రాజమౌళితో సినిమా చేసేందుకు ఎవరి పైరవీలు వాళ్లు చేసుకుంటున్నారు. ఫలానా హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ కథనాలు కూడా వస్తున్నాయి. కానీ ఈ స్టోరీల్లో ఎక్కడా మెగా కాంపౌండ్ హీరోలు కనిపించడం లేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. మెగా కాంపౌండ్ తో రాజమౌళికి సన్నిహిత సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం.
రామ్ చరణ్ తో మగధీర సినిమా చేస్తున్న టైమ్ లోనే రాజమౌళికి నిర్మాత అల్లు అరవింద్ కు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయనే టాక్ ఉంది. ఇందులో ఎంత నిజముందో కొందరికే తెలుసు. కానీ మగధీర తర్వాత మళ్లీ మెగా కాంపౌండ్ వైపు రాజమౌళి కన్నెత్తిచూడలేదనే విషయం అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ రాజమౌళిని చూసీచూడనట్టు వదిలేశారు మెగాహీరోలు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
బాహుబలి-2తో రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ స్టార్ దర్శకుల రేంజ్ ను కూడా దాటిపోయాడని చెప్పడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటి డైరక్టర్ తో సినిమా చేస్తే ఏ హీరోకైనా ప్లస్సే. మెగా హీరోలకు కూడా ఇప్పుడు అదే ఆలోచన ఉంది. కానీ జరిగే పనేనా..? రాజమౌళిని తిరిగి కాంపౌండ్ లోకి తీసుకొచ్చేది ఎవరు..?
ఇప్పుడీ బాధ్యతను స్వయంగా చిరంజీవి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అల్లు అరవింద్ రంగంలోకి దిగితే పని జరగదని భావించిన చిరు, స్వయంగా తనే విషయాన్ని సెటిల్ చేసే పనిలో పడ్డారట. ఎలాగైనా రాజమౌళిని తిరిగి కాంపౌండ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట. బాహుబలి-2 హిట్ అవ్వగానే చిరంజీవి స్పందించారు. పేరు పేరున ప్రతి ఒక్కర్ని మెచ్చుకున్నారు.
టాలెంట్ ఉన్న దర్శకుల్ని మెగా కాంపౌండ్ అంత ఈజీగా వదులుకోదు. అతడితో కనీసం 2 సినిమాలకైనా అగ్రిమెంట్ చేసుకుంటుంది. చిరంజీవి జమానా నుంచి ఈ పద్ధతి కొనసాగుతోంది. గతంలో చిరంజీవి ఇలానే సూపర్ హిట్ డైరక్టర్లను రిపీట్ చేశారు. సో.. రాజమౌళి లాంటి దర్శకుడ్ని చూస్తూ వదులుకోదు కాంపౌండ్. కచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. అదే కనుక జరిగితే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రావడం ఖాయం.