రారండోయ్ వేడుక చూద్దాం సినిమాపై నాగార్జునకు ఎంత నమ్మకముందో చెప్పడానికి అసలైన ఎగ్జాంపుల్ ఇది. అవును.. డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ నాగ్ మాత్రం ఈ సినిమాను ఎవరికీ అమ్మలేదు. మేజర్ ఏరియాస్ లో తనే సొంతంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
నిజానికి ఇంత రిస్క్ ఎవరూ చేయరు. కాస్త అటుఇటుగా సినిమాను అమ్మేయాలని చూస్తారు. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే ఆ ఎఫెక్ట్ నిర్మాతపై పడదు. కానీ నాగ్ మాత్రం రిస్క్ చేయడానికే రెడీ అయ్యాడు. అత్యంత కీలకమైన నైజాం ఏరియాలో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను తనే సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. కేవలం నైజాం మాత్రమే కాదు, ఏపీలోని మరికొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లో కూడా సొంత రిలీజ్ కే వెళ్తున్నాడు నాగ్.
ఇక మిగతా ప్రాంతాల విషయానికొస్తే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను ఎలాగైతే జాయింట్ వెంచర్ కింద రిలీజ్ చేశాడో.. అలా ఈ కొత్త సినిమాను కూడా పార్టనర్ షిప్ కింద రిలీజ్ చేస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో రారండోయ్ సినిమాను నాగార్జున సొంతంగా విడుదల చేస్తున్నట్టే.
నాగ్ ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి నాగచైతన్యకు ఈమధ్య మార్కెట్ కొంచెం పెరిగింది. ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో సినిమాలకు వసూళ్లు బాగానే వచ్చాయి. కావాలనుకుంటే రారండోయ్ సినిమాను మంచి మొత్తానికే అమ్ముకోవచ్చు. కానీ సినిమాపై ఉన్న అపారమైన నమ్మకంతో నాగ్ ఇలా సొంత రిలీజ్ కు వెళ్తున్నాడు.