కోహ్లీ వర్సెస్‌ కుంబ్లే: క్రికెట్‌ రాజకీయమిదే!

క్రికెట్‌లోనూ రాజకీయం వుంటుంది. మన ఇండియాలో అంతే. రాజకీయం సర్వాంతర్యామి. ఇండియన్‌ క్రికెట్‌ని రాజకీయ జాడ్యం ఎప్పుడో పట్టేసుకుంది. అప్పుడప్పుడూ జూలు విదుల్చుతుందంతే. ఆ రాజకీయమే క్రికెటర్లని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వీరుల్లా కూడా మార్చేస్తుంది.…

క్రికెట్‌లోనూ రాజకీయం వుంటుంది. మన ఇండియాలో అంతే. రాజకీయం సర్వాంతర్యామి. ఇండియన్‌ క్రికెట్‌ని రాజకీయ జాడ్యం ఎప్పుడో పట్టేసుకుంది. అప్పుడప్పుడూ జూలు విదుల్చుతుందంతే. ఆ రాజకీయమే క్రికెటర్లని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వీరుల్లా కూడా మార్చేస్తుంది. జట్టులో ఆకాశానికెత్తేస్తుంది.. అంతే వేగంగా, క్రికెట్‌ లెజెండ్స్‌ని కూడా వెర్రి వెంగళప్పల్ని చేసేస్తుంటుంది. 

కపిల్‌దేవ్‌, సునీల్‌ గవాస్కర్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ, సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, ధోనీ.. ఇలా ఈ రాజకీయానికి ఎవరూ అతీతులు కారు. చాలావరకు ఈ రాజకీయంలో బాధితులుంటారు. అదే సమయంలో, బాధితులు సైతం రాజకీయాలు చేసేస్తుంటారు. అదే క్రికెట్‌ రాజకీయంలో అతి పెద్ద వింత. 

మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే, టీమిండియాకి కోచ్‌ అయ్యాడనగానే ఎగిరి గంతేశారంతా. 'క్రికెట్‌కి పెద్దన్న' అనే గుర్తింపు సంపాదించుకున్నాడు కుంబ్లే ఒకప్పుడు. జట్టులో సీనియర్లకీ, జూనియర్లకీ మధ్య 'సమన్వ్యకర్త'గా వ్యవహరించడంలో కుంబ్లే చూపిన చొరవని అప్పట్లో అంతా అభినందించేవారు. ఓ వైపు జట్టులో కీలకమైన బౌలర్‌ అనే బాధ్యత, ఇంకోపక్క సమన్వయకర్త.. ఇలా రెండు పాత్రల్లో కుంబ్లే ఒదిగిపోయిన తీరు అద్భుతం. 

కానీ, ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌ కోహ్లీకీ, కోచ్‌ కుంబ్లేకీ మధ్య వివాదం షురూ అయ్యింది. కుంబ్లే నిర్ణయాలు కోహ్లీకి నచ్చడంలేదు. కారణం కోహ్లీ దూకుడు వ్యవహారమే. అన్ని వేళలా ఆ దూకుడు పనికిరాదన్నది కుంబ్లే వాదన. కుంబ్లేని కోహ్లీ ఎదిరించడానికి బిసిసిఐ పెద్దల నుంచి మద్దతు వుండదని ఎలా అనుకోగలం.? 

కుక్కని చంపెయ్యాలంటే, దాని మీద పిచ్చిదనే ముద్ర వేసెయ్యాలి. ఇక్కడ వ్యవహారం కుక్కని చంపడంతో పోల్చకూడదుగానీ.. పరిస్థితి అలాగే తయారయ్యింది. కుంబ్లేని తప్పించడానికి, కెప్టెన్‌తో గొడవలు అనే సాకు చూపిస్తోంది బీసీసీఐ. లెజెండ్‌ కేటగిరీలోకి చేరే కుంబ్లే లాంటి వ్యక్తికి ఇది అత్యంత ఘోరమైన అవమానం. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాసరే, ఈ దిక్కుమాలిన రాజకీయ జాడ్యం మాత్రం బీసీసీఐని వదలకపోవడం శోచనీయం.