బాలీవుడ్ నటీనటులతో పోలిస్తే.. బాహుబలి యూనిట్ మొత్తం తక్కువ పారితోషకాలకే పని చేసింది.. అని అంటోంది జాతీయ మీడియా. బాహుబలి సినిమాలో ప్రధాన పాత్రధారుల రెమ్యూనరేషన్ జాబితాను బట్టి ఈ కామెంట్లు వినిపిస్తున్నాయి. బాహుబలి పార్ట్ వన్ అండ్ టూ లకు సంబంధించి మొత్తం పారితోషకాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ సినిమాకు సంబంధించి అత్యధిక పారితోషకం దర్శకుడు రాజమౌళికే అని సమాచారం. మొత్తం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ప్లస్ లాభాల్లో మూడోవంతు వాటా దర్శకుడికి దక్కినట్టుగా జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే రాజమౌళిది భారీ పారితోషకమే.
ఇక రెండో స్థానంలో ఉంటాడట హీరో ప్రభాస్. ఈయనకు పాతిక కోట్ల వరకూ దక్కిందని సమాచారం. ఇక విలన్ పాత్రధారి రాణాకు పదిహేను కోట్లకు తగ్గకుండా ముట్టిందని తెలుస్తోంది. అనుష్క పారితోషకం ఐదు కోట్ల రూపాయల వరకూ ఉందని, తమన్నాకు నాలుగు నుంచి ఐదు కోట్లు దక్కినట్టుగా నేషనల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
సినిమాకు ఆయువుపట్టులాంటి పాత్రను అవలీలగా పోషించిన రమ్యకృష్ణకు రెండున్నర కోట్ల రూపాయల వరకూ దక్కినట్టుగా, సినిమాపై అత్యంత ఆసక్తిని రేపిన కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కు మిగిలిన వారితో పోలిస్తే తక్కువగా రెండు కోట్ల రూపాయల పారితోషకం లభించిందని సమాచారం.