రాజమౌళి తదుపరి చిత్రాన్ని నిర్మాత డి.వి.వి. దానయ్యకి చెయ్యబోతున్నాడు. ఎప్పుడో దానయ్యకి కమిట్మెంట్ ఇవ్వడం వల్ల అది పూర్తి చేసే పనిలో రాజమౌళి వున్నాడు. అయితే నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలనేది రాజమౌళి ఇంకా డిసైడ్ అవలేదు. గ్రాఫిక్స్ అవసరం లేని చిత్రం చేస్తానని మీడియాతో చెప్పాడు కానీ ఇంకా దానిపై రాజమౌళికి క్లారిటీ లేదు.
అలాగే ఈ చిత్రం ఎవరితో చేయాలనేది కూడా రాజమౌళి ఫిక్స్ అవలేదు. కథకి అనుగుణంగా హీరో ఎవరనేది ఫిక్స్ అయ్యే స్వతంత్రం తనకి వుంది కానీ వారి డేట్స్ సంపాదించడం దానయ్యకి కుదురుతుందా లేదా అనేది చూడాలి. దానయ్య దగ్గర ప్రస్తుతం ముగ్గురు హీరోల డేట్స్ వున్నాయి.
మహేష్, ఎన్టీఆర్, అఖిల్‌తో దానయ్యకి కమిట్మెంట్స్ వున్నట్టు సమాచారం. మరి ఈ ముగ్గురిలో ఎవరినైనా రాజమౌళి ఎంచుకుంటాడా లేక వేరే హీరోతో వెళతాడా? మహేష్, ఎన్టీఆర్ ఇద్దరికీ మాట ఇచ్చిన రాజమౌళికి అది నిలబెట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. అఖిల్‌తో కూడా అవకాశాలు లేకపోలేదని మరికొందరి ప్రచారం. ఏదేమైనా రాజమౌళి నెక్స్ట్ ఎవరితో అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.