రివ్యూ: రారండోయ్.. వేడుక చూద్దాం
రేటింగ్: 3/5
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
తారాగణం: నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్ రాజ్, కౌసల్య, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సురేఖావాణి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, పృధ్వీ తదితరులు
కథనం: సత్యానంద్
కూర్పు: గౌతంరాజు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఛాయాగ్రహణం: ఎస్.వి. విశ్వేశ్వర్
నిర్మాత: నాగార్జున అక్కినేని
కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల
విడుదల తేదీ: మే 26, 2017
'బంగార్రాజు' క్యారెక్టర్‌తో ఒక మామూలు కథని బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌గా మలచిన కళ్యాణ్‌కృష్ణ కురసాల మరోసారి తనలోని రైటింగ్ టాలెంట్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'లో చూపించాడు. ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్‌తో సగటు కథని అలరించే సినిమాగా మలచవచ్చునని రుజువు చేసాడు. 'సోగ్గాడే చిన్నినాయనా'లో బంగార్రాజు అయితే, 'రారండోయ్ వేడుక చూద్దాం'లో భ్రమరాంబ… ఈ పాత్ర చుట్టే ఈ కథంతా నడుస్తుంది.
''నీకోసం రాజకుమారుడు లాంటి వరుడు వస్తాడు. ఆకాశం నుంచి దిగొస్తాడు'' అంటూ బామ్మ నూరిపోసేసరికి అలాంటి రాజకుమారుడు ఎక్కడో ఆకాశంలోంచి దిగి వస్తాడని ఎదురు చూస్తుంటుంది. కారులో తన ముందే పెళ్లికొడుకు వేషంలో ఎప్పుడో దిగిపోయాడని గుర్తించలేకపోతుంది. భ్రమరాంబ(రకుల్) లాంటి పెంకి, మొండిఘటాన్ని అంత తేలిగ్గా తన వైపు తిప్పుకోలేనని తెలిసి శివ(నాగచైతన్య) ఓపిగ్గా ఎదురు చూస్తుంటాడు. తనకి తగ్గ వాడినని అనిపించుకోవడానికి ఎన్ని చేస్తున్నా భ్రమరాంబ మాత్రం అతడిని 'ఆర్డనరీ' అనేస్తుంది. అతడిపై ప్రేమ గుర్తించే సరికి తన తండ్రికి(సంపత్ రాజ్) శివ తండ్రితో(జగపతిబాబు) వున్న పాతికేళ్ల వైరం అడ్డొస్తుంది.
కథగా చెప్పుకుంటే గోదావరి తీరమంత పాత ఇతివృత్తం. బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల పిల్లలు ప్రేమలో పడతారు. ఆ సమస్యని వారు ఎలా అధిగమిస్తారు అనేదే కథ. చాలా మామూలు ప్లాట్ అయినప్పటికీ కథానాయిక క్యారెక్టరైజేషన్‌తో దీనికి కొత్త యాంగిల్ వచ్చింది. తన కష్టంలో, తన కాలక్షేపంలో, తన భయంలో, తన ఆనందంలో అన్నిట్లోను కథానాయకుడినే గుర్తు చేసుకుని, అన్నిటికీ అతడి సహచర్యమే ఆమె కోరుకుంటుంది. కానీ ఆ ఫీలింగ్ ఏమిటి, అతనితో తన బంధమేంటి అనేది గుర్తించలేకపోతుంది. ఈ క్యారెక్టర్ వల్ల, తన ప్రవర్తన వల్ల ఈ కథ ఆసక్తికరంగా మారడమే కాకుండా వినోదాన్ని కూడా పంచుతుంది. అలాగే హీరోకీ, అతని తండ్రికీ, హీరోయిన్‌కీ, ఆమె తండ్రికీ మధ్య రిలేషన్‌ని కూడా దర్శకుడు బాగా ఎస్టాబ్లిష్ చేసి వారి మధ్య మంచి సన్నివేశాలు రాసుకున్నాడు.
భావోద్వేగాలు సరిగ్గా పండితే ఎంత పాత కథ అయినా రసవత్తరంగా మారుతుంది. భావోద్వేగాలని సరిగ్గా పండించడంలో, తెరపై కదిలే పాత్రలతో చూసే ప్రేక్షకులు రిలేట్ అయ్యేట్టు చేయడంలోనే దర్శకుడి విజయం దాగి వుంటుంది. అంతెందుకు… కథగా చెప్పుకుంటే బాహుబలిలో ఏముందని? ఎమోషనల్ కనక్ట్ ఏర్పరిచి, పాత కథనే చెప్పినా అది ఇంకోసారి రంజింపజేస్తుంది. కథలో ఎంత కొత్తదనం వున్నా, ఎంచుకున్న ఇతివృత్తం ఎంత పాతదైనా బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ మారవు కనుక వాటి పరంగా లోటు రాకుండా చూసుకుంటే సరిపోతుంది. కళ్యాణ్‌కృష్ణ ఈ కిటుకు బాగానే పట్టేసాడు.
పెళ్లి నేపథ్యంలో మొదలయ్యే కథ చాలా నీరసంగా ముందుకి కదులుతుంది. పెళ్లి బ్యాక్‌డ్రాప్ పేరుతో చాలా పాత్రలని ప్రవేశపెట్టినా ఆ కామెడీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. భ్రమరాంబ సిటీకి షిఫ్ట్ అయిన తర్వాతే కదలిక వస్తుంది. ''నువ్వు నన్ను ప్రేమిస్తున్నానంటే ఇప్పుడే చెప్పేయ్. నిన్ను మళ్లీ కలవను, మాట్లాడను'' అని ఖచ్చితంగా చెప్పేసిన అమ్మాయి మనసుని హీరో ఎలా గెలుచుకుంటాడనేది మెయిన్ ప్లాట్. భ్రమరాంబ-శివ మధ్య సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఆధునిక భావాలంటూ ప్రేమకథలని ఆర్టిఫిషియల్‌గా మార్చేస్తోన్న ఈ రోజుల్లో గ్రౌండెడ్‌గా, డీప్‌గా వున్న రొమాన్స్ రాయడంలోనే దర్శకుడి మెచ్యూరిటీ తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులకి నచ్చే సినిమాలు, మన మూలాలని గుర్తు చేసే కథలు కళ్యాణ్‌కృష్ణ నుంచి మరిన్ని ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు అనిపిస్తుంది. ముఖ్యంగా కథలోని చివరి ఘట్టంలో అతను భావోద్వేగాలని పండించిన తీరు విశేషంగా మెప్పిస్తుంది. ద్వితియార్ధంలో ఎమోషన్స్‌ని బాగా పండించిన దర్శకుడు ఎందుకో ప్రథమార్ధంలో అదే గ్రిప్ చూపించలేకపోయాడు.
నాగచైతన్య ప్రతి సినిమాకీ రాటుదేలుతున్నాడు. అతడు నటుడిగా ఎంత ఓపెన్ అయ్యాడో, ఎంత ఈజ్ వచ్చిందో చెప్పడానికి బ్రేక్‌అప్ సీన్ చక్కని ఉదాహరణ. ఇది చైతన్య కెరీర్‌లోనే బెస్ట్ సీన్ అని చెప్పవచ్చు. ఫుల్ కాన్ఫిడెన్స్‌తో, ఏమాత్రం తడబాటు లేకుండా ఆ సీన్‌ని రక్తి కట్టించాడు. ఈ సినిమా పూర్తిగా భ్రమరాంబ పాత్ర చేసిన రకుల్ ప్రీత్ సింగ్‌ది. ఇంతవరకు హీరో చాటు పాత్రలకి, గ్లామర్‌కి మాత్రమే పరిమితమైన రకుల్ తనలో మంచి నటి వుందని ఇందులో చూపించింది. భ్రమరాంబగా ఆమె మెప్పించడమే కాదు, ఇకపై భ్రమరాంబ అనే పేరు వింటే తనే గుర్తొస్తుంది అనేంత బాగా చేసింది. జగపతిబాబు, సంపత్ రాజ్‌కి అలవాటైన పాత్రలే ఇవి. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఫర్వాలేదనిపిస్తుంది. మిగిలిన తారాగణంలో కౌసల్య నటన బాగుంది.
తకిట తకజం, భ్రమరాంబకి నచ్చేసాను పాటలతో దేవిశ్రీప్రసాద్ అలరించాడు కానీ తన 'నంబర్‌వన్' హోదాకి తగిన పాటలు కావివి. ఇలాంటి ఫ్యామిలీ సినిమాల రేంజ్ పెరగడానికి, రిపీట్ వేల్యూ రావడానికి మ్యూజిక్ డైరెక్టర్‌నుంచి అత్యుత్తమ కాంట్రిబ్యూషన్ తప్పనిసరి. నేపథ్య సంగీతం, పాటల పరంగా దేవి తన స్థాయికి తగ్గ అవుట్‌పుట్ ఇవ్వలేదు. ఒక ప్రేమకథకి వుండాల్సిన బ్రైట్ విజువల్స్‌తో విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సత్యానంద్ స్క్రీన్‌ప్లే పాత పద్ధతుల్లో సాగింది. కళ్యాణ్‌కృష్ణ రాసిన మాటలు కీలక సన్నివేశాల్లో మంచి ఇంపాక్ట్ వేసాయి. ఏ మాయ చేసావె, ప్రేమమ్‌లాంటి కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్‌స్టోరీస్‌తో ఈ తరాన్ని మెప్పించిన నాగచైతన్య ఈసారి ప్యూర్ రొమాన్స్‌ని కాస్త ఓల్డ్ స్టయిల్‌లో చూపించాడు. చక్కని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ వేడుక కుటుంబ సమేతంగా చూసేట్టుగా దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మలిచాడు.
బాటమ్ లైన్: భ్రమరాంబ నచ్చేస్తుంది!
– గణేష్ రావూరి