సినిమా రివ్యూ: రాధ

రివ్యూ: రాధ రేటింగ్‌: 2.75/5 బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర  తారాగణం: శర్వానంద్‌, లావణ్య త్రిపాఠి, అక్ష, రవికిషన్‌, కోట శ్రీనివాసరావు, అలీ, షకలక శంకర్‌, సప్తగిరి, బ్రహ్మాజీ, ఆశిష్‌ విద్యార్ధి, ప్రియ…

రివ్యూ: రాధ
రేటింగ్‌: 2.75/5

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర 
తారాగణం: శర్వానంద్‌, లావణ్య త్రిపాఠి, అక్ష, రవికిషన్‌, కోట శ్రీనివాసరావు, అలీ, షకలక శంకర్‌, సప్తగిరి, బ్రహ్మాజీ, ఆశిష్‌ విద్యార్ధి, ప్రియ తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: రధన్‌
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాత: భోగవల్లి బాపినీడు
రచన, దర్శకత్వం: చంద్రమోహన్‌
విడుదల తేదీ: మే 12, 2017

వందల కొద్దీ రెగ్యులర్‌ చిత్రాల మధ్య ఒక 'బాహుబలి' వచ్చింది. బాక్సాఫీస్‌కి కొత్త లెక్కలు చూపిస్తూ, తెలుగు సినిమా దిక్కుల్ని విస్తృతం చేసింది. ఎప్పటికో కానీ దక్కని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని తనివి తీరా ఆస్వాదిస్తూ ప్రేక్షక లోకం బాహుబలికి కాసుల కోట కడుతోంది. రాజమౌళి సృష్టికి మెచ్చి కోట్ల కుంభవృష్టి కురిపిస్తోంది. బాహుబలి వల్ల వున్నపళంగా సినిమా లోకంలో మార్పులేమీ రావని, ఇకపై ప్రత్యేకమైన చిత్రాలు మాత్రమే వస్తూ వుండవని బల్లగుద్ది చెప్పడానికా అన్నట్టు దాని వెంటే 'రాధ' వచ్చింది. మధ్యలో బాహుబలి చూసి మురిసిపోయి వుండవచ్చు గాక… ఇకపై వారం వారం చూడాల్సింది ఇలాంటి సినిమాలేనంటూ రాధ చెప్పకనే చెబుతుంది. పండగ అన్ని వేళలా రాదు, షడ్రసోపేత విందు ప్రతి రోజూ ఉండదు… అలాగే ఇది కూడా అని సర్దుకుపోవాలి.

రెగ్యులర్‌గా చూసే అనేకానేక సోకాల్డ్‌ కమర్షియల్‌ చిత్రాల్లానే 'రాధ' కూడా 'మెటీరియల్‌' లేకుండా నవ్వించి పంపించడం మీదే దృష్టి పెట్టింది. ప్రథమార్ధం హీరో పాత్ర స్వభావం, అతని ధ్యేయం, అతని ప్రేమని మాత్రం చూపించి, ఇంటర్వెల్‌ దగ్గర అతనికో లక్ష్యాన్ని నిర్దేశించి, ఆ తర్వాత చెడుపై అతను ఎలా గెలిచాడనేది ద్వితీయార్ధంలో చూపిస్తారు. పక్కా తెలుగు సినిమా ఫార్ములాకి అనుగుణంగా సాగే 'రాధ' ఆరంభంలో సరదాగానే వుంటుంది. పోలీస్‌ ఉద్యోగం అంటే తగని పిచ్చి వున్న కథానాయకుడు ఎలాగైనా దానిని సాధించే క్రమంలో వినోదం పండిస్తాడు. ఎప్పుడూ పని చేయడానికి తగిన 'మెటీరియల్‌' వుండాలని కోరుకునే అతడికి అసలు క్రైమ్‌ అంటూ లేని ఊళ్లో పోస్టింగ్‌ పడుతుంది. ఖాళీటైమ్‌లో లవ్‌లో పడతాడు. ఈలోగా అతడికి చేతినిండా పని చెప్పే విలన్‌ ఉన్న ఊరికి బదిలీ అవుతుంది. విలన్‌కి బుద్ధి చెప్పడానికి అతని పంచన చేరి, అతని సామ్రాజ్యాన్ని కూల్చేసి, అతనితోనే చేసిన తప్పులన్నీ చెప్పిస్తాడు.

తెరపై చూడ్డానికి కంటే ఇక్కడ రాయడానికి మరింత రొటీన్‌గా అనిపిస్తోన్న ఈ వ్యవహారాన్ని వినోదాత్మకంగా మలచడంలో శర్వానంద్‌ సక్సెస్‌ అయ్యాడు. అటు 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'లాంటి మూడీ సినిమాల్లో, ఇటు 'రన్‌ రాజా రన్‌' లాంటి సరదా సినిమాల్లో ఈజీగా ఇమిడిపోయే శర్వానంద్‌ ఈసారి అల్లరి పోలీస్‌ పాత్రలో రాణించాడు. ఒక సాధారణ చిత్రాన్ని తన నటనతో శర్వానంద్‌ వీలయినంత నిలబెట్టడానికి చూసినప్పటికీ, మరీ ప్రిడిక్టబుల్‌గా తయారైన స్క్రీన్‌ప్లే అతడి చేతులు కట్టేసింది. ఫస్ట్‌ హాఫ్‌ వరకు అలా అలా సరదాగా సాగిపోయినప్పటికీ ద్వితీయార్ధం అంతా రొటీన్‌గా మారింది. విలన్‌ ఏం చేస్తున్నాడో, హీరో ఏ ఎత్తు వేస్తున్నాడో, తర్వాత ఏమి జరగబోతుందో అన్నీ ముందే తెలిసిపోతూ వుంటాయి. హీరో క్యారెక్టర్‌ కాస్త సీరియస్‌గా మారడంతో ఫస్ట్‌ హాఫ్‌లో ఉన్నంత ఫన్‌కి సెకండ్‌ హాఫ్‌లో స్పేస్‌ లేకుండా పోయింది. చివరకు హీరోయిన్‌ సీన్స్‌ని 'ఇరికిస్తే' తప్ప ఆమె వుందనేది కూడా గుర్తు రానంత బలంగా ఆ పాత్ర తయారైంది. ఆ ట్రాక్‌లో 'మెటీరియల్‌' లోపించడంతో మళ్లీ సెకండ్‌ హీరోయిన్‌ని ఇంట్రడ్యూస్‌ చేసి, అంతవరకు హీరోలో కనిపించని 'కృష్ణుడి' గుణాన్ని హైలైట్‌ చేసేందుకు విశ్వ ప్రయత్నం జరిగింది.

శర్వానంద్‌ యాక్షన్‌ హీరో కాదు కనుక ఫైట్స్‌ అవసరం లేని క్లయిమాక్స్‌తో సరిపెట్టడం వల్ల రన్‌ టైమ్‌ తగ్గింది. ఏది ఏమైనా 'రాధ' మాత్రం ఆది నుంచీ రొటీన్‌గానే సాగుతూ గతంలో చూసిన అనేక చిత్రాలని తలపిస్తూ ముందుకి వెళుతుంది. విలన్‌గా రవి కిషన్‌ అయితే 'రేసుగుర్రం' నుంచి సరాసరి 'రాధ'కి బదిలీ అయినట్టు అనిపిస్తాడు. సప్తగిరి, షకలక శంకర్‌ కామెడీ విషయంలో శర్వానంద్‌కి హెల్ప్‌ అయ్యారు. మిగిలిన నటీనటుల్లో హీరోయిన్‌తో సహా ఎవరూ పెద్దగా చేసిందేమీ లేదు. పాటల్లో గుర్తుంచుకునేదీ, ఇంకోసారి వినాలనిపించేది ఇంకోటి లేదు. శ్రీకృష్ణుడి రిఫరెన్సులతో సంభాషణలు ఆసక్తికరంగా సాగాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సినిమా చాలా కలర్‌ఫుల్‌గా, ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా అనిపిస్తుంది.

ఇదే తీరున చాలా చిత్రాలు చూసినప్పటికీ కాలక్షేపం అయిపోయే కామెడీ వుంది కాబట్టి చాలు అనుకునే వారు 'రాధ'పై పెద్దగా కంప్లయింట్‌ చేయరు కానీ కొత్తదనం వున్న కథలకి ప్రాధాన్యతనిస్తాడనే నమ్మకంతో శర్వానంద్‌ సినిమాకెళ్లిన వారు ఇలాంటి రొటీన్‌ యవ్వారం చూసి నిరాశ పడతారు. స్టోరీలో స్టఫ్‌ లేకపోయినా టైమ్‌ పాస్‌ అయిపోవడానికి కావాల్సిన వినోదాన్ని రంగరించి బాక్సాఫీస్‌ వద్ద పాస్‌ అయిపోవడానికి అనువైన లైఫ్‌ లైన్‌ ఓపెన్‌ చేసి పెట్టుకున్నాడు దర్శకుడు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా పరంగా విప్లవాత్మక మార్పులేమీ రావని, ఎప్పటిలా రొటీన్‌లో పడిపోండనే అంతర్లీన సందేశాన్ని కూడా అందించాడు!

బాటమ్‌ లైన్‌: అదే మెటీరియల్‌!

– గణేష్‌ రావూరి