బాలీవుడ్ క్లబ్బులు.. వాటి వెనక కథలు

ఒకప్పుడు వంద కోట్లు అంటే చాలా గొప్ప. ఆ తర్వాత చిన్నాచితకా సినిమాలకు కూడా వంద కోట్ల వసూళ్లు రావడం కామన్ అయిపోయాయి. తర్వాత 200 కోట్లు క్లబ్ క్రియేట్ అయింది. ప్రస్తుతానికి బాలీవుడ్…

ఒకప్పుడు వంద కోట్లు అంటే చాలా గొప్ప. ఆ తర్వాత చిన్నాచితకా సినిమాలకు కూడా వంద కోట్ల వసూళ్లు రావడం కామన్ అయిపోయాయి. తర్వాత 200 కోట్లు క్లబ్ క్రియేట్ అయింది. ప్రస్తుతానికి బాలీవుడ్ లో ఈ క్లబ్ కు మంచి డిమాండ్ ఉంది. 300 కోట్ల క్లబ్ కూడా సీన్ లో ఉన్నప్పటికీ.. ఎక్కువ హిందీ సినిమాలు దీన్ని టార్గెట్ చేయవు. అయితే ఈ క్లబ్స్ ను సృష్టించిన మొట్టమొదటి సినిమాలేంటో చూద్దాం.

బాలీవుడ్ లో ప్రస్తుతం వంద కోట్ల క్లబ్ లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 54 సినిమాలున్నాయి. వీటిలో అత్యధికం సల్మాన్, షారూక్, హృతిక్ నటించిన సినిమాలే. ప్రస్తుతం ఓ మోస్తరు హైప్ తో వస్తున్న ప్రతి బాలీవుడ్ సినిమాకు ఇప్పుడు అవలీలగా వంద కోట్ల రూపాయలు వస్తున్నాయి. అయితే ఈ క్లబ్ ను మొదట క్రియేట్ చేసిన సినిమా గజనీ. అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీతోనే బాలీవుడ్ కు వందకోట్ల వసూళ్లు తెలిసొచ్చాయి.

వంద కోట్ల వసూళ్ల నుంచి 200 కోట్లకు వెళ్లడానికి పెద్ద టైం తీసుకోలేదు బాలీవుడ్. కేవలం ఏడాదిలోనే ఈ క్లబ్ క్రియేట్ అయింది. ఈసారి కూడా అమీర్ ఖాన్ చిత్రానికే ఆ ఘనత దక్కింది. అమీర్ నటించిన త్రీ-ఇడియట్స్ మూవీ 200 కోట్ల రూపాయల వసూళ్లతో ఈ క్లబ్ ను స్టార్ట్ చేసింది. దేశవ్యాప్త వసూళ్లలో 2వందల కోట్ల రూపాయల నెట్ సాధించిన సినిమాలు ప్రస్తుతం 12 మాత్రమే ఉన్నాయి.

ఇక 300 కోట్ల క్లబ్ ను క్రియేట్ చేసిన క్రెడిట్ కూడా అమీర్ కే దక్కింది. పీకే ఈ సినిమాతో బాలీవుడ్ లో ఈ క్లబ్ ప్రారంభమైంది. అయితే 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల వసూళ్లకు చేరడానికి బాలీవుడ్ కు ఐదేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం డొమస్టిక్ కలెక్షన్లతో 300 కోట్ల క్లబ్ లో కొనసాగుతున్న సినిమాలు 5 మాత్రమే. అమీర్ నటించిన పీకే, దంగల్ తో పాటు సల్మాన్ నటించిన సుల్తాన్, భజరంగీ భాయ్ జాన్ సినిమాలున్నాయి. వీటితో పాటు బాహుబలి-2 సినిమా ఈ క్లబ్ లో కొనసాగుతోంది.

బాలీవుడ్ లోకి బాహుబలి-2 రాకతో 400 కోట్లు, 500 కోట్ల క్లబ్స్ కూడా ఏర్పడ్డాయి. వీటిల్లో ప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ సినిమా మాత్రమే ఉంది. ఒకే ఏడాదిలో, అది కూడా ఒకే సీజన్ లో ఈ రెండు క్లబ్స్ ను స్టార్ట్ చేసింది బాహుబలి-2 సినిమా. వీటిలో 400 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యే సత్తా అమీర్, సల్మాన్ లాంటి హీరోలకు ఉందేమో కానీ.. 500కోట్ల రూపాయల మార్క్ ను అందుకోవడం మాత్రం ఇప్పట్లో కష్టం అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్.