దర్శకుడు రాజమౌళి మే 28న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో పాల్గొన్నారు. బాహుబలి కథ గురించి ఆయన ప్రస్తావించిన కొన్ని అంశాలు, వాటిని చెప్పిన తీరు నన్ను ఆకట్టుకున్నాయి. బాహుబలి మొదటి భాగం విడుదలయ్యాక నేను కథకు సంబంధించి కొన్ని అంశాలను ఎత్తి చూపితే, పాఠకుల్లో కొందరు 'అవన్నీ రెండో భాగంలో తెలుస్తాయి. ఆర్నెల్లలో రెండో భాగం రాబోతోంది కదా. కాస్త ఆగలేరా?' అని మందలించారు. ఆర్నెల్లనుకున్నది ఇరవై నెలలైది. సాంకేతిక సమస్యలు మాత్రమే కారణం కాదు. 'మొదటి భాగానికి వచ్చిన స్పందనతో రెండో భాగం కథపై యింకా వర్క్ చేస్తున్నాం' అని విజయేంద్ర ప్రసాద్‌గారు చెప్పారు.
ఇప్పుడు రాజమౌళి ఇంటర్వ్యూ చూసినా అర్థమౌతుంది – ఇంత పెద్ద ప్రాజెక్టుకి కథ, సీన్లు, డైలాగులు 'లాక్' చేసుకోలేదనీ, మళ్లీ మళ్లీ వాటిపై వర్క్ చేశారనీ! ''శివగామి బాహుబలిని చంపాలనే నిర్ణయం తీసుకోవడం అంత పెద్ద ప్లే లేదు. నేను రెడీ చేసిన సీన్ చూసి మా పిల్లలు, వదిన, అన్నయ్య గొడవ చేశారు. శివగామి అలా ఎలా నిర్ణయం తీసుకుంటుంది? అని వాదించారు. ఒక మూడువారాలు షూటింగ్ ఆలస్యమైంది కూడా. బాహుబలిని చంపించడం రాజ్యానికి శ్రేయస్కరం అని నమ్మాలి. దాని కోసం మళ్లీ వర్క్ చేసి యిప్పుడున్న వెర్షన్ తీసుకొచ్చాం.'' అని రాజమౌళి చెప్పారు. సాధారణంగా దర్శకనిర్మాతలు మేం బౌండ్ స్క్రిప్టుతో షూటింగుకి వెళ్లాం అని చెప్తూ వుంటారు. కానీ రాజమౌళి నిజాయితీగా చెప్పారు – ఆ సీనును చిత్రీపట్టవలసి వచ్చింది అని.
నిజానికి కట్టప్ప బాహుబలిని చంపే సీను దర్శకుడిగా గుదిబండగా మారినట్లుంది. రాజమౌళే చెప్పారు – 'మొదటి సినిమా చివర్లో చిన్న ఝలక్‌లా వుండాలని, మొెదటి భాగానికి మంచి ఎండింగ్ వుంటే రెండో దానికి మంచి వెయిటింగ్ వుంటుందని అలా పెట్టాం, యింత ట్రెండ్ అవుతుందని వూహించలేదు' అని. జనాల ఫోకసంతా దానిపై పడేసరికి దాన్ని కన్విన్సింగ్‌గా ఎలా చెప్పాలా అని మల్లగుల్లాలు పడ్డారు.
ఆ సీనును మళ్లీ చెక్కియిప్పుడున్న ప్రకారం పెట్టినా రాజమౌళికి అంత తృప్తిగా లేదు. 'బాహుబలిని చంపడానికి శివగామి ఒప్పుకున్నపుడు ఎక్కువ డ్యూరేషన్ వుండాల్సింది. అలాగే బాహుబలిని చంపమని కట్టప్పతో శివగామి చెబితే అంత సులువుగా ఆయన ఒప్పుకోకూడదు. తల నేలకేసి బాదుకోవటమో, బతిమాలటమో.. యింకా ఏదో జరిగివుండాలి. అలాటి చోట్ల మరింత డ్రామా యాడ్ అవాల్సి వుంది.' అని చెప్పుకున్నారు.
ఈ అసంతృప్తికి కారణమేమిటంటే శివగామి పాత్ర, కట్టప్ప పాత్ర సరిగ్గా రూపొందకపోవడమని నా అభిప్రాయం. మొదటి భాగం చూస్తే శివగామి చాలా ఉదాత్తమైన పాత్రలా కనబడింది. దానికి తోడు బయట పబ్లిసిటీ చూసినా శివగామి అంటే అబ్బో అనిపించేసింది. 'మేం అలసిపోయి, నిరుత్సాహపడినపుడు శివగామి మాటలను గుర్తు చేసుకుని స్ఫూర్తి పొందేవాళ్లం' అని ఓ సారి రాజమౌళి చెప్పారు.
అంటే జీవితం గురించి, పోరాటం గురించి ఏవో కోటబుల్ కోట్స్ ఆవిడ చేత చెప్పించారు కాబోలు అనుకున్నాను. బాహుబలి కథను ఒకాయన ఇంగ్లీషులో నవల రాస్తూ దానికి 'ద రైజ్ ఆఫ్ శివగామి' అని పేరు పెట్టారని చదివాను. ఇవన్నీ చూసి రాజమాతగా శివగామిని చాలా ఉన్నతంగా వూహించుకున్నాను. నాకు తెలిసి ''రాజమకుటం''లో కన్నాంబ వేసిన రాజమాత పాత్ర అల్టిమేట్. శివగామిని కూడా ఆ లెవెల్లో తీర్చిదిద్దారనుకున్నాను.
కానీ రెండో భాగంలో శివగామిని చూసి కన్‌ఫ్యూజ్ అయిపోయాను. దేవసేనను తన కోడలిగా నిర్ణయించే విషయంలో తొందరపాటు, అహంకారం, మూర్ఖత్వం కనబడ్డాయి. తన కొడుకు చిత్రపటం పంపలేదు, అతని గుణగణాలు వల్లింపచేసి పెళ్లికూతుర్ని మెప్పించలేదు, పెళ్లి సంబంధాలు కలిపే బ్రాహ్మణుడు (అశోక్ కుమార్ వేసిన పాత్ర), రాజబంధువులనో పంపలేదు, నగలు పట్టుకెళ్లిన సైనికాధికారితో బాటు పెళ్లికూతురు పల్లకీ ఎక్కి వచ్చేయాలనుకుంది. దేవసేన ఆస్థానానికి వచ్చాక జరిగిన పొరపాటు తెలిసింది. నాలిక కరుచుకోకపోగా తన పొరపాటు ఎత్తి చూపించినందుకు అనూష్కపై పగ బట్టింది.
ఆమెను చేసుకుంటే రాజువి కాలేవని ప్రభాస్‌ను బెదిరించింది. మొదటి భాగం క్లయిమాక్స్‌లో విలన్‌ను భల్లాలుడే చంపినా, 'ప్రజాక్షేమం కోసం ఆలోచించాడు కాబట్టి..' అంటూ బాహుబలికి పట్టం కడతానని చెప్పిన వివేకం అప్పుడేమైందో తెలియదు. వాడు తన మాట వినలేదు, తీసిపారేయ్.. అంతే, ప్రజాక్షేమం, మరోటీ జాన్తానై. ప్రజలు ఎంతమంది చచ్చినా ఫర్వాలేదని అనుకున్న భల్లాలుడికి పట్టం కడతానంది. సింహాసనం ఎక్కబోయే ముందు ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవాలంటూ బాహుబలిని దేశాటనపై పంపింది కదా, భల్లాలుడికి ఆ రూలు ఎత్తివేసింది. తన మాట వినని బాహుబలికి బుద్ధి చెప్పాలన్న కసి తప్ప మరేమీ కనబడలేదు.
తనిచ్చిన మాటకు కట్టుబడి బాహుబలి సింహాసనం వదులుకున్నాడు. సైన్యాధిపతి ఉద్యోగం ఆమోదించాడు. స్తన్యమిచ్చి పెంచిన పెంపుడు కొడుకుపై శివగామిలో కొన్ని రోజులకైనా మమత మేలుకొనాలి కదా, తండ్రి కాబోతున్న అతన్ని, గర్భవతి ఐన అతని భార్యను చూడాలనిపించాలి కదా. ('బాహుబలి, భల్లాల దేవుడి మధ్య ఏ సీన్ పెట్టినా బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యేది, పెట్టడానికి కుదరలేదు' అని రాజమౌళి వాపోయారు. అహంకారానికి, మమకారానికి మధ్య శివగామి నలిగే సీన్లు పెట్టి వుంటే యింకా బాగా వర్కవుట్ అయ్యేదని నేను అనుకుంటున్నాను). అదేమీ జరగలేదు.
సీమంతం నాడు వచ్చి అక్షింతలు యించుమించుగా విసిరేసి, దేవసేనను రెచ్చగొట్టింది. తన కళ్లెదురుగా భల్లాలుడు బాహుబలి ఉద్యోగం పీకేసినా చూస్తూ వూరుకుంది. బాహుబలి వంటి బలశాలి, నమ్మకస్తుడు తన కొడుక్కి రక్షణగా వుంటే మంచిదని కూడా ఆమెకు తోచలేదు. గర్భవతి ఐన తన కోడలిపై చెయ్యి వేయబోయాడన్న అభియోగం ఎదుర్కున్న సేనాపతిపై కోపమూ రాలేదు. పెంపుడు కొడుకు, అతని గర్భవతి భార్య కోట బయటకు వెళ్లి సాధారణ మనుష్యుల్లా బతుకుతూంటే వెళ్లి పలకరించాలనీ అనుకోలేదు. బాహుబలిపై చాడీలు వినబడినపుడు వాటి నిజానిజాలు గూఢచారుల ద్వారా తెలుసుకోవాలనుకోలేదు.
పాత జానపద సినిమాల్లో తలతిక్క, అవకతవక రాజుల పాత్రలుండేవి. ఎవరేం చెప్పినా చటుక్కున నమ్మేయడం, అహంభావంతో ప్రతిభావంతులను అనుమానించడం, అవమానించడం వంటి పనులు చేసేవారు. అవి సియస్సార్ వంటి నటులు కాస్త హాస్యాన్ని రంగరించి పోషించేవారు. శివగామిది కూడా అలాటి పాత్రే. అయితే ఆమెను సీరియస్‌గా, దర్పంగా చూపించబోయారు. అది అతకలేదు. మొదటిభాగంలో చూపిన శివగామిని చూసి, బాహుబలిని ఎలా చంపమంటుంది అని రాజమౌళి కుటుంబసభ్యులు ఆశ్చర్యపడి వుండవచ్చు. కానీ రెండో భాగం సాంతం చూసి వుంటే తన మాట చెల్లలేదనే తిక్కకోపంలో ఆమె అలా చెప్పినా చెప్పి వుండవచ్చు అని సర్దుకునేవారు.
ఇక కట్టప్ప కారెక్టరులో కూడా కాస్త గందరగోళం వుంది. బాహుబలిని చంపడానికి ఒప్పుకున్నవాడు డైరక్టుగా చంపకుండా తనను తాను గొలుసులతో కట్టేయించుకుని నిప్పుల్లో పడిపోయి డ్రామా అడి బాహుబలిని రప్పించడం దేనికి? కట్టప్ప మహావీరుడు కదా, బాహుబలిని ట్రాప్ చేసి, మోసం చేసి చంపాడని చూపిస్తే అతని కారెక్టరు దిగజారదా? రాజద్రోహ నేరం కింద కట్టప్పను శిక్షిస్తున్నారంటే అది బహిరంగ విచారణ అయి వుంటుంది తప్ప అర్ధరాత్రి ప్రయివేటుగా అమలు కాదన్న ఆలోచన కూడా బాహుబలికి రాలేదు. అక్కడికి వచ్చిపడ్డాడు.
హఠాత్తుగా ఎక్కణ్నుంచో ఎవరో గాని వచ్చిపడ్డారు. కాలకేయులేమో అనుకుంటే, 'అబ్బే, కట్టప్పను నమ్మబుద్ధి కాక భల్లాలుడు మారువేషాల్తో పంపిన సైనికులు అయివుంటారు. అక్కడ డైలాగులు చూస్తే అదే తోస్తోంది. వాళ్లే బాణాలతో బాహుబలిని సగం చంపి కట్టప్ప ఒక్క పోటు పొడిస్తే బాహుబలి కూలే సదుపాయం ఏర్పరచారు' అన్నారు ఓ మిత్రులు. కావచ్చు. వచ్చినవాళ్లు ఎవరైనా కానీయండి, బాణసంచా కాల్చి కట్టప్ప బాహుబలిని సిల్‌హౌట్‌లో చంపడానికి ఎఱ్ఱ బ్యాక్‌డ్రాప్ క్రియేట్ చేసి వెళ్లారు.
కట్టప్ప సింహాసనంపై ఎవరుంటే వారికి విశ్వసనీయుణ్ని అంటాడు. మరి శివగామి మహేంద్ర బాహుబలిని రాజుగా (మాహిష్మతీ పాలకుణ్ని ఓసారి మహారాజు అంటున్నారు, మరోసారి చక్రవర్తి అంటున్నారు, ఎప్పుడేమన్నారో మర్చిపోయాను) ప్రకటించాక కట్టప్ప వెంటనే భల్లాలుణ్ని రాజుగా తిరస్కరించాలి. మహేంద్ర బాహుబలిని కాపాడడానికి ప్రయత్నించాలి. అతని తరఫున రాజమాత 'దేవసేనను కాపాడు' అంది కాబట్టి కనీసం దేవసేననైనా కాపాడాలి.
మహేంద్ర బాహుబలి చనిపోయాడనుకుంటే అప్పుడు రాజమాతగా దేవసేన ఆటోమెటిక్‌గా శివగామి స్థానంలోకి వచ్చేస్తుంది. అలాటామెను రాజ్యాధికారం పోగొట్టుకున్న భల్లాలుడు బందీ చేస్తే వూరుకోకూడదు. తిరగబడాలి. పోనీ భల్లాలుణ్ని రాజుగా అంగీకరించాడనుకుంటే మొదటి భాగంలో దేవసేనను తప్పిస్తానని అనడం తప్పు. తిరస్కరించి దేవసేన తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది.
సినిమా రెండో భాగంలో దేవసేన, అమరేంద్ర బాహుబలి పాత్రలు చాలా బాగా మలిచారు. పాత్రధారులు కూడా అద్భుతంగా చేశారు. దేవసేన పాత్ర ద్వారా పలికించిన సంభాషణలు కూడా చాలా బాగున్నాయి. మాహిష్మతీ రాజ్యం గొప్పేమిటి అని దేవసేన అడగడం నాకూ నచ్చింది. పెద్దపెద్ద విగ్రహాలు పెట్టుకున్నంత మాత్రాన గొప్పవాళ్లయిపోతారా? ఏకపక్షంగా వ్యవహరించే యీ రాజ్యం ఎందులో గొప్ప? అని ప్రేక్షకుడి మనసులో మాట దేవసేన పలికింది. 'నా మాటే శాసనం' అంటూ శివగామి చలాయించిన నియంతృత్వమే అన్ని అనర్థాలకు కారణమైంది. ఇలాటి మాహిష్మతీ రాజ్యం గురించి బాహుబలి 'జై మాహిష్మతి' అని ఎందుకంటాడో తెలియదు. చివర్లో చిన్న బాహుబలి చేత కూడా 'నా మాటే శాసనం' అనిపించారు. మరో ఏకపక్ష పాలన షురూ అన్నమాట!
రెండో భాగం మొదటి భాగం కంటె చాలా విషయాల్లో మెరుగ్గా వుంది. కొన్ని చోట్ల ఎమోషన్స్ పండాయి. నా ఉద్దేశంలో 20% ఎక్కువ మార్కులు వేయవచ్చు. రెండింటిని కలిపి కథ సరిసమానంగా సర్ది వుంటే బాగుండేది. యుద్ధాలు తగ్గించి రెండు యింటర్వెల్స్‌తో 18 రీళ్ల సినిమా తీసి వుంటే చక్కగా వుండేది. స్క్రిప్ట్ రాసుకున్నపుడు చాలా డ్రమటిక్ సీన్లు వున్నాయట. కానీ వాటిని సినిమాలో పెట్టేందుకు కుదరలేదని రాజమౌళి చెప్పారు. దాంతో అనేక సీన్లు ఫాస్ట్‌ఫాస్ట్‌గా వెళ్లిపోయాయని ఆయనే ఒప్పుకున్నారు. నాకూ అదే అనిపించింది. మొదటి భాగం తాపీ, రెండో భాగం ఆదుర్దాలా తోచింది.
రెండో భాగంలో ప్రధానమైన ట్విస్టు శివగామి పంపిన సందేశం వలన ఏర్పడిన కమ్యూనికేషన్ గ్యాప్! సందేశం పంపినపుడు మా అబ్బాయికి చేసుకుందా మనుకుంటున్నాం అని చెప్పి వూరుకుంటారా? 'మా వాడు వీరుడు, శూరుడు, ఘనమైన మాహిష్మతీ రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడు..' అంటూ బిరుదులతో సహా పేరు చెప్పరా? ఎంత అందగాడో చూడండి అంటూ ఓ చిత్రపటం పంపరా? 40, 50 ఏళ్ల క్రితం అరవ సినిమాల్లో యిలాటి ట్విస్టులే పెట్టేవారు.
ఇంటి పక్కాయన వచ్చి అగ్గిపెట్టె అడుగుతూంటే, సంభాషణలో 'మీరడిగింది తప్పకుండా యిస్తాను' అనే ఒక్క వాక్యం మాత్రం చాటుగా కిటికీలోంచి విని అపార్థం చేసుకుని, భార్యను అనుమానించి యిల్లు వదిలి వెళ్లిపోయే హీరోలుండేవారు. ఆ తర్వాత ముస్లిము సోషల్స్‌లో హీరోయిన్ వేసుకున్న బురఖా వలన జరిగే కన్‌ఫ్యూజన్లు చూపించేవారు. బురఖా కారణంగా ఒకరనుకుని మరొకర్ని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత చింతించడం వుండేది. సినిమాలకు యింత వయసు వచ్చాక, బాహుబలి వంటి పెద్ద ప్రాజెక్టులో పెళ్లికొడుకు పేరు చెప్పకపోవడం అనే చిన్న అంశంపై మొత్తం డ్రామా ఆధారపడడం వింతగా వుంది.
నా అనుమానం – విజువల్‌గా బాగుంటాయని కొన్ని సీన్లు ముందుగానే అనుకుని, వాటి చుట్టూ సంఘటనలు అల్లి, ఆ డాట్స్ కలిపి కథ అల్లారని. దాంతో కొన్ని పాత్రలకు అన్యాయం జరిగింది. అలాటి వాటిల్లో భల్లాలదేవుడి కొడుకు పాత్ర ఒకటి. అతను లేకపోయినా నష్టమేముందనిపించింది. అలాగే అవంతిక పాత్ర రెండో భాగంలో జూనియర్ ఆర్టిస్టు కంటె కనాకష్టంగా అయిపోయింది. ధీరోచితంగా మూడేసి బాణాలు ఒక్కసారి వేసిన దేవసేన క్లయిమాక్స్‌లో నిస్సహాయురాలిగా రథంలో పడివుండడమూ చిత్రంగా వుంది. కనీసం పెనుగులాడి వుండాల్సింది.
నెత్తిమీద నిప్పుల కుంపటి వ్రతం విషయానికి వస్తే శివగామి చాలా దూరం నడిచినట్లు చూపారు. దేవసేనకు వచ్చేసరికి కోటలోనే అక్కడక్కడే తిరిగినట్లు చూపారు. అంటే ఆ గుడి ఏదో దగ్గరకు వచ్చేసిందా? ఆ నిప్పులను హోమగుండంలో బదులు తనను బందీగా వుంచిన గోతిలో పోసిందా? అర్థం కాలేదు. బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబడుతూ వేల కోట్లు సంపాదిస్తోంది. చూడడానికి భారీగా, అందంగా వుంది. తీసినవాడు తెలుగువాడే. అయినా కథ, సీన్లు విషయంలో ఒక సగటు ప్రేక్షకుడిగా నాకు అసంతృప్తి వుంది. చిత్రాన్ని రూపొందించిన రాజమౌళికీ వుంది. ఆ విషయాన్ని బయటకు చెప్పిన ఆయన నిజాయితీ అభినందనీయం.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]