తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.? రారా.? అన్న విషయమై చాలా సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే వుంది. వస్తున్నా, వచ్చేస్తున్నా.. అంటారుగానీ, రారాయె. అబ్బే, రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని ఓ సారి అంటారు. అధికారం మీద ఆసక్తి లేకుండా ఎలా వుంటుందని ఆయనే ప్రశ్నిస్తారు. రజనీకాంత్‌కే క్లారిటీ లేనప్పుడు, ఆయన అభిమానుల పరిస్థితి ఇంకెలా వుంటుంది.?
కొత్త రాజకీయ పార్టీ పెట్టాల్సిందేనంటూ రజనీకాంత్ అభిమానుల ఈ మధ్య ఆందోళనల జోరు పెంచారు. కర్నాటకకు చెందిన వ్యక్తి తమిళనాడు రాజకీయాల్ని శాసించాలనుకోవడమేంటి.? అంటూ ఇంటా బయటా ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 'ఇంటా' అంటే, సినీ పరిశ్రమలో. బయట.. అంటే, అందరికీ తెల్సిన విషయమే. మరిప్పుడు ఏం చేయాలి.? అదే అర్థం కావడంలేదు రజనీకాంత్‌కి. 43 ఇయర్స్ ఇండస్ట్రీ (తమిళనాడు వాసిగా) అని రజనీకాంత్ సినిమాటిక్ డైలాగులు చెబితే, 'చాల్లేవయ్యా చెప్పింది..' అంటూ తమిళ జనం పెదవి విరిచేశారు. దాంతో షాక్ అవడం రజనీకాంత్ వంతయ్యింది.
ఇప్పుడిక్కడ రజనీకాంత్ ముందున్నది ఒకే ఒక్క ఆప్షన్. అదే, ఆయన రాజకీయాల్లోకి రావడమంటూ జరిగితే, ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరిపోవాలి. ఆయనకి, తమిళనాడులో డీఎంకే అంటే ఇష్టం. జాతీయ రాజకీయాల్లో అయితే బీజేపీ ఇష్టం. డీఎంకేలో చేరినా ముఖ్యమంత్రి పదవి రాదు. బీజేపీలో చేరితే, కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యే ఛాన్సుంది. ఎన్నికల్లో గెలుపోటములు అనేవి అంత తేలిగ్గా అంచనా వేయగలిగేవి కావు.
రాజకీయ నాయకుడినన్పించుకోవడానికి బీజేపీలో చేరడం తప్ప రజనీకాంత్‌కి మరో మార్గం కన్పించడంలేదు. మరి, రజనీకాంత్ అడుగులు బీజేపీ వైపుగా పడతాయా.? వేచి చూడాల్సిందే.