'బాహుబలి' విజయంపై స్పందించడానికి చాలా సమయం తీసుకున్న బాలీవుడ్ ఖాన్ త్రయం అంతా దాని గురించి మీడియాతో మాట్లాడారు. ముగ్గురూ ఈ చిత్రాన్ని ఇంతవరకు చూడకపోవడం విశేషం. కాకపోతే అది ఎంతటి విజయం సాధించిందనేది మాత్రం తెలుసుకున్నారు. అది చాలా గొప్ప విషయమంటూ పొగిడారు.
ఈ సందర్భంగా 'బాహుబలి 2' రికార్డులని త్వరలో రాబోతున్న 'ట్యూబ్‌లైట్' కొడుతుందా అని సల్మాన్ ఖాన్ని అడిగితే, ఏ సినిమాకి ఎలాంటి రాత రాసి పెట్టి వుందనేది మనకి తెలియదని, అది విడుదలైన తర్వాతే తెలుస్తుందని అన్నాడు. బాహుబలి 1 తర్వాత 'బజరంగి భాయ్‌జాన్' వచ్చి ఘన విజయం సాధించిందని, ఈసారి 'బాహుబలి 2' తర్వాత 'ట్యూబ్‌లైట్' వచ్చి ఎలా వెలుగుతుందో చూద్దామని అన్నాడు.
'బాహుబలి 2' సాధించిన వసూళ్లని సల్మాన్ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ సినిమాకి పదిహేను వందల కోట్ల వసూళ్లు వచ్చాయని మీడియా ప్రతినిధి అడిగితే, ''వాళ్లు నాలుగేళ్లు ఆ సినిమా తీసారు. నేను ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాను. నాలుగేళ్లలో నేను చేసిన అన్ని సినిమాల గ్రాస్ కలుపుకుంటే అంతకు తక్కువేంవుండదుగా'' అంటూ నవ్వేసాడు. సల్మాన్ జోక్ వేసినా కానీ బాహుబలిని బాలీవుడ్ సీరియస్‌గా తీసుకుందని వారు అనౌన్స్ చేస్తోన్న ప్రాజెక్టులే చెబుతున్నాయి.