేసాడు. ప్రథమార్ధం వినోదాత్మకంగా సాగిపోయినప్పటికీ, ద్వితీయార్ధం మాత్రం భారంగా గడుస్తుంది. క్లయిమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్ట్‌తో ఒకింత ఉపశమనం లభించినా కానీ ముగింపు మళ్లీ రొటీన్‌గానే అనిపిస్తుంది.

స్టఫ్‌ వున్న మెటీరియల్‌ చేతిలో వున్నప్పటికీ గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే రాసుకోకపోవడం ఈ అంధగాడికి అవరోధంగా మారింది. అతి కీలకమైన విలన్‌ పాత్రని వీక్‌గా మార్చేయడం, కనీసం ఆ పాత్రకి బలమైన నటుడ్ని (రాజా రవీంద్ర) అయినా పెట్టుకోకపోవడంతో విలన్‌ వైపు నుంచి ఎలాంటి ఉత్కంఠ లేకుండా పోయింది. రివెంజ్‌కి కారణమైన విషయం కూడా పేలవంగా తెరకెక్కించడం వల్ల ఇంపాక్ట్‌ పూర్తిగా మిస్‌ అయింది. ఇదే కథ ఒక అనుభవజ్ఞుడైన చేతిలో పడితే మొత్తం సినిమా స్వరూపమే మారిపోయేది. రచయితగా నేర్పు చూపించిన వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకుడిగా ఒడుపు ప్రదర్శించలేక పోవడంతో అంధగాడు ఓ సగటు సినిమాగా మిగిలిపోయింది.

దర్శకత్వం, కథనం పరంగా వున్న లోపాలకి తోడు సంగీతం మరో పెద్ద బలహీనతగా మారింది. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలో వుండేటన్ని పాటలు పెట్టారు కానీ ఒక్క ట్యూన్‌ కూడా వినసొంపుగా లేదు. సంగీతం గోలగోలగా వుండడంతో పాటు విజువల్స్‌ కూడా పేలవంగా అనిపిస్తాయి. నిర్మాణ పరంగా ఎక్కడికక్కడ కాస్ట్‌ కంట్రోల్‌ ప్రదర్శించడం వల్ల విజువల్‌ అప్పీల్‌ మిస్‌ అయింది. సపోర్టింగ్‌ కాస్ట్‌ అంతా కూడా ఫేడవుట్‌ అయిన ఆర్టిస్టులే వుండడం మరో వీక్‌నెస్‌ అనిపిస్తుంది. ఎప్పుడూ ఫామ్‌లో వుండే రాజేంద్రప్రసాద్‌ ఇందులో చాలాసార్లు క్లూలెస్‌గా కనిపించారంటే అందుకు స్క్రీన్‌ప్లేనే తప్పుబట్టాలి.

రాజ్‌ తరుణ్‌ మరోసారి తన క్యాజువల్‌ నటనతో మెప్పించాడు. అంధుడి పాత్రలో అతని కామిక్‌ టైమింగ్‌ నవ్విస్తుంది. కామెడీ పరంగా సత్య నుంచి రాజ్‌ తరుణ్‌కి ఫుల్‌ సపోర్ట్‌ లభించింది. హెబ్బా పటేల్‌ ప్రతి సినిమాలో మాదిరిగానే భావ ప్రకటన కంటే సౌంజ్ఞలపై డిపెండ్‌ అయింది. ఇన్ని సినిమాల్లో నటించినా ఆమె నటనలో పరిణితి లేకపోవడం విచిత్రం. రాజా రవీంద్ర విలన్‌ పాత్రలో తేలిపోగా, ఆశిష్‌ విద్యార్థి రాక రాక వచ్చిన అవకాశమన్నట్టు కాస్త అతి చేసాడు. సయాజీ షిండేది కూడా రెగ్యులర్‌ క్యారెక్టర్‌, ఎలాంటి ప్రత్యేకత లేదు.

ఎంటర్‌టైనింగ్‌ ఫస్ట్‌ హాఫ్‌, ఇంటర్వెల్‌ సీన్‌, ప్రీ క్లయిమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ వల్ల 'అంధగాడు' కాలక్షేపానికి పనికొస్తుంది. కథాపరంగా ఒక మరపురాని ఎంటర్‌టైనర్‌ కాగల మేటర్‌ వున్నా కానీ బ్యాడ్‌ సెకండ్‌ హాఫ్‌ వల్ల యావరేజ్‌ సినిమాగా మిగిలింది. రాజ్‌ తరుణ్‌కి వున్న గుడ్‌విల్‌కి తోడు ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంది కనుక కమర్షియల్‌గా ఇది కూడా సేఫ్‌ ప్రాజెక్ట్‌ అవడానికి అవకాశముంది.

బాటమ్‌ లైన్‌: అంత లేదు!

– గణేష్‌ రావూరి