బయోపిక్, అందులోనూ మహానటి సావిత్రిపై. ఇలా స్టార్ట్ చేసారో లేదో రెండో ఫోటోలు బయటకు వచ్చేసాయి. సావిత్రి గెటప్ లో హీరోయిన్ కీర్తి సురేష్ ఎలా వుండబోతోందో అన్నది ఇప్పుడు బయటకు తెలిసిపోయింది. రెండు జడలతో, గుండ్రటి ఫేస్ కట్ తో అమాయకంగా కనిపించింది కీర్తి సురేష్.
కానీ అలనాటి సావిత్రిని గుర్తు చేసే రేంజ్ లో కానీ, ఆ అందం కానీ, ఆ గ్రేస్ కానీ అస్సలు కనిపించలేదని గుసగుసలు మొదలయ్యాయి. మరోపక్క ఆ సినిమాలో సమంత జర్నలిస్ట్ క్యారెక్టర్ వేస్తోందన్నారు. కానీ కాదు, నిండుగా నగలు, మేకప్ తో ఇలా వుంటుది అంటూ మరో స్టిల్ బయటకు వచ్చింది.
దాంతో సమంత క్యారెక్టర్ ఏమిటీ అంటూ అనుమానాలు, ఆరాలు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి సినిమా డైరక్టర్ నాగ్ అశ్విన్ కు చికాకు పుట్టించినట్లు తెలుస్తోంది. అసలు ఎవరు లీక్ చేసారు? ఎక్కడి నుంచి లీక్ అయ్యాయి అన్నది ఆరా తీసినట్లు వినికిడి.
ఒక పక్క కావాలనే డైరక్టర్ నే తెలివిగా ఫోటోలు లీక్ చేసారని ఓ పాయింట్ వినవస్తోంది. మరో పక్క, తన గెటప్ ఎలా వుందంటూ కీర్తి తన సన్నిహితులకు ఫోటో పంపడం ద్వారా లీక్ అయిందని యూనిట్ అంటోంది.
కానీ ఎలా లీక్ అయినా, కీర్తి సురేష్ గెటప్, సావిత్రిగా అంత ఆకట్టుకునేలా లేదన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపించడంతో, అనవసరమైన లీకుల గొడవ అని డైరక్టర్ బాధపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.